మ్యూచువల్‌ ఫండ్స్‌లో మరింత పోటీ! | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మరింత పోటీ!

Published Wed, Nov 17 2021 8:53 AM

Two Companies Applied For Mutual Fund sector - Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు కంపెనీలు అమితాసక్తి చూపిస్తున్నాయి. రూ.37 లక్షల కోట్ల ఆస్తులతో కూడిన ఈ పరిశ్రమ ఫిన్‌టెక్‌ కంపెనీలకు ఆకర్షిస్తోంది. తాజాగా రెండు సంస్థలు.. ఓల్డ్‌ బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (కెన్నెత్‌ ఆండ్రడేకు చెందిన), ఏంజెల్‌ వన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులను సెబీ వద్ద దాఖలు చేశాయి. ‘‘మా తదుపరి విస్తరణ క్రమంలో భాగంగా ఏఎంసీ సేవల్లోకి ప్రవేశిస్తున్నాం. మా క్లయింట్ల కోసం ప్యాసివ్‌ పెట్టుబడి ఉత్పత్తులను తీసుకురావాలన్నది ప్రణాళిక. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌ సాయంతో ప్యాసివ్‌ ఉత్పత్తులను రూపొందిస్తాం. యాక్టివ్‌ ఫండ్స్‌తో పోలిస్తే ప్యాసివ్‌ ఉత్పత్తులు మంచి పనితీరు చూపిస్తాయని నమ్ముతున్నాం. పైగా ఇవి చౌక చార్జీలకే లభిస్తాయి’’ అని ఏంజెల్‌వన్‌ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ తివారి తెలిపారు.  

క్యూలో చాలా సంస్థలు.. 
గడిచిన కొన్ని నెలల్లో.. మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్స్‌ల కోసం చాలా దరఖాస్తులు వచ్చాయి. సమీర్‌ అరోరా ఆధ్వర్యంలోని హీలియోస్‌ క్యాపిటల్, హిరేన్‌వేద్, రాకేశ్‌ జున్‌జున్‌వాలా సహ వ్యవస్థాపకులుగా ఉన్న ఆల్‌కెమీ క్యాపిటల్, యూనిఫి క్యాపిటల్, వైజ్‌మార్కెట్స్‌ అనలైటిక్స్‌ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నాయి. మొత్తం మీద ఏడు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సెబీ అనుమతి కోసం వేచి చూస్తున్నాయి. సెబీ ఇప్పటికే బజాజ్‌ ఫిన్‌సర్వ్, జెరోదాలకు గడిచిన మూడు నెలల్లో మ్యూచువల్‌ ఫండ్‌ లైసెన్స్‌లను జారీ చేసింది. ఎన్‌జే ఇండియా, శామ్కో సెక్యూరిటీస్‌ కూడా ఫండ్స్‌ వ్యాపారాన్ని ప్రారంభించనున్నాయి. సుమారు 44 ఫండ్స్‌ సంస్థలు ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రచార, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. కొత్త సంస్థల రాకతో ఈ పోటీ మరింత పెరగనుంది.
 

Advertisement
Advertisement