Sakshi News home page

కృష్ణా నీటికి తెలంగాణ కాకి లెక్కలు

Published Sat, Jan 14 2023 9:29 AM

AP Objected To Telangana's Way Of Allocating Non Existent Water - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో లేని వాటాను ఉన్నట్లు చూపించి, వాటినే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించి, ఆ ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతి కోరుతూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి తెలంగాణ దరఖాస్తు చేసింది. తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. నీళ్లే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని సీడబ్ల్యూసీని డిమాండ్‌ చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను తరలించి.. 12.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం 2015లో చేపట్టింది.

అనుమతి లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అపెక్స్‌ కౌన్సిల్‌లో ఆమోదం పొందకపోతే ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోనివ్వబోమని తెలంగాణకు కృష్ణా బోర్డు తేల్చిచెప్పింది. మరోపక్క ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఏపీ ప్రభుత్వం, రైతుల వాదనతో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఏకీభవించి, తక్షణమే ఆ ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేసిన తెలంగాణ సర్కార్‌కు గత డిసెంబర్‌ 12న రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తీసుకున్నాకే పనులు చేపట్టాలని నిర్దేశించింది.  

నీళ్లే లేవు.. కేటాయింపులెలా..?
సీడబ్ల్యూసీకి చేసిన దరఖాస్తులో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులపై తెలంగాణ అధికారులు కాకిలెక్కలు వేశారు.– పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను.. సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 45 టీఎంసీల కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది.  రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నీటిలో రెండు రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ 45 టీఎంసీలూ తెలంగాణకే దక్కుతాయని వాదిస్తోంది. చిన్న నీటి పారదుల విభాగంలో తెలంగాణకు 89.15 టీఎంసీల కేటాయింపు ఉండగా.. ఆ రాష్ట్రం 175.54 టీఎంసీలను వాడుకుంటోంది. అయినా చిన్న నీటి పారుదల విభాగంలో తమ వాటాలో ఇంకా 45.6 టీఎంసీల మిగులు ఉందంటోంది. ఈ రెండూ కలిపి 90.6 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డికి కేటాయిస్తూ గత ఆగస్టు 18న తెలంగాణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ట్రిబ్యునల్‌ను అపహాస్యం చేయడమేనని న్యాయ నిపుణులు అంటున్నారు.

తీవ్ర అభ్యంతరం తెలిపిన ఏపీ
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు తెలంగాణ సర్కారు లేని నీటిని కేటాయించిందంటూ సీడ బ్ల్యూసీకి ఏపీ జల వనరుల శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సాగర్‌కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకునే అంశం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ పరిధిలో ఉందని వివరించారు. చిన్న నీటిపారుదల విభాగంలో కేటాయింపులకంటే ఇప్పటికే 86.39 టీఎంసీలను అధికంగా వాడుకుంటున్న తెలంగాణ.. వారికి కేటాయించిన నీటిలో 45 టీఎంసీల మిగులు ఉందని ఎలా వాదిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీకి వివరిస్తూ.. నీళ్లే లేని ఆ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితు ల్లోనూ అనుమతి ఇవ్వొద్దని గట్టిగా కోరారు.

హక్కులు తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు
నీరే లేకుండా 2015లో తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవడంలో నాటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కారుకు దొరికిపోయిన చంద్రబాబు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రజల హక్కులను ఆ రాష్ట్రానికి తాకట్టు పెట్టారు. దీన్ని నిరసిస్తూ.. అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో జలదీక్ష చేశారు. అయినా టీడీపీ సర్కారు స్పందించకపోవడంతో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2016 సెప్టెంబరు 21న కేంద్రం నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను నిలిపేయాలని కనీసం డిమాండ్‌ చేసే సాహసం కూడా చంద్రబాబు చేయలేకపోయారు.

హక్కుల పరిరక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌ పోరాటం
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం పోరాటం ప్రారంభించారు. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. 2020 అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలోనూ ఇదే వాణిని విన్పించారు. దాంతో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), నెట్టెంపాడు (సామర్థ్యం పెంపు), మిషన్‌ భగీరథను నిలిపివేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖ, కృష్ణా బోర్డు తెలంగాణ సర్కారును ఆదేశించాయి. అనుమతి తీసుకున్నాకే ఈ ప్రాజెక్టుల పనులు చేపట్టాలని తెలంగాణ సర్కారుకు నిర్దేశించాయి.

Advertisement

What’s your opinion

Advertisement