అకాల వర్షం.. ఆగమాగం | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. ఆగమాగం

Published Sun, Jan 4 2015 12:49 AM

అకాల వర్షం.. ఆగమాగం - Sakshi

సాక్షి, సంగారెడ్డి: వర్షాకాలంలో చేతిలెత్తిమొక్కినా కరుణించని వరుణుడు పిలవని అతిథిలా శీతాకాలంలో వచ్చేశాడు. కాలం కాని కాలంలో వచ్చి రైతన్నలకు కన్నీళ్లు తెప్పించాడు. అంతా ఆగమాగం చేసేశాడు. శనివారం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి నుంచి జల్లులతో ప్రారంభమైన వర్షం,  శనివారం వేకువజాము నుంచి ఊపందుకుంది.

సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌లలో భారీగా కురవగా, మెదక్ డివిజన్‌లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 22.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డితోపాటు మండలంలో భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో అత్యధికంగా 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.

వర్షం కారణంగా సిద్దిపేటలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిద్దిపేట శ్రీనివాస్‌నగర్ కాలనీలో వర్షపు నీళ్లు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనమైన పంచాయతీల్లోని గ్రామాల్లో సైతం వర్షం భారీగా కురిసింది. గజ్వేల్ మార్కెట్‌యార్డులో వ ర్షం ధాటికి ఆవరణలో ఉన్న మక్కలన్నీ తడిసిపోయాయి. మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక మార్కెట్‌యార్డు సందర్శించి మక్కల తరలించాలని అధికారులకు ఆదేశించా రు.

దీంతో మార్కెట్‌లోని అధికారులు, సిబ్బంది తడిసిన మక్కలను రాత్రి వరకు తరలిస్తూనే ఉన్నారు. వెల్దుర్తిలో  ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అనంతరం వచ్చి సు డిగాలి బీభత్సం చేసింది. భారీ వర్షం తో   పంటలు, చెట్లు దెబ్బతినగా, గాలులకు గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫారాలు దెబ్బతిన్నాయి. వర్షం కారణంగా పంట నష్టం వాటిల్లినట్లు  సమాచారం అందలేదని వ్యవసాయశాఖ జేడీఏ హుక్యా నాయక్ తెలిపారు.
 
సంగారెడ్డిలో భారీ వర్షం
సంగారెడ్డిలో భారీగా వర్షం కురిసింది. ఉదయం 5.30 గం టల నుంచి 8 గంటల వరకు ఏకధాటికిగా వర్షం కురిసింది.  వాన కారణం గా సంగారెడ్డిలోని రోడ్లు జలమయమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. సంగారెడ్డిలో 3.4 సెం.మీ, సదాశివపేట మండలంలో 2.2 సెం.మీ, నర్సాపూర్‌లో 2.7 సెం.మీ, మనూరులో 2 సెం.మీ,  హత్నూరలో 17 మిల్లీమీటర్లు, జిన్నారంలో 14.2 మి.మీ, కౌడిపల్లి, గజ్వేల్, రాయికోడ్, కొండాపూర్, కల్హేర్ మండలాల్లో 10 మి.మీ వర్షం కురిసింది.

Advertisement
Advertisement