మధ్య తరగతికి ‘బడ్జెట్’ గాలం..! | Sakshi
Sakshi News home page

మధ్య తరగతికి ‘బడ్జెట్’ గాలం..!

Published Mon, Aug 4 2014 11:37 PM

Budget 2014: Did it live up to its hype

 న్యూఢిల్లీ: నగరంలో మధ్యతరగతి వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ రాజధానిలో సుమారు 5 నెలలుగా రాష్ట్రపతి పాలన నడుస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అదే ఊపులో ఢిల్లీలో కూడా ఎన్నికలు జరిపిస్తే తమకు అనుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీకి 32, ఆమ్‌ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్‌కు 8 స్థానాలు దక్కాయి. అప్పుడు ఆప్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా 49 రోజులపాటు అధికారంలో కొనసాగిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయింది.
 
 అయితే అప్పుడు కేవలం 4 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కోల్పోయిన తాము ఈసారి మోడీ హవాలో పూర్తి మెజారిటీతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలుగుతామని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నగర బీజేపీ శాఖ ‘బడ్జెట్ పర్ చర్చ’కు శ్రీకారం చుట్టింది.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో నగరానికి చెందిన పలు సమస్యలపై స్థానికులతో భేటీ ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శనివారం ద్వారకా ప్రాంత వాసులు కేంద్ర మంత్రి జైట్లీని కలిసి తమ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యపై చర్చించారు. జైట్లీతో భేటీ సమయంలో ద్వారకా సీజీహెచ్‌ఎస్ ఫెడరేషన్ సభ్యులు అక్కడ ‘వుయ్ వాంట్ వాటర్’ అనే ప్లకార్డ్‌ను ప్రదర్శించారు.
 
 ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ..‘ మేం కేంద్ర మంత్రి ఎదుట ఆందోళన చేయలేదు. మా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. ఢిల్లీలో ప్రభుత్వం లేదు. మా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వరకు అందరినీ కలిశాం. అయినా ఏం ఫలితం లేకుండా పోయింది. బడ్జెట్‌లో నగరంలోని నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. మా ప్రాంత సమస్యను పరిష్కరించమని కోరడానికే మేం మంత్రిని కలిశాం..’ అని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సుధాసిన్హా తెలిపారు.
 
 తమ ప్రాంతానికి ప్రతిరోజూ 12 ఎంజీడీ నీళ్లు అవసరముండగా కేవలం 3.5 మిలియన్ గ్యాలన్లు మాత్రమే సరఫరా అవుతోందని వారు వాపోయారు.‘ఇక్కడ గెలిచిన ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలే పేర్కొంది. అయితే నగరంలో 1,518 అనధికార కాలనీలున్నాయి. వాటి అభివృద్ధికి కేటాయించిన రూ.3,000 కోట్ల నిధులను విభజిస్తే ఒక్కో కాలనీకి రూ.2 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఆ నిధులతో సదరు మురికివాడలో అభివృద్ధి పనులు ఏమేరకు నడుస్తున్నాయో మనకు తెలిసిందే.. ఆయా కాలనీల్లో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం 2013 తర్వాత తీసుకుందే.. దీంతో కాంగ్రెస్ సర్కార్‌కు ఎటువంటి సంబంధం లేదు.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విషయంపై బీజేపీ, ఆప్ రాద్ధాంతం చేస్తున్నాయ’ని ఆయన ఆరోపించారు.
 
 తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే మిగిలిన అనధికార కాలనీలనూ అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారం నుంచి తప్పుకున్న తర్వాత ఇప్పటివరకు ఆయా మురికివాడల్లో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు. గుజరాత్‌లో రూ.27,600 కోట్ల అవకతవకలు జరిగినట్లు బయటపెట్టిన కాగ్ నివేదికపై బీజేపీ, ఆప్ ఎందుకు మాట్లాడటంలేదని కాంగ్రెస్ నాయకుడు హరూన్ యూసుఫ్ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఒక పారిశ్రామికవేత్త సాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వలస పోతున్నారని తమకు సమాచారముందన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేజ్రీవాల్ జాగ్రత్త పడాలని ఆయన హితవు పలికారు.
 

Advertisement
Advertisement