Sakshi News home page

విశాఖ ఏఎస్‌ఆర్‌ నగర్‌లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ

Published Sat, Jul 29 2023 4:50 AM

Distribution of 134 Tidco houses in Visakhapatnam ASR Nagar - Sakshi

తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్‌ఆర్‌ నగర్‌లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్‌సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు.

ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు.

వచ్చే దసరాకు వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీశ్, ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్‌–5 జోనల్‌ కమిషనర్‌ ఆర్‌.జి.వి.కృష్ణ, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పాపునాయుడు, టిడ్కో ఎస్‌ఈ డి.ఎన్‌.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement