‘న్యూఢిల్లీ’లో ఆసక్తికర పోటీ | Sakshi
Sakshi News home page

‘న్యూఢిల్లీ’లో ఆసక్తికర పోటీ

Published Thu, Nov 21 2013 12:38 AM

interesting competition in newdelhi elections

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 నియోజకర్గాలలో అత్యంత ఆసక్తికరమైన పోటీ న్యూఢిల్లీ నియోజకవర్గంలో జరుగనుంది. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి  అర్వింద్ కేజ్రీవాల్, బీజేపీ  మాజీ అధ్యక్షుడు  విజేందర్ గుప్తా తలపడుతున్నారు. తొలిసారిగా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేజ్రీవాల్ షీలాపై గెలిచి తీరుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రచార పథంలో ముందుకు దూసుకెళుతున్నారు. బీజేపీ నాయకుడు విజేంద్ర గుప్తా కూడా తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, ఢిల్లీ రూపు రేఖలు మారిపోతాయని ప్రజలను తనవైపుకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూస్తానని ఓటర్లకు హామీని ఇస్తున్నారు. అయితే వరుసగా  నాలుగోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న షీలాదీక్షి త్‌కు ఈ ఎన్నికలలోనే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
 షీలాదీక్షిత్ ఢిల్లీలో తన ఎన్నికల రాజకీయాలను పరాజయంతోనే ప్రారంభించారని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. 1998లో తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆమె ఓడిపోయారని వారంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీపై దృష్టి సారించారని, అప్పటినుంచి ఆమెను విజయలక్ష్మి వరించిందని చెబుతున్నారు. 2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గాన్ని గోల్ మార్కెట్ నియోజకవర్గంగా పేర్కొనేవారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇది న్యూఢిల్లీ నియోజకవర్గంగాా మారింది. అయితే 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తొలిసారిగా  జరిగినప్పటి నుంచి  ఈ  నియోజకవర్గాన్ని ఒక్కసారి మాత్రమే బీజేపీ గెలుచుకుంది. బీజేపీ నాయకుడు కీర్తి ఆజాద్ కాంగ్రెస్‌కు చెందిన బ్రిజ్‌మోహన్ భామాను ఓడించారు. ఆ తర్వాత నుంచి షీలాదీక్షిత్   బరిలోకి దిగి ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. 1998లో ఆమె కీర్తి ఆజాద్‌ను, 2003లో కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్‌ను, 2008లో విజయ్ జోలీని ఆమె ఓడించారు. షీలాదీక్షిత్ ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి ఈ నియోజకవర్గం నుంచి మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈసారి కూడా మహిళలు అత్యధిక సంఖ్యలో  పోటీపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా అత్యధికంగా ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఈసారి పోటీచేస్తున్న 25 మందిలో పది మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.  
 
 వీవీఐపీ ఓటర్లు ఎక్కువే
 న్యూఢిల్లీ అభ్యర్థులపరంగానే కాక ఓటర్లపరంగానూ హేమాహేమీలున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మాజీ ప్రధాని, ప్రతిపక్ష నేతలు, అధికార పక్షనేతలు  పలువురు ఈ నియోజకవర్గ ఓటర్ల జాబితాలోనే ఉన్నారు. న్యూఢిల్లీ ఓటర్ల సంఖ్య 1,21 లక్షలుగా ఉంది. వీరిలో అత్యధికులు ప్రభుత్వోద్యోగులే. దక్షిణ భారతీయుల సంఖ్య కూడా భారీగానే ఉంది.  లూటియన్స్ జోన్ వంటి వీఐపీ జోన్‌తోపాటు గోల్ప్ లింక్స్‌వంటి సంపన్న ప్రాంతాలవాసులతో పాటు కాలీబాడీ మార్గ్, తుగ్లక్  క్యాంప్ మురికివాడలు, సర్వెంట్ క్వార్టర్లలో నివసించే పేదలు ఈ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో ఉన్నట్టుగా గతుకుల రోడ్లు, మౌలిక సదుపాయాల కొరత వంటి అభివృద్ధిపరమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అయితే నిత్యావసర సరుకుల ధర పెరుగుదల తమను బాధిస్తోందని ఇక్కడి ఓటర్లంటున్నారు.
 

Advertisement
Advertisement