Sakshi News home page

రాజ్యమూ, రాజధానీ లేని.. నరసింహావతారం నాది

Published Fri, May 5 2017 1:37 AM

రాజ్యమూ, రాజధానీ లేని.. నరసింహావతారం నాది - Sakshi

- నా చివరి కోరిక ఒక్కటే.. రెండు రాష్ట్రాలూ సాయం చేసుకోవాలి
- సీఎంలిద్దరూ ఇరు రాష్ట్రాలూ పర్యటిస్తుండాలి
- హైటెక్‌ అభివృద్ధి ఒక్కటే చాలదు.. ప్రజావసరాలనూ తీర్చాలి
- త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం


సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాలు విభజన సమస్యలను అధిగమించి అభివృద్ధి దిశగా పోటీ పడుతున్నాయని ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘రెండు రాష్ట్రాల మధ్య శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొల్పే దిశగా నా పాత్ర ముగిసింది. ఇప్పుడు ప్రగతి కాముక పాత్ర పోషిస్తా’’అని పేర్కొన్నారు. పదేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన నర సింహన్‌ పదవీకాలం మే 2న ముగియడం, మరికొంతకాలం ఆయననే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యం లో గురువారం ‘సాక్షి’కి గవర్నర్‌ ఇంటర్వూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...

నాది నరసింహావతారం
రాజధాని లేని రాష్ట్రాల్లో గవర్నర్‌గా పని చేయ టం నాకో కొత్త అనుభవం. ఛత్తీస్‌గఢ్‌ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు అక్కడ గవర్నర్‌గా ఉన్నాను. ప్రత్యేక ఉద్యమం సమయంలో ఏపీకి వచ్చి కొత్త రాష్ట్రంలో కొనసాగుతున్నా. నాది పురాణాల్లో నరసింహావతారంలా ఉంది. మిగ తా అవతారాలకు రాజ్యం, రాజధాని ఉంటా యి. నరసింహావతారానికి మాత్రం అవేవీ ఉండవు. నా అనుభవమూ అదే తీరుగా ఉంది.

విద్య, వైద్యాల్లో చాలా చేయాలి
ఇద్దరు సీఎంలూ అభివృద్ధిపై దృష్టి సారిస్తు న్నారు. నా దృష్టిలో అభివృద్ధి రెండు రకాలు. ఒకటి హైటెక్‌. రెండోది ప్రజా కోణం. ప్రజావ సరాల కేంద్రంగా పాలన ఉండాలని నేను కోరుకుంటాను. నీరు, కరెంటు, విద్య, వైద్యం, భద్రత ప్రజలకు అవసరాలు. అన్నీ ఉన్నాక కంప్యూటర్‌ ఇస్తే ఉపయోగం. రెండు రాష్ట్రాలు నీరు, కరెంటు, ఆహార భద్రత, గృహ నిర్మా ణంపై దృష్టి సారిస్తున్నాయి. విద్య, ఆరోగ్యా లపై చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది.

బడ్జెట్‌లో రైతుకు అనామక నిధి
విపత్తుల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రెండు రాష్ట్రాలు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఆ విషయాన్ని ముందుగానే ప్రకటిస్తే కరువు, విపత్తులంటూ రోజుకో ఆందోళన వస్తుంది. కాబట్టి ముందుగా ప్రకటించకుండా ఆ పద్దును అనామకంగా నిర్వహించాలి. రైతులు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక పద్దు పేరుతో వారిని ఆదుకునేలా వెసులుబాటు కల్పించాలి. అప్పుడు ప్రతిసారీ కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే సమస్యను పరిష్కరించవచ్చు. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం కొనుగోళ్ల విధానం పక్కాగా అమలవుతుంది.

అక్కడ ఏ రైతు తన పంటను ఎవరికి అమ్మిందీ రాజ్‌భవన్‌లో కూర్చొని కూడా తెలుసుకునే వీలుంది. పంట ఉత్పత్తులకు మద్దతు ధర అందించేందుకు ప్రత్యేక విధానా న్ని అనుసరించాలి. ఒకోసారి కరువు, వర్షాల తో నష్టాలొస్తాయి. ఎక్కువ దిగుబడి వచ్చిన ప్పుడు మద్దతు ధర సమస్య. అందుకే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సదుపాయాలు ఎక్కువగా ఉండాలి. ధర ఉన్నప్పుడు అమ్ము కునే వీలుంటుంది. తెలంగాణలో మిర్చి రైతుల ఆందోళన కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో సద్దుమణుగుతుందని అనుకుంటున్నాను.

పీస్‌ మేకర్‌.. పేస్‌ మేకర్‌
నేనిప్పటిదాకా పీస్‌ మేకర్‌ (శాంతిస్థాపక) పాత్ర పోషించాను. ఆ పాత్ర ముగిసిందను కుంటున్నా. ఇప్పుడిక పేస్‌ మేకర్‌ (ప్రగతి కాముక) పాత్ర పోషిస్తా. అంటే అభివృద్ధి దిశగా కార్యాచరణ వేగవంతం చేస్తా. నా వంతుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటా. పర్యవేక్షణతో పాటు ప్రజాహిత కార్యక్రమాల్లో భాగస్వామినవుతా.

దటీజ్‌ మై లాస్ట్‌ డ్రీమ్‌
ఉద్యమం పరిస్థితులకు, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చింది. ఒక ఇంట్లో అన్నాదమ్ములు విడిపోతే తలెత్తే సమస్యలే రెండు రాష్ట్రాల్లోనూ ఉత్పన్నమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ వచ్చారు. తెలంగాణ సీఎం కేసీ ఆర్‌ తిరుపతి వెళ్లారు. ఉగాది ఉత్సవాల్లో ఇద్దరూ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ సర్దుకుంటాయి. తెలంగాణకు ఏపీ సాయం చేయాలి, ఏపీకి తెలంగాణ సాయం చేయాలి. ఇద్దరు సీఎంలు తరచూ రెండు రాష్ట్రాల్లో పర్య టించాలి. దటీజ్‌ మై లాస్ట్‌ డ్రీమ్, అండ్‌ విజన్‌.

చర్చలు... ఓపికకు పరీక్ష
రెండు రాష్ట్రాల మధ్య విభజన సంబంధిత పంపకాలు, అపరిష్కృత అంశాలపై మంత్రుల కమిటీల చర్చలు కొనసాగుతున్నాయి. చర్చ లంటేనే ఓపికకు పరీక్ష. చర్చలకు వీలైనంత ఓపిక అవసరం. అంత సహనం నాకుంది. త్వరలో ఇద్దరు సీఎంల తో భేటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ముగ్గురం చర్చిస్తాం. గతంలో నాగార్జునసాగర్‌ నీటి విషయంలో గొడవ జరిగింది. రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరు సీఎంలతో రెండు గంటలు చర్చలు జరిపాను. అక్కడిక క్కడే పరిష్కారం దొరికింది.

చేదు అనుభవాలూ ఉన్నాయి
కొన్ని సందర్భాల్లో పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తపరిచాయి.  వాటన్నింటినీ ఎప్పటి కప్పుడే మర్చిపోయా. ఇవన్నీ కుటుంబంలో చిన్న గొడవల్లాంటివి. ఇద్దరు కొడుకుల్లో ఎవరి పట్లా తండ్రికి భేద భావముండదు. వారిపై తండ్రికి ఆప్యాయత, ఆయనంటే పిల్లలకు గౌరవ భావం ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోనూ నాకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అడ్డం కులను ఏ రోజుకారోజు అధిగమించాం.

కెరీర్‌ను ఇక్కడే ముగిస్తా.. నా చరమాంకం చెన్నైలోనే
చాలా ఏళ్లు పోలీసు ఆఫీసర్‌గా పని చేసిన తర్వాత గవర్నర్‌గా పని చేయడం నాకో కొత్త అనుభవం. నేను అప్పటిదాకా ప్రైవేట్‌గా ఉన్న వ్యక్తిని. ఒక్కసారిగా పబ్లిక్‌ వ్యక్తిని అయ్యాను. నాది ప్రజా జీవితం గా మారిపోయింది. ఈ మార్పుకు అలవాటు పడటానికి 2 వారాలు పట్టిందంతే. గవర్నర్‌గా ఉన్నా నా వ్యక్తిగత జీవితంలో మార్పేమీ లేదు. రాజ్‌భవన్‌లో ఉన్నా, ఎక్కడున్నా నా దినచర్యలో మార్పేమీ లేదు. అందులో మార్పు వస్తేనే సమస్య.

రానంతకాలం వృత్తిలోనూ ఏ ఇబ్బందీ ఉండదు. ఇప్పటికీ ఉదయం నాలుగింటికే లేస్తా. మీడియాలో నాపై వ్యతిరేకంగా వార్తలొస్తే బాధేమీ ఉండదు. గవర్నర్‌ గుడికి వెళితే తప్పా? అది వ్యక్తిగతం. విశ్వాసాలకు సంబంధించిన అంశం. నేను ఉదయాన్నే పూజ చేస్తా. ఆఫీసుకు వచ్చాక వృత్తి నిర్వహణ ముఖ్యం. నా కెరీర్‌ను ఇక్కడే ముగిస్తా. తర్వాత హైదరాబాద్‌లో ఉండను. హైదరాబాద్‌ ఈజ్‌ ది బెస్ట్‌ పీస్‌ఫుల్‌ సిటీ. కానీ నేను చెన్నై వెళ్తా. జీవిత చరమాంకంలో హోమ్‌ టౌన్‌లో ఉండటమే కరెక్ట్‌.

Advertisement

What’s your opinion

Advertisement