Sakshi News home page

రైతులకు చేయూత.. మహిళలకు ఉపాధి

Published Mon, Aug 21 2023 2:37 AM

AP Food Processing Society MoU with Bank today - Sakshi

సాక్షి, అమరావతి: ఉల్లి, టమాటాలతో పాటు కూరగాయల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. పొదుపు సంఘాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5వేల సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్ల ఏర్పాటుచేయనుంది. వీటికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ముందుకొ చ్చిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)తో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (ఎపీఎఫ్‌పీఎస్‌) నేడు (సోమవారం) అవగాహనా ఒప్పందం చేసుకోబోతుంది. 

తొలిసారి కర్నూలు జిల్లాలో ఏర్పాటు.. 
ఉల్లి, టమాటా రైతుల వెతలు తీర్చేందుకు ఏపీఎఫ్‌పీఎస్‌ ఆధ్వ­ర్యంలో రాష్ట్రంలోనే తొలిసారి కర్నూలు జిల్లాలో రూ.కోటి అంచనాతో 100 సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూని­ట్స్‌ (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటుచేశారు. రూ.లక్ష అంచనా వ్యయంతో కూడిన ఈ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 35% సబ్సిడీతో వీటిని మంజూరు చేశారు.

ఒక్కో యూనిట్‌ ఆరు టన్నుల చొప్పున ఏటా 7.200 వేల టన్నుల ఉల్లి, టమాటాలను ప్రాసెస్‌ చేసే సామర్థ్యం కల్గిన ఈ యూనిట్ల 100 మందికి ఉపాధి లభిస్తుండగా, ఆయా ప్రాంతాలకు చెందిన 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరుతోంది. వీటిని ఇటీవలే సీఎం జగన్‌ ప్రారంభించారు.

ఇంట్లోనే ఏర్పాటుచేసుకునే ఈ యూనిట్ల ద్వారా ప్రతీనెలా రూ.12వేల నుంచి రూ.18వేల వరకు అదనపు ఆదాయాన్ని పొదుపు సంఘాల మహిళలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5వేల యూనిట్లు మంజూరుచేయాలని సంకల్పించింది.  

బీఓబీ ఆర్థిక చేయూత.. 
మరోవైపు.. ఈ సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్ల విస్తరణ పథ­కానికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరో­డా ముందుకొ చ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు సబ్సిడీపై వీటిని మంజూరు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో రూ.లక్ష అంచనాతో ఒక్కో యూనిట్‌ ఏర్పాటుచేయగా, ఇక నుంచి రూ.2లక్షల అంచనా వ్యయంతో రెట్టింపు సామర్థ్యంతో వీటిని ఏర్పాటుచేయనున్నారు.

ఇందుకోసం రూ.100 కోట్లు వె చ్చిస్తున్నారు. ఈ మొత్తంలో రూ.35 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చుచేయనుండగా, లబ్దిదారులు తమ వాటాగా రూ.10కోట్లు భరించాల్సి ఉంటుంది. రూ.65 కోట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆర్థిక చేయూతనిస్తోంది. ఇక బీఓబీ–ఏపీఎఫ్‌పీఎస్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు నేడు అవగాహనా ఒప్పందం చేసుకోబోతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement