Sakshi News home page

FactCheck: విశాల హితం.. రామోజీ రాతల్లో ఖతం

Published Sat, Mar 30 2024 2:35 AM

Ramoji Rao false writings on Three Capitals - Sakshi

మూడు రాజధానులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కంకణం

చంద్రబాబు అండ్‌ కో అడ్డుకోవడం చట్టసభల సాక్షిగా నిజం

దీంతో మూడు రాజధానుల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా 

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి 

ఇదే విషయాన్ని నంద్యాల సభలో పునరుద్ఘాటించిన సీఎం జగన్‌ 

దీంతో తమ బాబుకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని రామోజీ బెంబేలు

పచ్చ పైత్యం జోడించి అమరావతిని చంపేశారంటూ దుష్ప్రచారం

శాసన రాజధానిగా అమరావతి, పాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు

అమరావతి రైతులతో కృత్రిమ పోరాటం చేయిస్తూ దీన్ని న్యాయస్థానంలో అడ్డుకున్నది మీ బాబే 

99 శాతం హామీల అమలు అసలు సిసలు వాస్తవం

బాబు ప్రజలను వంచించినా రామోజీకి మాత్రం బ్రహ్మాండం 

దేశంలో తీర ప్రాంతాల్లో వెలసిన రాజధానులు ఆ రాష్ట్ర ప్రగతికి పునాదులు వేశాయన్నది కళ్లెదుట కనిపించే నిజం.  అందుకే రాష్ట్ర విశాల హితమే ధ్యేయంగా సీఎం జగన్‌ మూడు రాజధానులను ప్రకటించారు. రామోజీకి మాత్రం ఇది  గిట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ సాగించే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దెబ్బ తింటుందనే. ఆ సంకుచిత  ధోరణితో ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని రామోజీ, చంద్రబాబు బృందం తెగ ఆరాట పడిపోయింది. 

రాజధాని గురించి ముందుగా లీకులిచ్చింది కూడా ఈ భూ దందాల కోసమేనని ఎవరినడిగినా చెబుతారు. అమరావతి  పాలనా రాజధాని కాదంటే ఆ పరిసరాల్లో ముందస్తుగా అడ్డగోలుగా ఎల్లో బ్యాచ్‌ కొన్న భూముల విలువ పడిపోతుందని రామోజీ భయం. అందుకే శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నా, జగన్‌ గట్టి సం కల్పం వల్ల శాసనసభలో బిల్లుకు ఆమోదం లభించింది.

ఇది నచ్చని బాబు బ్యాచ్‌ అడ్డుపడి కోర్టు కెక్కింది. ఇదే  విషయాన్ని నంద్యాల సభలో సీఎం జగన్‌ ప్రస్తావిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు గురించి మాట్లాడితే దానికి  రామోజీ వక్రభాష్యం చెబుతూ ఏడుపుగొట్టు.. వెకిలి.. వెటకారపు రాతలతో కథనాన్ని అచ్చేశారు. 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులను ఏర్పాటు చేసిన మాట  చట్టసభల సాక్షిగా నిజం. మూడు రాజధానులకు బల ప్రదర్శన ద్వారా తొలుత శాసన మండలిలో చంద్రబాబు అండ్‌ కో బృందం అడ్డుపడింది. మళ్లీ శాసన సభ ఆమోదించిన తర్వాత మండలి ఆమోదించక తప్పలేదు. ఆ తరువాత న్యాయస్థానానికి వెళ్లి మూడు రాజధా­నులు ఏర్పాటు కాకుండా ఈ బృందమే అడ్డుకుంది.

ఈ పరిణామంతో మూడు రాజధానుల కార్యకలా­పాలు వాయిదా పడ్డాయే తప్ప.. వాటి ఏర్పాటు అక్షరాలా నిజం. ఇదే విషయాన్ని నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దీనికి ఈనాడు రామోజీ వెటకారంతో పైత్యం జోడించి సిగ్గులేని కథనం అచ్చువేశారు. అమరావతిని చంపేశారంటూ పచ్చి అబద్ధాలను వండి వార్చారు. అభివృద్ధి వికేంద్రీకర­ణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు.

అమరావతిలో బాబు చేపట్టి పూర్తి చేయకుండా వదిలేసిన పనుల్లో అవసరమైన పను­లనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టింది. రామోజీ ఈ అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రధాన కారణం తనకు ఇష్టుడైన చంద్రబాబు అండ్‌ కో బ్యాచ్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిలిపోయిందనే అక్కసే తప్ప మరొకటి కాదు.

