Sakshi News home page

పోలీసుల పిల్లలకు ఉచితంగా సివిల్స్‌ కోచింగ్‌

Published Sun, Dec 26 2021 5:43 AM

Civils coaching free for police children - Sakshi

అనంతపురం క్రైం: పోలీసుల పిల్లలు సివిల్స్, గ్రూప్స్‌లో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ కమ్‌ స్టడీ సెంటర్‌ ఏర్పాటైంది. దీన్ని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప.. పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ మల్లారపు నవీన్, రాష్ట్ర గ్రేహౌండ్స్‌ విభాగం అసాల్ట్‌ కమాండర్‌ కొమ్మి శివకిషోర్, ఐఏఎస్‌ అధికారిణి ధాత్రిరెడ్డితో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫక్కీరప్ప మాట్లాడుతూ.. పోలీసుల పిల్లలు ఏదో ఒక ఉన్నత ఉద్యోగం సాధించాలనే ఆశయంతో ఆధునిక సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌ –1 ఉద్యోగాలు సాధించేందుకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళ్లకుండానే పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ఇందులో ఉండే పుస్తకాలను డిజిటల్‌ విధానంలో కూడా చదువుకునేలా సెంట్రలైజ్డ్‌ సర్వర్‌తో 15 కంప్యూటర్లను సిద్ధం చేశామన్నారు.

50 మంది విద్యార్థులు కూర్చునేలా డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఢిల్లీలోని వాజీరాం లాంటి ప్రముఖ కోచింగ్‌ సెంటర్ల ద్వారా ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే నెల 6 నుంచి ఈ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. రౌండ్‌ ద క్లాక్‌ లైబ్రరీ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. మొదట పోలీసు కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యతనిస్తామని వివరించారు. భవిష్యత్తులో నిరుపేద అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు.. నాగేంద్రుడు, రామమోహన్‌రావు, హనుమంతు, డీఎస్పీలు.. వీరరాఘవరెడ్డి, చైతన్య, ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సివిల్‌ సర్వీసెస్‌పై నిర్వహించిన వర్క్‌షాపులో అధికారులు తమ అనుభవాలను అభ్యర్థులతో పంచుకున్నారు.

నిర్దిష్ట ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి
నిర్ధిష్ట ప్రణాళికతో సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి సరైన గైడెన్స్‌ తప్పనిసరి. సరైన గైడెన్స్‌ ఉంటే ఎలాంటి తప్పులు లేకుండా లక్ష్యం సాధించవచ్చు. 
– మల్లారపు నవీన్, సబ్‌ కలెక్టర్, పెనుకొండ

సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి
సివిల్స్‌ సాధించాలనుకునేవారు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. మొదటిసారే మంచి ర్యాంకు సాధించాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలి. 
– ధాత్రిరెడ్డి, ఐఏఎస్‌

గొప్ప అవకాశం
మా నాన్న హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ, హైదరాబాద్‌ వెళ్లి శిక్షణ పొందాలంటే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురంలోనే లైబ్రరీ కమ్‌ స్టడీ సెంటర్‌ ఏర్పాటు మాకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది.
– మాధవి, బీటెక్‌ గ్రాడ్యుయేట్, అనంతపురం

భవిష్యత్తుకు బంగారు బాట
పోలీసుల పిల్లల భవిష్యత్తుకు ఎస్పీ బంగారు బాటలు వేశారు. సివిల్స్‌కు శిక్షణ పొందే అవకాశాన్ని జిల్లాలోనే కల్పించడం చాలా గొప్ప విషయం.     
– సాకే త్రిలోక్‌నాథ్, పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యుడు 

Advertisement

What’s your opinion

Advertisement