షీలాకు ఏమీ చేతకాదు | Sakshi
Sakshi News home page

షీలాకు ఏమీ చేతకాదు

Published Mon, Sep 30 2013 2:55 AM

Modi criticized the on Congress

 ప్రారంభోత్సవాల్లో రిబ్బన్లు కత్తిరించడం మినహా ముఖ్యమంత్రికి వేరే పనేమీ లేదంటూ నరేంద్రమోడీ షీలా దీక్షిత్‌పై మండిపడ్డారు. ఏ సమస్య వచ్చినా నెపాన్ని వేరేవారిపై నెట్టేయడం ఆమెకు అలవాటని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 శాతం విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోయల్ ప్రకటించారు. 
 
 సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. రోహిణి జపనీస్‌పార్క్‌లో ఆదివారం నిర్వహించిన వికాస్‌ర్యాలీ సభలో కాషాయపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తూటాల్లాంటి మాటలతో విజృంభించారు. కాంగ్రెస్ పార్టీ పోకడలు, ఆ పార్టీ నాయకుల తీరుతెన్నులపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ ర్యాలీలో నరేంద్రమోడీ సహా పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ పార్టీ కార్యకర్తలు, యువతతో జపనీస్‌పార్క్ జనసంద్రమైంది. బీజేపీ జెండాల రెపరెపలతో ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. ‘నమో’ రాకతో ఢిల్లీ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టించింది.  
 
 వికాస్‌ర్యాలీ వేదికపై నుంచి నరేంద్రమోడీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ధ్వజమెత్తారు. ప్రతి అంశాన్ని తనపరిధిలో లేదంటూ చెప్పుకుంటూ 15 ఏళ్లుగా ప్రజాసమస్యలు పట్టకుండా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారంటూ ఆమెపై విమర్శలు గుప్పిం చారు. ‘నాకు తెలిసినంత వరకు దేశంలోనే అత్యంత సులభమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది  ఢిల్లీ ప్రభుత్వమే! కేవలం ప్రారంభోత్సవాల పేరిట రిబ్బన్లు కట్ చేయడం మినహా ఢిల్లీ ముఖ్యమంత్రికి చేయడానికి పనేమీ ఉండదు. ఆమె పరిధిలో ఏ అంశమూ ఉండదు. వ్యవసాయం, పర్యావరణం, రోడ్లు, శాంతిభద్రతలు ఇలా ఏదీ ఉండదు. ఏది జరిగినా తన పరిధిలో లేదంటూ ఇతరులపై విమర్శలు చేయడమే సీఎం షీలాదీక్షిత్ పని. రోడ్లపై గోతులు ఏర్పడ్డాయంటే ఎంసీడీలవైపు చూపిస్తారు. 
 
 అత్యాచారాలు పెరిగాయంటే నా చేతుల్లో శాంతిభద్రతలు లేవంటారు. ఆమెకు జవాబుదారీతనంలేదు. ఇతరులను బలిపశువులు చేయడమే సీఎంగా షీలా పని’ అని తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. కామన్వెల్త్‌గేమ్స్ పేరిట రూ.వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తున్న ‘డర్టీటీం’ పాలన ఢిల్లీలో కొనసాగుతోందని మోడీ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్తుపై స్పృహ లేదన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అభివృధ్ధి, భవిష్యత్తుపై ఆలోచన ఉన్న డ్రీమ్‌టీం (బీజేపీ) అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఈ ఎన్నికల్లో డర్టీటీమ్‌కు ఓటు వేస్తారో డ్రీమ్‌టీమ్‌కు ఓటు వేస్తారో తేల్చుకోవాలన్నారు. మోడీ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు ‘నమో..నమో’ అంటూ యువ త పెద్దపెట్టున నినాదాలు చేశారు. మధ్యమధ్యలో ఆగుతూ..ప్రసంగాన్ని కొనసాగించారు మోడీ. 
 
 బహిరంగ చర్చకు సిద్ధమా: గోయల్
 బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ సైతం సీఎం షీలా దీక్షిత్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. 15 ఏళ్ల పాలనలో ప్రజలు ఏమేరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ షీలాదీక్షిత్‌కి సవాల్ విసిరారు. ఢి ల్లీ చరిత్రలో ఈ తరహా ర్యాలీ ఎప్పుడూ జరగలేదని. ఇక్కడికి తరలివచ్చిన వారిని చూస్తేనే కాంగ్రెస్‌పై వారు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతుందన్నారు. ‘ఢిల్లీ, కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను విసిరిపారేసేందుకు మీరూ నాతో సిద్ధంగా ఉన్నారా’ అంటూ పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 శాతం విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని గోయల్ ప్రకటించారు. ఢిల్లీలో తన కూతురికి సైతం రక్షణ లేదంటూ ముఖ్యమంత్రి షీలా దీక్షితే స్వయంగా ప్రకటించారని, తాము అధికారంలోకి వస్తే అలాంటి దుస్థితి ఉండదని, ప్రతి ఒక్కరి రక్షణ చూసుకుంటామని హామీ ఇచ్చారు. గుజరాత్ తరహాలో ఢిల్లీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
 
 మోడీని చూసి భయపడుతున్నారు: గడ్కరీ
 బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని చూసి కాంగ్రెస్ నాయకులు వణుకుతున్నారని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ విధానసభ ఎన్నికల ఇన్‌చార్జీ నితిన్ గడ్కరీ అన్నారు. దేశాన్ని కాపాడాలంటే నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. విధానసభ ఎన్నికల్లో బీజేపీ గె లుపునకు ఈ ర్యాలీ నాందిపలికిందని గడ్కరీ వ్యాఖ్యానించారు.
 

Advertisement
Advertisement