Sakshi News home page

శివ.. శివా!

Published Mon, Aug 25 2014 2:56 AM

శివ.. శివా! - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ :వాడిన టికెట్‌నే మళ్లీ మళ్లీ వాడడం.. అంటే రీసైక్లింగ్... దర్శనానికి వెళ్లే భక్తులకు ఇచ్చిన టికెట్లనే అటు తిప్పి ఇటు తిప్పి అంటగడుతున్నారు. ఫలితం దేవాలయానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతోంది. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవస్థానంలో జరిగే వ్యవహారాల గురించి తెలుసుకుంటే ఔరా! అని ముక్కున వేలేసుకోకతప్పదు. భక్తుల తాకిడితో సంబంధం లేకుండా దర్శనం టికెట్ల రీసైక్లింగ్ జరుగుతోంది. సాధారణ రోజుల్లో దర్శనం టికెట్ ధర రూ.10 కాగా, అమావాస్య రోజు మాత్రం రూ.50 వసూలు చేస్తున్నారు. అదీ రూ.20 అని ముద్రించి ఉన్న టికెట్లపైనే యాబై రూపాయల స్టాంప్ వేస్తున్నారు.
 
 ఒక భక్తుడికి ఇచ్చిన టికెట్‌నే కనీసం ముగ్గురు నలుగురి చేతులు మారేలా రీ సైక్లింగ్ చేస్తుండడంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. డబ్బులు చేతులు మారడంతో ఎలాంటి ప్రకటన లేకుండానే ముగ్గురు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారని సమాచారం. ఒక పూజారి, మరో ఇద్దరిని ఆఫీసు స్టాఫ్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేసే సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ప్రధాన ఆల యం కాకుండా ‘మూడు గుండ్లు’ వద్ద కూడా పూజారులు ఉండాలి. కానీ, ఇక్కడ పూజారులు ఉండకుండా పిల్లలనే పెడుతున్నారని తెలుస్తోంది.
 
 ఇక, లడ్డూ ప్రసాదం తయారీ వద్ద ఇద్దరు బాలకార్మికులను నిబంధనలకు విరుద్ధంగా పనిలోకి తీసుకున్నారని తెలిసింది. ఆదాయపరంగా చెర్వుగట్టు జిల్లాలో యాదగిరిగుట్ట తర్వాత రెండో స్థానంలో ఉంటోంది. కేవలం తలనీలాల టెండరు ద్వారానే ఏటా రూ. 1.50కోట్లు, కిరాణం షాపుల ద్వారా రూ.16లక్షలు, కొబ్బరి చిప్పల ద్వారా రూ.30లక్షల ఆదాయం సమకూరుతోంది. ఇక,  ప్రతినెలా కనీసం రూ. 20లక్షలు హుండీ ద్వారానే సమకూరుతోంది. సోమ, శుక్రవారాలతోపాటు ప్రతినెలా ఆమావాస్య రోజు చెర్వుగట్టుకు భక్తులు పోటెత్తుతారు. ఒక్క అమావాస్య రోజు రమారమి 2లక్షల మంది భక్తులు నిద్ర చేయడానికి వస్తున్నారని, ఈ ఆదాయం అంతా ఎటుపోతుందో తెలియడం లేదని పేర్కొంటున్నారు.
 
 అర్చన, అభిషేకం టికెట్లలోనూ..
 దర్శనం టికెట్ల రీసైక్లింగ్‌తోపాటు అర్చన, అభిషేకం టికెట్ల విషయంలోనూ మాయాజాలం నడుస్తోందని సమాచారం. సాధారణంగా అభిషేకానికి రూ.200 వసూలు చేస్తుండగా, అదే ఉదయం వేళలో ఏకంగా రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. మొత్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం ఉన్న చెర్వుగట్టు ఆలయంపై చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ ఆదాయం పెంచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ  జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినా, వారు పట్టించుకోని కారణంగానే చెర్వుగట్టుపై అనైతిక వ్యవహారాల జోరు పెరిగిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.
 

Advertisement

What’s your opinion

Advertisement