తొలి నుంచి పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది వైఎస్సార్‌సీపీ విధానం. అందులో భాగంగానే  విశాఖ­పట్నాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చట్టం చేయడం..  చంద్రబాబు అండ్‌ కో బృందం న్యాయస్థానానికి వెళ్లి ఈ చర్యను అడ్డుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. 

అడ్డుకోబోయింది మీ బాబే
అమరావతి రైతుల పేరుతో ఒక వైపు కృత్రిమ పోరాటం చేయిస్తూ, మరో పక్క న్యాయస్థానంలో అడ్డుకుంది మీ బాబే రామోజీ. జనం అమాయకులు కాదు. మీరు ఏది రాస్తే దాన్నే జనం నమ్ముతారను­కోవడం మీ అజ్ఞానం, అవివేకం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనలో వ్యవస్థల్లో గొప్ప విప్లవాత్మక మార్పులను తెచ్చారనేది వాస్తవం. మీరు అంగీకరించకపోయినా నీతి ఆయోగ్‌తో పాటు ప్రపంచ బ్యాంకు తదితర గొప్ప సంస్థలు జగన్‌ ప్రభుత్వానికి కితాబిచ్చాయి. మీ చంద్రబాబు కుప్పా­న్ని రెవెన్యూ డివిజన్‌ చేయలేకపోతే, సీఎం జగన్‌ చేసి చూపించి, కుప్పంపై తనకున్న అభిమా­నాన్ని చాటు­కు­న్నారు.

రెండేళ్ల పాటు కోవిడ్‌ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టినా సరే ఏ మాత్రం వెనక­డుగు వేయకుండా ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఈ విషయాన్నే ఆయన తన ప్రసంగంలో చెప్పారు. ఇందులో ఆత్మస్తుతి, పరనింద ఏముందీ రామోజీ? గ్రామ, వార్డు సచివాయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో చదువు­కున్న 10–11 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇది జగమెరిగిన సత్యం. ఎవరూ కాదనలేని నిజం. రైతుల కోసం ఆర్‌బీకేలను ఏర్పాటు చేశారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ను ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.

బాబు ఐదేళ్ల పాల­నలో జిల్లాలను పునర్‌ వ్యవస్థీకరించాలనే ఆలోచనే చేయలేదు. జగన్‌ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. ఇది పరిపాలన వ్యవస్థలను మరింతగా ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే­సారి ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలల నిర్మా­ణం చేపట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు చేయలేకపో­యిన, సాధించలేకపోయిన నాలుగు పోర్టుల నిర్మాణాన్ని ప్రభు­త్వమే చేపట్టింది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవ­స్థతో పాటు వలంటీర్లను ఏర్పాటు చేసి లంచాల్లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న విషయం కళ్లెదుట కనిపించే వాస్తవం. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీతో పాటు మధ్యలో రూపాయి దుర్వినియోగం కాకుండా నేరుగా వారి ఖాతాలకు చేరుతోంది. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న నిజాలు రామోజీ. మీరు కాదన్నా.. వెటకారం చేసినా రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తున్న వాస్తవాలివి.

రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలిలా..
మహిళా సాధికారత, మహిళా సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని నోబల్‌ గ్రహీత దుఫ్లో కొనియాడారు.
   ఐక్య రాజ్య సమితి ఛాంపియన్‌ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసింది. గ్రామ స్థాయిలో ఆర్‌బీకెల ఏర్పాటు చేయాలనే వినూత్న ఆలోచనను ఎఫ్‌ఏఒ కంట్రీ డైరెక్టర్‌ టోమియో పిచిరి అభినందించారు.
  ఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు.
  ప్రతి 2000 జనాభాకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న ఏపీ ప్రభుత్వ చర్యలను డబ్యుఈఎఫ్‌ హెల్త్‌ కేర్‌ చీఫ్‌ డా.శ్యామ్‌ బిషెన్‌ ప్రశంసించారు.
  31.88 లక్షల మంది మహిళలు, పిల్లలకు లబ్ధి చేకూరేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది.
   విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అమ్మ ఒడి పథకం వల్ల అక్షరాస్యత రేటు పెరుగుతోందని నోబెల్‌ గ్రహీత జాన్‌ బి.గూడెనఫ్‌ ప్రశంసించారు.
  విద్య, ఆరోగ్య, సామాజిక రంగ పెట్టుబడుల్లో ఏపీ పురోగతిని ప్రపంచ బ్యాంకుప్రశంసించింది.
   కోవిడ్‌కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచం మొత్తం నేర్చుకోవాలని యూకే మాజీ డిప్యుటీ హైకమిషనర్‌ అండ్రూ ఫ్టెమింగ్‌ కొనియాడారు.

Advertisement

What’s your opinion

Advertisement