Sakshi News home page

సచివాలయ ఉద్యోగులకు.. కొత్త పే స్కేల్‌ వేతనాలు

Published Mon, Aug 1 2022 4:14 AM

New Pay Scale Wages for Village and Ward Secretariat employees - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా నేటి నుంచి పూర్తి స్థాయి శాశ్వత ప్రభుత్వోద్యోగుల మాదిరిగా తొలిసారి పే–స్కేల్, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో కూడిన వేతనాలు అందుకోనున్నారు. కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్‌సీ నిర్వహించిన డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లో పాసైన ఉద్యోగులందరికీ ఒకేసారి ప్రభుత్వం జూలై 1వతేదీ నుంచి ప్రొబేషన్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వారంతా జూలై నెలకు సంబంధించిన వేతనాలను ఆగస్టు 1వ తేదీ నుంచి అందుకోబోతున్నారు. 

పీఆర్సీ కమిటీ చెప్పకున్నా..
వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ కోసం 2018లో కమిటీ ఏర్పాటు చేసే నాటికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అన్నదే లేదు. 2019 మే నెలాఖరున ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేశారు. పీఆర్సీ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తమ నివేదికలో ఎలాంటి పెరుగుదలను సూచించలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా జోక్యం చేసుకుని ప్రత్యేక జీవో తెచ్చి ప్రొబేషన్‌ ఖరారైన సచివాలయ ఉద్యోగులందరికీ కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రత్యేక కంట్రోల్‌ రూం ద్వారా పర్యవేక్షణ 
రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో సైతం ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రభుత్వం కొత్తగా పే – స్కేల్‌ అమలు చేసిన దాఖలాలు లేవు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు రూ.15 వేల చొప్పున గౌరవ వేతనం పొందుతున్నారు. వాటి స్థానంలో పే– స్కేల్‌తో కూడిన వేతనాలు చెల్లించేందుకు ఆయా ఉద్యోగుల వివరాలను పూర్తి స్థాయిలో మరోసారి అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సచివాలయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

ఈ నెల 20వతేదీ నుంచే ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల బిల్లులను ప్రభుత్వానికి సమర్పించే డ్రాయింగ్, డిస్పర్స్‌మెంట్‌ ఆఫీసర్స్‌–డీడీవోలు ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించారు. ఆయా డీడీవోల పరిధిలో ఎంత మంది ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారైంది? ఎంత బిల్లులు అప్‌లోడ్‌ అయ్యాయనే వివరాలు సేకరించి ఇబ్బందులుంటే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఇటీవల డీడీవోల బదిలీల కారణంగా బిల్లుల సమర్పించడంలో జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని చోట్ల డీడీవోలు వివిధ కారణాలతో బిల్లులు అందించడం ఆలస్యమైనా 30వతేదీ వరకు వచ్చే బిల్లులను కూడా అనుమతించారు. 

ఆది నుంచి ఆటంకాలు సృష్టిస్తూ..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ ప్రక్రియ ప్రారంభించిన నాటి నుంచే ప్రతిపక్ష పార్టీలు ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించాయి. ఇంటర్వ్యూలు లేకుండా రాతపరీక్ష ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అధికార పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని దుష్ప్రచారం చేశాయి. పోటీ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులే అందులోనిజం లేదని తేల్చారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయటాన్ని సహించలేక అవి తాత్కాలికమేనని, జీతాలు పెరగవంటూ ఉద్యోగులను కించపరిస్తూ అవాస్తవాలను ప్రచారం చేశారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు విపక్షాలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. 

ప్రతిసారీ సీఎం జగన్‌ సానుకూల వైఖరే.. 
‘సచివాలయాల ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చేందుకు వీలు కాదని ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం చెప్పినా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం వారిపై ఉన్న అభిమానంతో పెరిగిన కొత్త వేతనాల ప్రకారమే వారికి జీతాలివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తమకు సంబంధించిన అన్ని అంశాల్లో మేలు చేసేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు సచివాలయ ఉద్యోగులంతా రుణపడి ఉంటారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ప్రొబేషన్‌ ఖరారు అనంతరం తొలిసారి పే స్కేలు ప్రకారం వేతనాలు అందుకోనున్న ఉద్యోగులకు అభినందనలు’
– కాకర్ల వెంకట్రామిరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు

గుండె నిండా అభిమానంతో సెల్యూట్‌
‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే జీవిత ఆశయం నెరవేరుతున్న వేళ గుండె నిండా అభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌కు సెల్యూట్‌ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ ప్రభుత్వం నూతన పేస్కేల్‌ వర్తింపజేయడంతో ఇన్నాళ్లూ విమర్శలు చేసిన వారి నోర్లు మూగబోయాయి. సచివాలయ ఉద్యోగులకు ఇది  శుభవార్త కాగా కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచింది.
–ఎం.డి.జాని పాషా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

ఈ మేలు మరువలేం..
ఒకేసారి 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసి లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు ముఖ్యమంత్రి జగన్‌. ఆయనకు సచివాలయాల ఉద్యోగులు, వారి కుటుంబాలన్నీ జీవిత కాలం రుణపడి ఉంటాయి. ఈ మేలు ఎప్పటికీ మరువలేం.
–భీమిరెడ్డి అంజనరెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్‌.ఆర్‌.కిషోర్, విప్పర్తి నిఖిల్‌ కృష్ణ, భార్గవ్‌ సుతేజ్‌ (గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌)  

Advertisement

What’s your opinion

Advertisement