విద్యార్థుల సామర్థ్యం స్పష్టంగా తెలిసేలా...  | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సామర్థ్యం స్పష్టంగా తెలిసేలా... 

Published Tue, Feb 7 2023 4:52 AM

CBA-2, Formative-3 exams till 10th Feb 2023 Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్థ్యాలు, ప్రతిభాపాటవాలను సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రస్థాయిలో విద్యార్థులందరి సామర్థ్యాలను సరైన రీతిలో అంచనా వేసేందుకు తరగతులు, సబ్జెక్టుల వారీగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన ప్రశ్నావళితో ఒకే రకమైన ప్రశ్నపత్రాలను వినియోగించి కొత్త విధానంలో సీబీఏ–2, ఫార్మేటివ్‌–3 పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షలు మంగళవారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తారు.

మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షల షెడ్యూల్‌ను, పరీక్షల నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలను రాష్ట్ర పాఠశాల విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రకటించింది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు, ప్రయివేటు పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ జారీచేసే ప్రశ్నపత్రాలతో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది.

ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ (సీబీఏ)–2 పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతుల వారికి గతంలో మాదిరిగానే ఫార్మేటివ్‌–3 పరీక్షలు ఉంటాయి. క్లాస్‌ రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నపత్రంతోపాటు ఓఎమ్మార్‌ షీట్లు కూడా అందిస్తారు.

ప్రయివేటు యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నపత్రాలు మాత్రమే ఇస్తారు. ఓఎమ్మార్‌ షీట్లు అందించరని ఎస్సీఈఆర్టీ పేర్కొంది. సీబీఏ విధానంలోని పరీక్షలలో 0.25 (సూక్ష్మ) 0.5 (అతిస్వల్ప), 1 (స్వల్ప) ప్రశ్నలతోపాటు 2, 3, 4, 5, 8 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఆయా సబ్జెక్టుల్లో గరిష్టంగా 20 మార్కులతో ఈ సీబీఏ పరీక్షలను గంట వ్యవధితో నిర్వహిస్తారు. 

సరి చూసుకోవాలి 
ఎస్సీఈఆర్టీ అందిస్తున్న ప్రశ్నపత్రాలను, విద్యార్థుల వారీగా చైల్డ్‌ ఐడీలు, పేర్లతో కూడిన ఓఎమ్మార్‌ పత్రాలను జిల్లాల ఉమ్మడి పరీక్ష విభాగాల నుంచి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు సరిచూసుకుని తీసుకువెళ్లి విద్యార్థులకు అందించనున్నారు. ఎవరికైనా ఓఎమ్మార్‌ పత్రం రాకపోతే వారికోసం బఫర్‌స్టా­క్‌ నుంచి అందిస్తారు. పరీక్షల అనంతరం ఆయా ఓ­ఎమ్మార్‌ పత్రాలను సమగ్ర మూల్యాంకనానికి వీలు­గా జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగాలకు తరలిస్తారు. ప­­రీక్ష సమయంలో ఓఎమ్మార్‌ పత్రాలపై చైల్డ్‌ ఐ­డీలు, పేర్లు సరిగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి.  

సమగ్ర మూల్యాంకనంతో లోపాల సవరణకు వీలుగా చర్యలు  
విద్యార్థుల సామర్థ్యాలను సమగ్రంగా విశ్లేషించేందుకు ఈ సీబీఏ పరీక్షలను శాస్త్రీయంగా రూపొందించిన ప్రశ్నలతో ఓఎమ్మార్‌ పత్రాలతో నిర్వహిస్తున్నామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ ఓఎమ్మార్‌ పత్రాలను జిల్లా స్థాయిలో స్కాన్‌ చేయిస్తారని చెప్పారు. మార్కులను పాఠశాలలకు అందిచరని, కేవలం విద్యార్థుల స్థాయిని అంచనా వేసి భవిష్యత్‌లో టీచర్లకు, విద్యార్థులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను చేపట్టేందుకు ఉపయోగిస్తామని వివరించారు.

సీబీఏ పరీక్షల అనంతరం తరగతుల వారీగా సబ్జెక్టులకు ‘కీ’ విడుదల చేస్తామని, దాని ప్రకారం టీచర్లు ప్రశ్నపత్రాలను దిద్దాల్సి ఉంటుందన్నారు. ఆ మార్కులను రిజిస్టర్లలో, పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు. విద్యార్థుల మార్కులను ప్రోగ్రెస్‌ కార్డుల్లో నమోదు చేసి తల్లిదండ్రులకు అందిస్తామని, తక్కువ ప్రతిభ చూపిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.    

Advertisement
Advertisement