Sakshi News home page

బొర్రా గుహలకు మహర్దశ 

Published Fri, Mar 8 2024 4:59 AM

Center to develop Borra Caves - Sakshi

స్వదేశీ సందర్శన్‌లో భాగంగా రూ. 29.88 కోట్లు మంజూరు

పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయనున్న కేంద్రం

వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన

అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను  అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం రూ. 29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్‌నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

కాగా, 1807లో విలియం కింగ్‌ గుర్తించిన ఈ గుహల్లో సున్నపురాయి ఖనిజంతో ఏర్పాటయిన మానవమెదడు, శివలింగం, డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులాంటి వివిధ ఆకృతులు చూపరులను కనువిందు చేస్తున్నాయి.

1995 ముందు వరకు స్థానిక గిరిజనులు కాగడాలతో బొర్రాగుహలను నిర్వహించేవారు. తరువాత పర్యాటకశాఖ విద్యుత్‌ సౌకర్యం కల్పించి, లైట్లను ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజనులకు టికెట్‌పై కమిషన్‌ ఇచ్చి నడిపేవారు. 2000 నుంచి పర్యాటకశాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆ­దా­యంలో కొంతమేర గుహల అభివృద్ధికి కేటాయించింది. 

మూడు విభాగాల్లో..
కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్‌ పథకంలో భాగంగా మంజూరు చేసిన రూ.29.88 కో­ట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రై­ల్వే­స్టేషన్‌ నుంచి కొండప్రాంతంలోని పార్కిం­గ్‌ ప్రదేశం వరకు రోడ్డుమార్గంలోని దారిపొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్‌ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.

రెండో విభాగంలో బొర్రాగుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్‌ స్ట్రీట్‌ ఏర్పాటు చేస్తారు. మూడో విభాగంలో బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్‌ లెస్‌ టికెట్‌ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్‌లైన్, పేటీఎం ద్వారా బుక్‌ చేసుకునే సౌకర్యం ఉంటుంది.  ఇప్పటివరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండగా, మరో 60 అదనంగా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకశాఖ ఈఈ రమణ మాట్లాడుతూ బొర్రాగుహల అభివృద్ధి పనులకు సంబంధించి, టెండర్‌ పూర్తి కాగానే పనులు మొదలు పెడతామని చెప్పారు. 

Advertisement

What’s your opinion

Advertisement