Sakshi News home page

మీడియాతో మాట్లాడొద్దు

Published Wed, Nov 1 2023 5:33 AM

AP high court grants interim bail to ex CM and TDP chief N Chandra babu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ కుంభకోణం కేసులో అ­రె­స్టయిన చంద్రబాబుకు మానవతా దృక్పథం, ఆరో­గ్య సమస్యల దృష్ట్యా తాత్కాలిక బెయిల్‌ మంజూ­రు చేసిన నేపథ్యంలో సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించింది. సీఐడీ అనుబంధ పిటిషన్‌పై తీర్పు వెలువడేంత వరకు ఆయన మీడి­యాతో మాట్లాడకూడదని ఆదేశించింది. ర్యాలీ­ల్లో పాల్గొనకూడదని, ఈ కేసు గురించి బహిరంగంగా కూడా మాట్లాడవద్దని చంద్రబాబును ఆదేశించింది.

చంద్రబాబుకు హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జున­రావు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. మరిన్ని అదనపు షరతులు విధించాలని కోరారు. ఆ షరతులేమిటో లిఖితపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి చెప్పారు. దీంతో సీఐడీ ఓ అనుబంధ పిటిషన్‌ రూపంలో వాటిని కోర్టు ముందుంచింది.

ఈ అనుబంధ పిటిషన్‌పై లంచ్‌మోషన్‌ రూపంలో విచారించాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జున­రావు సుముఖత వ్యక్తం చేయలేదు. అదనపు షరతు­లకు అంత తొందరేముందని ప్రశ్నించారు. చంద్ర­బాబుకు నోటీసులు జారీ చేసి వారి వాదనలు విన్న తరువాత నిర్ణయం చెబుతానన్నారు. ఉదయం మ­ద్యం కుంభకోణంలో చంద్రబాబుకు లంచ్‌మో­షన్‌ ఇచ్చి తమకు ఇవ్వకపోవడం ఎంతమాత్రం సరికా­దని సీఐడీ న్యాయవాదులు చెప్పారు. దీంతో న్యాయమూర్తి లంచ్‌మోషన్‌కు అనుమతినిచ్చారు.

మధ్యాహ్నం అతికష్టం మీద సీఐడీ అనుబంధ పిటిషన్‌ విచారణకు వచ్చింది. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్‌ పీపీ యడవల్లి నాగ వివేకానంద, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ మంజూరులో సుప్రీంకోర్టు నిర్దే­శించిన  షరతులను చంద్రబాబుకు వర్తింపజేయా­లని సుధాకర్‌రెడ్డి కోరారు.

రాజకీయ ర్యాలీలు, రాజ­కీయ ప్రసంగాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చంద్రబాబును ఆదేశించాలని కోరా­రు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్‌ మీడియా ముందు మాట్లాడకుండా నిరోధించాలన్నారు. వైద్య చికి­త్సకు మాత్రమే పరిమితమయ్యేలా చూడాలన్నారు. కేసుల విషయంలో ఆయనకు, ఇతర నిందితులకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కూడా ఆదేశాలు జారీ చేయాలన్నారు. చంద్రబాబు వెంటే ఉండి, ప్రతి రోజూ ఆయన కార్యకలాపాలను కోర్టుకు నివేదించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలని కోరారు.

దీనిపై చంద్రబాబు కౌంటర్‌ దాఖలు చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటానని న్యాయమూర్తి తెలిపారు. దీనికి సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ఎప్పుడో నిర్ణయం వెలువరిస్తామంటే ఎలా అని అన్నారు. చంద్రబాబు బయటకు వచ్చి ర్యాలీలు తీసి రాద్ధాంతం చేసిన తరువాత అదనపు షరతులు విధిస్తే ప్రయోజనం ఉండదన్నారు. అదనపు షరతులు తాము సృష్టించినవి కావన్నారు. మీరు (న్యాయమూర్తి) చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సత్యేంద్రజైన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారని, ఆ తీర్పు లోనే సుప్రీం పలు షరతులను విధించిందని తెలి పారు.

ఆ తీర్పు ఆధారంగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చినప్పుడు అదే తీర్పులోని షరతు లను కూడా విధించాలన్నారు. తీర్పును మొత్తంగా వర్తింపజేయాలే తప్ప, కొంత భాగాన్ని వర్తింపజేసి, కొంత వదిలేస్తామంటే ఎలా అని అన్నారు. తీర్పులో ఏం రాయాలో మీరు కోర్టును శాసించలేరని న్యాయ­మూర్తి వ్యాఖ్యానించారు. తాను శాసించడం లేదని, తీర్పు పూర్తి పాఠాన్ని వర్తింపజేయాలని మాత్రమే కోరుతున్నానని సుధాకర్‌­రెడ్డి చెప్పారు. ‘అలా అ­యితే నిన్ననే (సోమవారం) వాదనల సందర్భంగా షరతులు చెప్పి ఉండాల్సింది. నేను అప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేది.’ అని న్యాయమూర్తి అన్నారు.

‘మీరు వారికి అనుకూలంగా తీర్పునిస్తారని ముందే అనుకునేందుకు నేనేమైనా జ్యోతిష్యుడి వద్దకు వెళ్లానా? మీరు ఉత్తర్వులు జారీ చేసిన తరువాతే కదా ఎలాంటి షరతులు విధించారో మాకు తెలిసింది. అలాంటప్పుడు ముందే మేం ఎలా షరతుల గురించి చెప్పగలం’ అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. చిదంబరం కేసులో కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన షరతులను నిర్దేశించిందని సుధాకర్‌రెడ్డి వివరించారు.

సుప్రీం తీర్పులో ఏ భాగాన్ని పరిగ­ణనలోకి తీసుకోవాలన్నది తన విచక్షణా­ధికారానికి సంబంధించినదని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీం తీర్పును అందరూ అనుసరించాల్సిందేనని, అలా చేయని పక్షంలో అదనపు షరతుల కోసం తా­ము దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని సుధా­కర్‌రెడ్డి కోర్టును కోరారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ తానిచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే, సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని న్యాయమూర్తి చెప్పగా.. తాము ఆ పని కచ్చితంగా చేస్తామని సుధాకర్‌రెడ్డి చెప్పారు.

అదనపు షరతుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిందేనని పట్టుబట్టారు. చంద్రబాబు తరఫు న్యాయవా­దులు జోక్యం చేసుకుంటూ, కేసు గురించి కాక మిగిలిన రాజకీయాల గురించి మీడియాతో మాట్లా­డ­­టం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. చంద్ర­బాబు రాజకీయ నాయకుడని, ఆయన రాజకీ­యాల గురించి మాట్లాడకుండా ఎలా ఉండగలరని అడి­గారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూ­ర్తి, కొద్దిసేపటి తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. అనంతరం అదనపు షరతులు విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. సీఐడీ అనుబంధ పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Advertisement

What’s your opinion

Advertisement