Sakshi News home page

మరో పోరాటానికి బెంగళూరు సిద్ధం

Published Fri, Feb 10 2017 4:25 PM

మరో పోరాటానికి బెంగళూరు సిద్ధం

బెంగళూరు: నగర ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. నగరం నడి కూడలి నుంచి విమానాశ్రయానికి వేగంగా వెళ్లేందుకు నిర్మించాలనుకుంటున్న స్టీల్‌ ఫ్లైఓవర్‌ను అడ్డుకొని అపార వృక్ష సంపదనను రక్షించేందుకు నడుంకడుతున్నారు. వేలాది మంది ప్రజల సంతకాలను సేకరించి నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బహత్‌ బెంగళూరు మహానగర పాలిక)కు పిటిషన్ల మీద పిటిషన్లు పంపుతున్నారు. ప్రజా పిటిషన్లను పట్టించుకోకపోతే ప్రభుత్వ యంత్రాంగంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. 
 
విమానాశ్రయానికి 6.7 కిలోమీటర్ల స్టీల్‌ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నగర మున్సిపాలిటీ నిర్ణయించింది. 55వేల టన్నుల స్టీలు పట్టే ఈ వంతెన నిర్మాణానానికి 1,791 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీని నిర్మాణం కోసం 45 జాతులకు చెందిన 812 నుంచి 1668 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని మున్సిపాలిటీ అంచనా వేసింది. అయితే ఆజిమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో 71 జాతులకు చెందిన 2, 244 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని తేలింది. దీనిపై జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు కూడా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా జయ మహల్‌లోని 112 చెట్లను కొట్టివేయాలని మున్సిపాలిటీ నిర్ణయించిన నేపథ్యంలో ప్రజలు పిటిషన్ల ఉద్యమాన్ని చేపట్టారు.
 
ప్రస్తుతం నగరం సెంటర్‌ నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోందని, 6.7 కిలోమీటర్ల ప్లైఓవర్‌ను నిర్మించడం వల్ల ఓ పది, పదిహేను నిమిషాలు ప్రయాణ సమయం కలిస్తొందని, దానికోసం అపార వృక్ష సంపదను కోల్పోవడం అర్థరహితమని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. ఇప్పటికే నగర ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని, కొన్ని దశాబ్దాల చెట్లను కొట్టివేయడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. చెట్ల వల్ల ప్రజలందరికి తెల్సిన ప్రయోజనాలతోపాటు కొన్ని తెలియని ప్రయోజనాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ప్రయోజనాలు
1. చెట్లు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయన్న విషయం తెల్సిందే. 
2. కార్బన్‌ డైఆక్సైడ్‌ను పీల్చుకోవడంతోపాటు ధూళిని, శబ్దకాలుష్యాన్ని తగ్గిస్తాయి.
3. భూ క్షారాన్ని తగ్గిస్తాయి. భూగర్భ జలాలను పెంచుతాయి.
4. పచ్చని చెట్ల వాతావరణంలో రోగులు త్వరగా కోలుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది. 
5. పదివేల డాలర్ల వార్షికాదాయం కలిగిన చెట్లులేని ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకన్నా అంతే వయస్సులో, అంతే ఆదాయం కలిగినవారు చెట్లు ఎక్కువగా ఉన్న కాలనీలో నివసిస్తే వారి ఆరోగ్యం ఏడేళ్లు తక్కువగా ఉన్నట్లు ఉంటుందని టొరాంటోలో జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. 
6. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో హింసాత్మక ధోరణి బాగా తక్కువగా ఉంటుందని కాలిఫోర్నియాలో జరిపిన మరో అధ్యయనంలో తేలింది.
7. పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ సమస్యలు ఉత్పన్నం కావు.
8. చెట్లున్న ప్రాంతంలో చదువుకునే పిల్లలకు ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాకుండా వారిలో జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. 
9. బెంగళూరులాంటి ఓ నగరంలో చెట్ల వల్ల 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది.
10. చెట్ల వల్ల పక్షులు, ఇతర క్రిమికీటకాదులు చేరి పర్యావరణ సమతౌల్యత సాధ్యమవుతుంది.

Advertisement

What’s your opinion

Advertisement