Sakshi News home page

ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలి

Published Sat, Jun 27 2015 1:07 AM

ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలి - Sakshi

మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి    
దోమలగూడ :
డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా ఆత్మ సంతృప్తి కోసం పని చేయాలని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన దోమలగూడ రామకృష్ణమఠంలోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ‘శ్రద్ధ’ పేరుతో నిర్వహించనున్న మూడు రోజుల వాల్యూ ఓరియంటేషన్ రెసిడెన్షియల్ యూత్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో సత్ప్రవర్తన తేవడానికి హ్యూమన్ ఎక్స్‌లెన్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

స్వామి వివేకానంద స్పూర్తిగా యువత దేశాభివృద్ధికి తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. చైనా యువ శక్తిని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. యువత వ్యక్తిగత స్వార్ధం వీడి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరారు.

అయితే కొందరు యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధించలేం అన్న నిస్పృహ తగదని, ప్రతి వ్యక్తి లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఓటమికి కృంగి పోకుండా, దానినినాంధిగా మలుచుకోవాలని సూచించారు. రూ.14,132 కోట్లతో అతి పెద్ద మెట్రో రైలు పనులు ప్రారంభించే ముందు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నామని, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పనులు సాగిస్తున్నామన్నారు.

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత వేగంగా సాగుతున్న ప్రాజెక్టు అని, మూడేళ్లలోనే దాదాపు 50 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. అసెంబ్లీ, పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్పుపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి జ్ఞానదానంద, హ్యూమన్ ఎక్స్‌లెన్స్ డెరైక్టర్ స్వామి బోధమయానంద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement