Sakshi News home page

యువతకే చాన్స్

Published Mon, Feb 24 2014 11:39 PM

యువతకే చాన్స్

 కరుణ నిర్ణయం
 మరికొద్ది రోజుల్లో తొలి జాబితా
 అధికారుల జాబితా కోసం  ఈసీకి వినతి
 
 రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేయడానికి డీఎంకే అధినేత  ఎం కరుణానిధి నిర్ణయించారు. యువజన విభాగానికి చెందిన నాయకులతో తొలి జాబితాను మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ను డీఎంకే కోరింది.
 
 సాక్షి, చెన్నై:
 ఓ వైపు కూటమి ప్రయత్నాలు, మరో వైపు అభ్యర్థుల ఎంపికలో డీఎంకే అధిష్టానం బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. పార్టీ తరపున ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్న ఆశావహులను ఈనెల 20 నుంచి ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు వేగం పుంజుకున్నారుు. సగం నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు ముగిశాయి. ఇందులో ఎక్కువ శాతం యువతను అభ్యర్థులుగాఎంపిక చేయడానికి కరుణానిధి నిర్ణయించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్ల కన్నా, యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ఆలోచనలో కరుణానిధి ఉన్నారు. పార్టీకి వెన్నెముకగా యువజన విభాగం ఉండటం, దానికి స్టాలిన్ నేతృత్వం వహిస్తుండటంతో ఆ విభాగంలోని నాయకులకు మెజారిటీ శాతం సీట్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. అన్నాడీఎంకే జాబితాలో కొత్త ముఖాలు ఉండటంతో, తాము యువతకు పెద్ద పీట వేసే రీతిలో జాబితాను సిద్ధం చేస్తున్నట్టు డీఎంకే  నేత ఒకరు పేర్కొన్నారు.
 
 ఈసీకి లేఖాస్త్రం: కరుణానిధి సూచన మేరకు డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకోబోమని ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, తమిళనాడు ప్రభుత్వం జిమ్మిక్కులు చేసే అవకాశాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు ఉపయోగ పడే అధికారుల జాబితాను ఎన్నికల యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ జాబితాలో ఉన్న అధికారుల పేర్లు, వివరాల్ని వెబ్ సైట్‌లో తప్పని సరిగా పొందు పరచాల్సిందేనని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు గత అనుభవాల్ని ఎత్తి చూపుతున్నదని, ఈ దృష్ట్యా, ఎన్నికల  అధికారుల పేర్లు, వివరాలు ముందుగానే తెలియజేయాలని డిమాండ్ చేశారు.  
 
 

Advertisement

What’s your opinion

Advertisement