Sakshi News home page

కొందామన్నా బొగ్గు ఇవ్వని కేంద్రం 

Published Wed, Mar 9 2022 5:10 AM

Central Govt Not Allowing To Buy Coal - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయానికి ఎటువంటి కొరత రాకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడటం లేదు. పాత, కొత్త బకాయిలు చెల్లిస్తూ ఎప్పటికప్పుడు ఎంత ధర అయినా చెల్లించి బొగ్గును, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. భవిష్యత్‌లోనూ విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును కొనేందుకు సిద్ధంగా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరం మేరకు బొగ్గు అందించకపోగా, కొరత రాకుండా నిల్వలు పెంచుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తోంది. సరిపడా బొగ్గు ఇవ్వాల్సిన కేంద్రమే ఇవ్వడం తగ్గించేసి, ఇలా చెప్పడమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. 

నిల్వలు పెంచుకోండి.. బయటకు అమ్మకండి 
దేశ విద్యుత్‌ అవసరాల్లో సుమారు 60 శాతం వరకు థర్మల్‌ విద్యుత్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని కేంద్రం తాజాగా రాష్ట్రాలకు తెలిపింది. ఈ అవసరాలు తీర్చడానికి థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో 9 మిలియన్‌ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడం ద్వారా నిల్వలు పెంచుకోవాలని దేశంలోని దాదాపు 135 థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు కేంద్రం సూచించింది. అదేవిధంగా ఉత్పత్తి సంస్థలు తాము చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొనుగోలుదారుల అనుమతి లేకుండా బయటివారికి విద్యుత్‌ను విక్రయిస్తే పవర్‌ ఎక్స్చేంజ్‌లో మూడు నెలలపాటు పాల్గొనకుండా డిబార్‌ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, జరిమానా విధిస్తామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. దీనికోసం విద్యుత్‌ చట్టం 2003లోని సెక్షన్‌ 63 మార్గదర్శకాల్లో క్లాజ్‌ 6.4లో కొత్తగా ‘జి’ నిబంధన తెచ్చింది.  

అడిగినా ఇవ్వని కేంద్రం 
ఏటా అక్టోబర్‌ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం బొగ్గు నిల్వలు పెంచుతాయి. ఈ వేసవిలో రాష్ట్రంలో 225 మిలియన్‌ యూనిట్లకు విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని అంచనా. కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచితే తప్ప వేసవి అవసరాల నుంచి బయటపడలేం. గతేడాది బొగ్గు కొరత ఏర్పడినప్పటి నుంచి కేంద్ర విద్యుత్‌ శాఖ అధికారులతోపాటు కోల్, రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి బొగ్గు కేటాయింపులు చేస్తున్నారు. ప్రస్తుతం కోల్‌ ఇండియా నుంచి రాష్ట్రానికి రోజువారీ అవసరాలకు మాత్రమే బొగ్గు కేటాయింపు జరుగుతోంది. సింగరేణి, మహానది కోల్‌ ఫీల్డ్‌ నుంచి రావాల్సినంత బొగ్గు రావడం లేదు. వేసవి కోసం బొగ్గు నిల్వ చేయడానికి రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ఆ మేరకు కూడా ఇవ్వడం లేదు. కేవలం 10 నుంచి 12 ర్యాక్‌లు మాత్రమే వస్తున్నాయి.  

ఏపీ జెన్‌కో నుంచి 45 శాతం విద్యుత్‌ 
రాష్ట్రంలో ప్రస్తుతం 200 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవుతోంది. మనకు 5,010 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలున్నాయి. వీటినుంచి 85 మిలియన్‌ యూనిట్లు, హైడల్‌ 8.5 మిలియన్‌ యూనిట్లు, సోలార్‌ 2.4 మిలియన్‌ యూనిట్ల చొప్పున 97 మిలియన్‌ యూనిట్ల మేర రోజు విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అంతర్గత వినియోగం పోనూ 92 మిలియన్‌ యూనిట్లు గ్రిడ్‌కు వెళుతోంది. అంటే మొత్తం డిమాండ్‌లో 45 శాతం ఏపీ జెన్‌కో ద్వారా సమకూరుతోంది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రోజుకు 60 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ, కృష్ణపట్నం, ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఎంతైనా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జెన్‌కో సిద్ధంగా ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి కేటాయింపులు రావడం లేదు. 
– బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్‌కో   

Advertisement

What’s your opinion

Advertisement