Guntur: Doctors remove 1.2kg tumour from patient's jaw in rare surgery at GGH - Sakshi
Sakshi News home page

అరుదైన ట్యూమర్‌.. వైద్యులంతా చర్చించి.. ధైర్యం చేసి..

Published Thu, Apr 13 2023 7:46 AM

Successful Surgery For Rare Tumor At Guntur Ggh - Sakshi

సాక్షి, గుంటూరు మెడికల్‌: మెడికల్‌ జర్నల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైన అత్యంత అరుదైన ట్యూమర్‌ను గుంటూరు జీజీహెచ్‌ జనరల్‌ సర్జరీ వైద్యులు గుర్తించారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్‌ను జనరల్‌ సర్జరీ రెండో యూనిట్‌ వైద్యులు విజయవంతంగా చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆస్పత్రిలో బుధవారం మీడియాకు ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏకుల కిరణ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు.

విజయవాడకు చెందిన నేలటూరి శామ్‌సన్‌జాన్‌సునీల్‌ మంచంపై నుంచి లేవలేని విధంగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతడిని విజయవాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. వైద్యులు తక్షణమే అతడికి రక్తం ఎక్కించి ఆరోగ్యం కొంచెం మెరుగుపడ్డాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపు కింది భాగంలో జిస్ట్‌ అనే కణితి ఉన్నట్లు నిర్థారించారు. సర్జరీ కోసం ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిని సంప్రదించినా లాభంలేక గుంటూరు జీజీహెచ్‌కు మార్చి 14న రోగిని తీసుకొచ్చారు.

రిపోర్టులు పరిశీలించి.. చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్‌ జంక్షన్‌ దగ్గర అత్యంత అరుదైన జిస్ట్‌ ట్యూమర్‌ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ చెప్పారు. చిన్నపేగు మొదటి భాగంలో గ్యాస్ట్రో ఇంటస్టీనల్‌ స్ట్రోమల్‌ ట్యూమర్‌(జిస్ట్‌) ఇప్పటివరకు మెడికల్‌ జర్నల్స్‌లో రెండు మాత్రమే నమోదైనట్టు తెలిపారు.
చదవండి: సింగపూర్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

ఈ సమస్యకు ఏ విధంగా ఆపరేషన్‌ చేయాలనే విషయాలు ఎక్కడా పేర్కొనలేదని, రెండో యూనిట్‌ జనరల్‌ సర్జరీ వైద్యులంతా దీని గురించి చర్చించి ధైర్యంగా మార్చి 25న ఆపరేషన్‌ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకూ తీసుకునే ఈ సర్జరీని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేశారు. ఆపరేషన్‌ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు చలం, నాగసంతోష్, వంశీధర్, అ­నూ­ష, వేణుగోపాల్, కోటి, మత్తు వైద్యులు మహేష్‌బాబు,  ఆనందబాబు, అలేఖ్య, కీర్తి, రాఘవ, కవిత పాల్గొన్నట్టు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement