Sakshi News home page

మరో వివాదంలో స్మృతి ఇరానీ

Published Thu, Aug 18 2016 9:43 AM

మరో వివాదంలో స్మృతి ఇరానీ - Sakshi

స్మృతి ఇరానీ చేనేత శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా కాలేదు.. అప్పుడే మరో వివాదానికి తెరలేపారు. అత్యంత సీనియర్ అధికారి, చేనేత శాఖ కార్యదర్శి రష్మి వర్మతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిద్దాం అనుకున్నప్పటికీ కార్యదర్శితో స్మృతీ విభేదించారట. జూన్ 22న కేబినెట్ ఆమోదించిన 6వేల కోట్ల రూపాయల దుస్తులు, వస్త్రాలు ప్యాకేజీ, అక్టోబర్లో జరుగబోయే టెక్స్టైల్ సదస్సు విషయాల్లో, విధానపరమైన పరిపాలనకు సంబంధించి కార్యదర్శితో వివాదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. వర్మతో విభేదించిన స్మృతి ఇరానీ ఇతర అధికారుల సమక్షంలోనే కార్యదర్శితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలి జరిగిన ఓ మంత్రివర్గ సమావేశంలో కూడా వస్త్రాలు, దుస్తులు ప్యాకేజీ అనుకరణపై ఇరానీ ఈ సమస్యను లేవనెత్తారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. అనంతరం వర్మతో పాటు ఇతర అధికారులతో  పీఎంఓ  సమావేశం ఏర్పరచిందని, మూడేళ్లలో కోటి కొత్త ఉద్యోగవకాశాల కల్పనకు సంబంధించి మెగా ప్రాజెక్టు అమలు గురించి వివరించి, పరిష్కారానికి ప్రయత్నించిందని తెలుస్తోంది.

ఈ వివాదంలో రెండు డజన్లకు పైగా నోటీసులను కూడా వర్మకు స్మృతి ఇరానీ పంపారట. అయితే స్మృతి ఇరానీతో వివాదాన్ని వర్మ ఖండించారు. నోటీసులపై స్మృతి ఇరానీ స్పందన కోరగా.. దీనిపై కామెంట్ చేయదలుచుకోలేదని,  ఇవి మామూలు కమ్యూనికేషన్స్ మాత్రమేనని దాటవేశారు. రష్మీ వర్మ 1982 బ్యాచ్ కు చెందిన బిహార్ కేడర్ అధికారి. కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా సోదరి. గత డిసెంబర్లోనే టెక్స్టైల్ కార్యదర్శిగా ఎంపికయ్యారు.. స్మృతి ఇరానీ.. తాజా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జూలై 5న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నుంచి చేనేత, జౌళి శాఖ మంత్రిగా మారిన సంగతి తెలిసిందే.
 

Advertisement

What’s your opinion

Advertisement