Sakshi News home page

‘ప్రథమ’లో 66%, ‘ద్వితీయ’లో 42% ఉత్తీర్ణత

Published Sat, Jun 27 2015 1:09 AM

‘ప్రథమ’లో 66%, ‘ద్వితీయ’లో 42% ఉత్తీర్ణత

* ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
* ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
* రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు జూలై 4 చివరి తేదీ

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో (జనరల్) 3,02,349 మంది పరీక్షలకు హాజరుకాగా 2,00,253 మంది (66.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో ఇంప్రూవ్‌మెంట్ కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారు 1,50,685 మంది ఉండగా మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 49,588 మంది ఉన్నారు. ఇక ప్రథమ సంవత్సరం వొకేషనల్‌లో 12,392 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,342 మంది (51.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,61,294 మంది పరీక్షలకు హాజరవగా 68,996 మంది (42.77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌లో 9,508 మంది పరీక్షలకు హాజరుకాగా 4,668 (49.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

ఈ ఫలితాల్లోనూ బాలికలే అత్యధిక ఉత్తీర్ణతను సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలవారీగా చూస్తే ప్రథమ సంవత్సరంలో 52 శాతం మంది ప్రభుత్వ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే ప్రైవేటు కాలేజీలకు చెందిన 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 45 శాతం మంది ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉత్తీర్ణులైతే ప్రైవేటు కాలేజీలకు చెందిన 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
 
మూడు రోజుల్లో మార్కుల జాబితాలు
 మార్కుల జాబితాలను కాలేజీలకు అందించేందుకు వాటిని మూడు రోజుల్లో ప్రాంతీయ ఇన్‌స్పెక్షన్ అధికారులకు పంపనున్నారు. ప్రిన్సిపాళ్లు వాటిని జూలై 1న తీసుకొని వీలైనంత త్వరగా విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. మార్కుల మెమోల్లో తేడాలు, తప్పులుంటే ప్రిన్సిపాళ్ల ద్వారా జూలై 27లోగా బోర్డుకు తెలియజేయాలి.
 
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు
మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌తోపాటు జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం విద్యార్థులు జూలై 4లోగా దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ. 100, రీవెరిఫికేషన్‌తోపాటు జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున ఆన్‌లైన్ www.tsbie.cgg.gov.in ద్వా రా, మీసేవా లేదా ఏపీ ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఈ ఫీజును చెల్లించాక వెబ్‌సైట్ ద్వారా లేదా ఏపీ ఆన్‌లైన్ లేదా మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

Advertisement

What’s your opinion

Advertisement