Sakshi News home page

రెండో పంట ఇక కల్లే..!

Published Wed, Nov 19 2014 3:31 AM

రెండో పంట ఇక కల్లే..!

 మంచిర్యాల రూరల్ : మంచిర్యాల నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీటిని అందించేందుకు కడెం ప్రాజెక్టు నుంచి కాలువలను ఏర్పాటు చేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మూడు మండలాల్లోని పంట పొలాలకు కడెం నీరు అందాల్సి ఉన్నా, కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో, చివరి వరకు నీరు అందడం లేదు.

మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల గ్రామాల వరకు కడెం కాలువ ఉన్నా, నీరు రాకపోవడంతో ఆ కాలువలు కబ్జాకు గురై చుక్క నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో రూ. 33 కోట్లతో మండలంలోని ముల్కల్ల గ్రామంలో ర్యాలీ వాగు ప్రాజెక్టును 2009, ఫిబ్రవరి 23న అప్పటి దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.

ప్రాజెక్టు నీటి మట్టం 151.5 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 151.1 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి సాగునీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాలువలను తవ్వి, సిమెంటు లైనింగ్ చేయకపోవడంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, నాచు పెరిగిపోయి నీరు పారడం లేదు. కాలువలు తెగిపోయి, నీరు వృథాగ పోతుండడంతో, ప్రాజెక్టు నీటిని సరఫరా చేయడం లేదు. కాలువల మరమ్మతు లేక ప్రస్తుత ఖరీఫ్‌లో వేసిన 3 వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందకుండా పోయింది.

ఇటీవల ర్యాలీవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి బడ్జెట్‌లో కోటి రూపాయలను కేటాయించడంతో, అవి పూర్తిస్థాయిలో సరిపోవని రైతులు అంటున్నారు. ముందుగా కాలువలను ఆధునికీకరించి, పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లేదంటే వచ్చే రబీకి కూడా సాగునీరు అందకుండా పోతుందని,
 ప్రాజెక్టు నిండా నీరున్నా నిష్ర్పయోజనమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని ఆయకట్టు 6 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం సాగయ్యేది 3 వేల ఎకరాలే.

 గడ్డెన్నవాగు ప్రాజెక్టు
 భైంసా : 2008లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 14 వేల ఎకరాలకు సాగునీరందిస్తూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులు ప్రణాళికలు వేసి ప్రాజెక్టును నిర్మించారు. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 357.6 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టం 356.5 మీటర్లుగా ఉంది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 355.0 మీటర్ల మేర నీటి నిల్వ ఉంచుతారు. ప్రస్తుతం 1.6 మీటర్ల నీటి మట్టం పెరిగి ఉంది. ప్రస్తుతం కాలువల నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడు కూడా ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు నీరు అందదు.

 స్వర్ణ ప్రాజెక్టు
 సారంగాపూర్ : నిర్మల్, సారంగాపూర్ మండలాల ప్రజల వరప్రదాయిని అయిన స్వర్ణ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. గతంలో 1180 వరకు ఉన్న నీటిమట్టం ఐదు అడుగుల వరకు తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1175 అడుగులకు చేరుకుంది. రబీ సాగుకు తైబందు విధించి కేవలం మధ్య కాలువ ద్వారా రబీ సాగుకు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపర్చలేదు.
 
వట్టివాగు ప్రాజెక్టు
 ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టును 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రూ.100 కోట్లతో నిర్మించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లోని 24,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. అంటే లక్ష్యం ప్రకారం చూస్తే కనీసం పది శాతం కూడా నీరందించడం లేదన్నమాట. కాగా, ఈ ఏడాది రూ.35 లక్షలతో కాల్వల మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 239.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 237.8 మీటర్ల నీరు నిల్వ ఉంది.
 
కొమురంభీమ్ ప్రాజెక్టు
 ఆసిఫాబాద్ : మండలంలోని అడ గ్రామం వద్ద రూ.450 కోట్లతో నిర్మిస్తున్న కొమురంభీమ్ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. కాల్వల ద్వారా ఈ ఏడాది కూడా సాగునీరందే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరున్నా అసంపూర్తి కాల్వల నిర్మాణంతో సాగు నీరదంని దుస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల ద్వారా 45,600 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా, అటవీ శాఖ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 239.5 మీటర్లు నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు సమీపంలోని వాంకిడి మండలానికి చెందిన  కొంతమంది రైతులు మోటార్లతో నీటిని పంట పొలాలకు అందిస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement