Sakshi News home page

మందుబాబుల్లో మీరు ఏ కేటగిరీ?

Published Sat, Jul 23 2016 1:18 PM

మందుబాబుల సైకాలజీపై అధ్యయనం

ఇది సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. నలుగురు మిత్రులు కలిసి బార్‌కు వెళ్లి.. అందరూ ఒకే మోతాదులో మద్యాన్ని సేవించినా.. అందరూ ఒక్కతీరుగా ఉండరు. కొందరు రెండు పెగ్గులు తాగినా మాట తూళుతుంది. మరికొందరు ఐదారు పెగ్గులు తాగినా నిబాయించుకొని ఉండేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు కొంచెం మద్యం గొంతు దిగగానే చాలు.. తమలోని అనేకానేక కళలను వెలికితీస్తుంటారు. కొత్తగా ప్రవర్తిస్తారు. ఇందుకు కారణమేమిటి? మద్యం తాగిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎందుకు ప్రవర్తిస్తారు? అన్న అంశాలపై తాజాగా కొలంబియాలోని మిస్సోరి యూనివర్సిటీ సైకాలజీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.

‘అడిక్షన్ రీసెర్చ్ అండ్ థియరీ’ పేరిట మిడ్‌వెస్ట్రర్న్‌ యూనివర్సిటీకి చెందిన 374మంది అండర్ గ్రాడ్యుయట్ల సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో మందుబాబులకు సంబంధించిన సంప్రదాయ అంశాలపై తార్కికమైన శాస్త్రీయమైన నిర్ధారణలు చేశారు. ఇందుకోసం సాహిత్యం, పాప్ కల్చర్‌ను పరిశోధకులు వడపోశారు.

ఈ అధ్యయనంలో పరిశోధకులు నాలుగు రకాల మందుబాబులు ఉంటారని తేల్చారు. ఆ నాలుగు రకాల వారికి: మేరి పప్పిన్స్‌, ద ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే, ద నట్టి ప్రొఫెసర్‌, మిస్టర్‌ హైడ్ అని పేర్లు పెట్టారు. ఈ నాలుగు రకాల్లో అత్యధికంగా 40శాతం మంది మందుబాబులు ఎర్నెస్ట్ హెమ్మింగ్వే కేటగిరీకి చెందుతారు. ప్రముఖ రచయిత హెర్నెస్ట్ హెమ్మింగ్వే పేరును ఈ కేటగిరీకి పెట్టారు. ఎందుకంటే తాను ఎంత పెద్దమొత్తంలో విస్కీ తాగినా.. తాగినట్టే కనిపించనని హెమ్మింగ్వే చెప్పేవారు. ఈ కేటగిరీకి చెందిన వారు మద్యాన్ని సేవించినా.. ఆ ప్రభావంతో తమ వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో మార్పు రాకుండా స్థిరంగా వ్యవహరిస్తారని అధ్యయనం పేర్కొంది.

ఇక మేరీ పప్పిన్స్‌ కేటగిరీ విషయానికొస్తే 1964నాటి హాలీవుడ్ సినిమా పేరు ఇది. ఈ సినిమాలో మేరి పప్పీన్స్‌ పాత్ర మాదిరిగానే సంతోష సమయాల్లో, తమ ఆనందాన్ని మరింత పెంచుకోవడానికి, మరింత ఎంజాయ్ చేయడానికి వీరు మద్యాన్ని సేవిస్తారు.

ఇక, నట్టి ప్రొఫెసర్‌ కూడా హాలీవుడ్‌ సినిమా పేరే. ఈ సినిమాలో ప్రధాన పాత్ర మాదిరిగానే ఈ కేటగిరీకి చెందిన మందుబాబులు సహజంగా ఆంతర్ముఖులై ఉంటారు. వీరు మద్యాన్ని సేవించినప్పుడు తమ సహజ భయాలను పక్కనబెట్టి మరింతగా ప్రజలతో కలిసిపోతారు. తాము అందరితో కలివిడిగా ఉంటామని చాటుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఇక మిస్టర్ హైడ్‌ కేటగిరీకి వస్తే.. ఈ తరహా డింకర్స్‌లో రెండురకాల పాత్రలు ఉంటాయి. వీరు పెద్దగా బాధ్యతాయుతమైన వ్యక్తులు కాదు. పెద్దగా తెలివితేటలు కూడా ఉండవు. తాగినప్పుడు మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. వీరిపై మద్యం చాలా రాక్షసమైన ప్రభావాన్ని చూపుతుంది.  

Advertisement

What’s your opinion

Advertisement