రాజధానిలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు | Sakshi
Sakshi News home page

రాజధానిలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు

Published Fri, Aug 16 2013 11:59 PM

heavy rain lashed the national capital on Friday morning

న్యూఢిల్లీ: రాజధానితోపాటు ఉపనగరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లన్నీ జలమయంగా మారడంతో వాహన సంచారంపై తీవ్ర ప్రభావం పడింది. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌జామ్‌లు కని పించాయి. శనివారం ఉదయం వరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణశాఖ ప్రకటించింది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే భారీ వర్షాలు మొదలయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీళ్లన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో వాహన సంచారానికి తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ‘డ్రైనేజీలు పొంగి పొర్లడం వల్ల రోడ్లపైకి నీళ్లు చేరి ఇబ్బందులు ఏర్పడ్డాయి. 
 
 టాఫిక్‌జామ్‌లపై వాహనదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దక్షిణ ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది’ అని ట్రాఫిక్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని లాలాలజ్‌పత్ రాయ్ మార్గ్, అడ్చిని, శ్రీఅరబిందో మార్గ్‌లో ట్రాఫిక్ నత్తనడకను తల పించింది. గుర్గావ్, నోయిడావైపు వెళ్లే మార్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ‘నేను రింగురోడ్డుపై చిక్కుకున్నాను. వర్షం కురిసిన మరుక్షణమే వాహనాలన్నీ ఎందుకు స్తంభిస్తాయో నాకు అర్థం కాదు’ అంటూ దక్షిణఢిల్లీవాసి ఆకాంక్ష సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా వాహనాలు స్తంభించడంతో ఉద్యోగులు తీవ్ర ఇక్కట్ల పాల య్యారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ సిగ్నళ్లు కూడా పనిచేయలేదు. ‘నేను ఉదయం పదింటికి ఆఫీసుకు చేరుకోవాలి. మధ్యాహ్నం వరకు కూడా వెళ్లలేకపోయాను. సిగ్నళ్లు పనిచేయలేదు. కానిస్టేబుళ్లు ఎక్కడా కనిపిం చలేదు. 
 
 నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని గ్రీన్‌పార్కు వద్ద కనిపించిందన సేల్స్ ఉద్యోగి రవీశ్ సేథీ ఆవేశంగా చెప్పారు. ఉత్తర ఢిల్లీలోని జీటీబీ రోడ్డు, తూర్పుఢిల్లీలోని అక్షర్‌ధామ్ మందిర్, మధ్యఢిల్లీలోని మింటోరోడ్డు ప్రాంతాల రోడ్లపైకి నీళ్లు చేరాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. దక్షిణఢిల్లీలోని ఆగస్ట్ క్రాంతిమార్గ్, భీష్మపితామహ్ మార్గ్, సాకేత్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాల్లోనూ వాహనాలకు ఇబ్బందులు తప్పలేదు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 15.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణశాఖ ప్రకటించింది. శనివారం కూడా వర్షానికి అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల వరకు నమోదు కావొచ్చని తెలిపింది. ఢిల్లీని జూన్‌లో రుతుపవనాలు పలకరించాయి. ఇప్పటి వరకు నగరంలో 539.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వార్షిక సగటు కంటే ఇది 29 శాతం ఎక్కువ. 

Advertisement

తప్పక చదవండి

Advertisement