మునాక్ కాలువ వివాదాన్ని పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

మునాక్ కాలువ వివాదాన్ని పరిష్కరించండి

Published Fri, Apr 18 2014 11:30 PM

మునాక్ కాలువ వివాదాన్ని పరిష్కరించండి

 జీఓఎం సమావేశానికి హైకోర్టు ఆదేశం
 
 న్యూఢిల్లీ : మునాక్ కాలువ ద్వారా ఢిల్లీ రాజధానికి అందించే నీటి విషయంలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రు ల బృందం (జీఓఎమ్) జూన్ మొదటి వారంలో సమావేశం కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జీఓఎం సమావేశం నిర్వహించి, తదుపరి విచారణకల్లా పరిస్థితిపై ఓ నివేదిక సమర్పించాలని జలవనరుల శాఖకు జస్టిస్ హిమా కోహ్లీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒకవేళ నివేదిక సమర్పించలేకపోతే సంబంధిత శాఖా సంయుక్త కార్యదర్శి  కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ జలబోర్డుకు ఈ కాలువ ద్వారారోజుకి 80 మిలియన్‌గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. 744 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మూడు నీటిశుద్ధి కేంద్రాలకు పంపించి, తద్వారా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా చేస్తోంది.

 జీఓఎం మార్చి 6న జరిగిన సమావేశానికి అనారోగ్య కారణంగా కేంద్రమంత్రి కపిల్‌సిబల్ హాజరు కాలేకపోయినందున ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జలవనరుల శాఖ కోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సమావేశం నిర్వహించి ద్వారకా, బవన, ఓఖ్లా నీటిశుద్ధి కేంద్రాలకు నీరు సరఫరా చేసి పనులు తొందరగా ప్రారంభమయ్యేటట్లు చూస్తామని ఢిల్లీ జలబోర్డు తరపు న్యాయవాది సుమీత్ పుష్కర్ణ కోర్టుకు నివేదించారు. మూడు నీటిశుద్ధి కేంద్రాల్లో పనులు ప్రారంభమయితే ప్రస్తుతం నిత్యావసరాలకోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్న ద్వారక, దానిచుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఉండదని స్థానికు లు అంటున్నారు.

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయని, తమకు ఢిల్లీ జలబోర్డు ఒక్కనీటి చుక్క కూడా ఇవ్వక 20 ఏళ్లు దాటిపోయిందని ఆరోపిస్తూ మహవీర్ ఎన్‌క్లేవ్ కాంప్లెక్స్ కాలనీల వెల్ఫేర్ కాన్ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పై ఆదేశాలిచ్చింది.

నంగ్లోయి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ఎలాం టి అంతరాయం లేకుండా తమకు నీటి సరఫరా చేయాలని కోరుతూ 1994లో ఢిల్లీ జలబోర్డుకు 34లక్షలు చెల్లించామని అసోసియేషన్ ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ద్వారకా నీటిశుద్ధి కేంద్రం పనిచేయకపోవడంవల్ల తాము నీటి సరఫరా చేయలేకపోతున్నామంటూ డీజేబీ తప్పించుకుంటోందని అందులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement