AP: ఎగుమతులపై ‘పుష్‌’ పాలసీ

16 May, 2022 08:49 IST|Sakshi

ఐదేళ్లలో రూ.3.50 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యం

మౌలిక వసతులు, టెక్నాలజీ, స్కిల్స్, మార్కెటింగ్‌ అభివృద్ధికి ప్రత్యేక వ్యవస్థ 

ఏపీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ 2022–27 ముసాయిదా పాలసీలో ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్య అవకాశాలపై ప్రధానంగా దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్, ఎగుమతులను ప్రోత్సహించేలా నూతన పాలసీలను తెస్తోంది. 2020–21లో రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను వచ్చే ఐదేళ్లలో రూ.3.50 లక్షల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ –2022 – 27 రూపొందించింది. ఈ ముసాయిదా పాలసీకి రాష్ట్ర కేబినెట్‌ గురువారం ఆమోదం తెలిపింది.
చదవండి: ఎంఎస్‌ఎంఈ ప్రణాళికపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

‘పుష్‌’ విధానంతో రెట్టింపు
ఎగుమతులను రెట్టింపు చేసేలా ‘పుష్‌’ (పీయూఎస్‌హెచ్‌) విధానాన్ని అమలు చేయనున్నట్లు ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తులకు మరింత విలువను జోడించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించనున్నారు(ప్రమోట్‌–పీ). ఇందుకోసం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. ఎగుమతులకు కీలకమైన ఓడ రేవులు, గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌లతో పాటు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులు లాంటి కీలక మౌలిక వసతులను అభివృద్ధి (అప్‌గ్రేడ్‌–యూ) చేయనున్నారు.

ఇప్పటికే 4 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్బర్లతో పాటు విశాఖ, అనంతపురంలో 2 మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనతో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ఎగుమతుల విధానాన్ని స్ట్రీమ్‌లైన్‌ (ఎస్‌) చేస్తూ నూతన టెక్నాలజీ వినియోగం ద్వారా (హార్నెస్‌–హెచ్‌) ఎగుమతులను ప్రోత్సహించేలా ముసాయిదా పాలసీలో ప్రతిపాదించారు.

ఆరు ఆంశాలపై దృష్టి
ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఆరు కీలక అంశాలపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎగుమతుల సమాచారమంతా ఒకేచోట లభించే విధంగా డ్యాష్‌బోర్డు అభివృద్ధి చేయడంతోపాటు టెక్నాలజీని మరింతగా వినియోగించుకోనున్నారు. గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లు, లాజిస్టిక్‌ హబ్, ఎయిర్‌పోర్టులు, పోర్టు, రహదారుల అనుసంధానం లాంటి వాటిపై భారీగా ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ప్రతి జిల్లాను ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా తీర్చిదిద్ది ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. నాణ్యతా పరమైన కారణాలతో ఎగుమతులు తిరస్కరణకు గురి కాకుండా క్వాలిటీ టెస్టింగ్‌ కేంద్రాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించండంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేలా పాలసీలో పలు ప్రతిపాదనలు పొందుపర్చారు.

‘స్వయం ఆంధ్రా’ పేరుతో బ్రాండింగ్‌
రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను అంతర్జాతీయంగా సరఫరా చేసే విధంగా ‘స్వయం ఆంధ్రా’ పేరుతో ఏపీ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ (ఏపీటీపీసీ)ఎగుమతులను ప్రోత్సహించనుంది. కేవలం ఎగుమతుల కోసం ఉత్పత్తి పేరుతో అంతర్జాతీయంగా ప్రచారం కల్పించి నాణ్యత ధ్రువీకరణ సదుపాయాలు కల్పిస్తారు. సర్టిఫికేషన్‌ చార్జీలపై సబ్సిడీ, మార్కెటింగ్, అంతర్జాతీయ ట్రేడ్‌ ఫెయిర్స్‌లో పాల్గొనే వారికి రాయితీలతో పాటు ఫైనాన్సింగ్, అవార్డులు లాంటి ప్రోత్సాహకాలను పాలసీలో ప్రతిపాదించారు.

తూర్పు తీరంలో 974 కి.మీ సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఏకైక రాష్ట్రం
14 నోటిఫైడ్‌ పోర్టులు ఉండగా 6 పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణ
మరో నాలుగు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
2020–21 నాటికి రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రూ.1.24 లక్షల కోట్లు. ఇది దేశ జీడీపీలో 19.14 శాతానికి సమానం
దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతం
దేశీయ ఎగుమతుల సంసిద్ధత ర్యాంకుల్లో 20 నుంచి 9 స్థానానికి ఎగబాకిన ఏపీ
వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ఎగుమతులను రూ.3.50 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యం.

జిల్లాల వారీగా ఉత్పత్తులకు ప్రోత్సాహం
ఒక్కో జిల్లాల్లో ఎగుమతికి అవకాశం ఉన్న వాటిని గుర్తించి ప్రోత్సహిస్తాం. ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

పోర్టులపై రూ.20,000 కోట్లు
సముద్ర వాణిజ్య అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు ఓడరేవులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తోంది.
– మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్‌ బోర్డు 

మరిన్ని వార్తలు