రిక్షా తొక్కాలనుకున్నా | Sakshi
Sakshi News home page

రిక్షా తొక్కాలనుకున్నా

Published Sun, Mar 2 2014 1:27 AM

రిక్షా తొక్కాలనుకున్నా

 రిక్షా కార్మికులతో భేటీలో రాహుల్
 వారణాసి: ‘మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి మీతో కలసి ఒక రోజు రిక్షాతొక్కాలనుకున్నా. అయితే మీ కష్టాలను తెలుసుకోవడానికి అది సరిపోదని నాకు తెలుసు. మీ జీవితాలను మెరుగుపరచేందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుంది’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రిక్షా కార్మికులతో అన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తయారీ కసరత్తులో భాగంగా ఆయన శనివారమిక్కడ కాంట్ రైల్వే స్టేషన్ వద్ద రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లతో గంటన్నరపాటు ముచ్చటించారు. ‘నా మాటలు వినేందుకు ఒక రోజు సంపాదన వదులుకుని వచ్చినందుకు కృతజ్ఞతలు.
 
 మీరు మళ్లీ ఆత్మగౌరవంతో జీవించేందుకు, మీ జీవితాలు బాగుపడేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తా’ అని హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు ఆంధప్రదేశ్, కేరళ తదితర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బాగా అమలవుతున్నాయని, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పేదలకు చేరడం లేదని అన్నారు. సమావేశంలో రిక్షా కార్మికుల కష్టాలు విని ఆయన కదలిపోయారు. పోలీసులు తమను వేధిస్తున్నారని, లంచాలిస్తేనే రైల్వే స్టేషన్‌లోకి రానిస్తున్నారని రిక్షావాలాలు ఆరోపించారు. ఆటో పర్మిట్ తీసుకోవాలంటే ట్రక్కు పర్మిట్ ఫీజు కట్టాల్సి వస్తోందని ఆటోడ్రైవర్లు ఆరోపించగా, వారి సమస్యలను పరిష్కరిస్తానని రాహుల్ చెప్పారు. ఆయన వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు.
 

Advertisement
Advertisement