Sakshi News home page

ఈ వర్షం సాక్షిగా...

Published Thu, Aug 13 2015 4:09 AM

ఈ వర్షం సాక్షిగా...

వర్షాలతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు
పైర్లకు, వరినాట్లకూ అనుకూలం
పత్తి, మక్కలో పైపాటు చేయూలి : ‘డాట్’ సూచన
 
 ఖమ్మం వ్యవసాయం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వానలు పైర్లకు ఎంతో అనుకూలమని డాట్ శాస్త్రవేత్త డాక్టర్ జె.హేమంత్‌కుమార్ సూచించారు. పత్తి, మొక్కజొన్న, పెసర పంటలకు ఈ వర్షాలు ఉపయోగమని తెలిపారు. అయితే నేల స్వభావాన్ని బట్టి కొన్ని తెగుళ్లు కూడా ఆశించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ జలాశయాల కింద వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే వేసిన వరికి కూడా ఈ వర్షాలు మరింతగా ఉపయోగపడనున్నాయి.

 నిండుతున్న జలాశయాలు
 నాలుగు రోజులుగా చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని జలాశయాల్లోకి నీరు చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి నీరు పోటెత్తింది. ఆ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తారు. కిన్నెరసాని ప్రాజెక్టులోకి కూడా నీరు చేరుతోంది. ఇప్పటికే 399 అడుగల నీరు చేరింది. వర్షం పెరిగితే ఈ ప్రాజెక్టు గేట్లు కూడా ఒకటి, రెండు రోజుల్లో ఎత్తే అవకాశం ఉంది. వైరా మండలం రెబ్బవరం, సోమారం నల్ల చెరువుల్లోకి కూడా నీరు చేరింది. తల్లంపాడు పెద్ద చెరువు, కూసుమంచి గంగాదేవి చెరువు  నీటిమట్టం కూడా పెరుగుతోంది. జిల్లాలోని దాదాపు అన్ని చెరువులు, కుంటల్లోనూ ఇదే పరిస్థితి.

 ఆగస్టులో ఆశాజనకంగా..
 జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఇప్పటి వరకు వర్షాలు కొంత మేరకు ఆశాజనకంగానే ఉన్నాయి. జూన్ నెలలో 246.8 శాతం అదనంగా వర్షాలు కురియగా, జూలై నెలలో వర్షపాతం బాగా తగ్గింది. 309 మి.మీ వర్షపాతానికి గాను కేవలం 111.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. -64 శాతం లోటు తలెత్తింది. ఆగస్టు నెల వర్షపాతం 276 మి.మీ కాగా ఇప్పటి వరకు 106.9 మి.మీ వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 85.5 మి.మీ వర్షపాతం నమోదైంది.

అంటే -20 శాతం లోటు ఉందన్నమాట. బుధవారం జిల్లాలో సగటున 11.4 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బయ్యారం మండలంలో 50.6 మి.మీ వర్షపాతం నమోదైంది. గుండాలలో 47.6, వెంకటాపురంలో 42.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 1-3 సెం.మీ 17 మండలాలలో, 1 సెం.మీ వరకు 19 మండలాలల్లో వర్షం కురిసింది. టేకులపల్లి, సింగరేణి మండలాల్లో మాత్రం వర్షం కురువ లేదు. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనటంతో ఆగస్టులో వర్షాలు అనుకూలిస్తాయని రైతులు, వ్యవసాయశాఖ భావిస్తోంది.

 డాట్ శాస్త్రవేత్త సూచనలు..
 జిల్లాలో దాదాపు 1.57 లక్షల హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈ పైరు 50 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ పైరుకు పైపాటుగా 25 కిలోల యూరియా+10 కిలోల పొటాష్‌ను మొక్కకు 7-10 సెం.మీ దూరంలో గుంత తీసి వేయాలి. నీరు నిలువ ఉంటే తీసి వేయాలి. నల్ల నేలల్లో వేరుకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది.  మొక్క వడబడినట్లు కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల కార్బండిజమ్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మొక్క మొదలు తడపాలి. వర్షాలకు ఆకుమచ్చ తెగులు గమనిస్తే 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1 గ్రాము స్టెప్టోమైసిన్ కలిపి పిచికారీ చేయాలి.

 మొక్కజొన్న
  మొక్కజొన్న జిలాల్లో దాదాపు 9 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఈ పంట దాదాపు 50 రోజుల వయసులో ఉంది. పైపాటుగా  నత్రజని, పొటాష్‌లను, 1/4 వంతు వేయాలి. మొక్కలు ఎత్తుగా ఉన్న దశలో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు నివారణకు కార్బొఫ్యూరాన్ 3జి గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున మొక్క సుడులలో వేయాలి.

 పెసర
 ప్రసుత వాతావరణ పరిస్థితుల్లో పెసర కు లద్దెపురుగు ఆశించే అవకాశం ఉంది. పెసర పూత, పిందె దశలో ఉంది. లద్దెపురుగు నివారణకు నొవాల్యూరాన్ 1 మి.లీ లేదా థైయోడీకార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరూకా మచ్చల పురుగు కూడా ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు స్పైనోసార్ట్ 0.3 మి.లీ లేదా ఎమామెక్టానిబెంజోయేట్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Advertisement

What’s your opinion

Advertisement