ఆంగ్ల మాధ్యమంపై ప్రజాభిప్రాయ సేకరణ | Sakshi
Sakshi News home page

ఆంగ్ల మాధ్యమంపై ప్రజాభిప్రాయ సేకరణ

Published Fri, Apr 15 2016 3:12 AM

referendum to English medium

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయాలని ప్రజల వినతి
విద్య చైతన్య యాత్రలో  ప్రజాభిప్రాయ సేకరణ

 
 జన్నారం : ‘మాకు ముగ్గురు పిల్లలు. వారిని చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. పైసలు చాలక అప్పులు చేస్తున్నాం. అప్పులు చేసైనా సరే మా పిల్లలను ఇంగ్లీష్‌మీడియం చదివించాలనుకున్నాం. ఖర్చు ఎక్కువైతున్నా మా పిల్లాడిని జన్నారం ప్రైవేట్ స్కూల్‌కు పంపిస్తున్నాం. మీరైతే మీ పిల్లలను తెలుగుమీడియంలో చదివిస్తారా..? మా పిల్లలకు కొలువులు రావద్దా.. సర్కారు బళ్లల్లో ఇంగ్లీష్‌మీడియం చెబితేనే మా పిల్లలను పాఠశాలకు పంపుతాం. పైసలు కూడా మిగులుతాయి’ అని ఉపాధ్యాయ సంఘ నాయకులతో ధర్మారంలోని రూప్‌నాయక్ తండాకు చెందిన బుక్య సునిత అనే మహిళ పేర్కొన్నారు.

తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ (పాఠశాలల బలోపేత ఉపాధ్యాయ సంఘం) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్త విద్యచైతన్య యాత్రల్లో భాగంగా రేండ్లగూడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి  తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఎలా ఉంటే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారనే అంశాలపై వారు ఇంటింటికీ వెళ్లి అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న మాట్లాడుతూ రోజు రోజుకూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, అందుకే పాఠశాలలు ఎలా ఉంటే ప్రజలు ప్రభుత్వ బడులకు పంపుతారనే ఉద్దేశ్యంతో సంఘం అధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. ఈ సేకరణలో పూర్తి వివరాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సీఎస్టీ టీఏ రాష్ట్ర సహా అధ్యక్షుడు బానవత్ ప్రకాశ్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు  తుంగూరు గోపాల్,  ఖానాపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement