Sakshi News home page

ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! మామిడిలోనూ మంచి ఆదాయం!

Published Tue, May 2 2023 5:04 PM

Anantapur: Farmers Gets Huge Profits With Organic Farming Within 40 Cents Land - Sakshi

ఈ రైతు దంపతులు ప్రకృతిని, తనకున్న రెండు ఆవులను నమ్ముకున్నారు.. పేడ, గోమూత్రంతో ఘనజీవామృతం, జీవామృతాలను తయారు చేసుకొని ఏడేళ్లుగా శ్రద్ధగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.. వీరి స్వయం కృషికి పంచభూతాలు సాయం చేస్తున్నాయి.

మామిడి తోట మధ్యలో 40 సెంట్లలో ఫిబ్రవరి నుంచి అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి వారం మంచి ఆదాయం పొందుతున్నారు. అందుకే దీన్ని ‘ఏటీఎం నమూనా’గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. కేవలం ఈ అంతరపంటల ద్వారా మొత్తం రూ.3 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉందంటున్న నారాయణ, పార్వతి దంపతుల కృషిపై ‘సాక్షి’ ఫోకస్‌..

స్వయంకృషితో పాటు ప్రకృతిని నమ్ముకుంటే రైతు సుభిక్షంగా ఉంటాడనడానికి హెచ్‌. నారాయణ, పార్వతి దంపతులే నిదర్శనం. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామం. తమకున్న 3.70 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.

అంతర పంటల్లోనూ మంచి ఆదాయం
తమకున్న రెండు నాటు ఆవులను సంరక్షిస్తూ పేడ, గో మూత్రంతో ద్రవ జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. స్వయం కృషికి తోడుగా అతి తక్కువ పెట్టుబడితోనే మామిడిలో, అంతర పంటల్లోనూ మంచి ఆదాయం ఆర్జిస్తూ ఇతర రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.  

మామిడి తోటలోని 40 సెంట్ల స్థలాన్ని ఫిబ్రవరి 13న ఎంపిక చేసుకొని బోదెలు సిద్ధం చేసుకున్నారు. ఐదు వరసల్లో 5 రకాల పంటలను విత్తుకున్నారు. గోరుచిక్కుడు, క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి, అలసంద, మొక్కజొన్నతో పాటు మెంతాకు, కొత్తిమీర, గోంగూర సాగు చేస్తున్నారు. బోరు నీటిని అందిస్తున్నారు. ఘనజీవామృతం వేస్తున్నందు వల్ల నీరు కూడా ఎక్కువ అవసరం రావటం లేదు.

ఒక్క తడి ఇస్తే 15–20 రోజులు ఉంటుంది. కెమికల్‌ వేసిన పొలం అయితే ఐదారు రోజులకే నీరు మళ్లీ అడుగుతుంది. తోట పనులను నారాయణ, ఆయన భార్య కలసి చేసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం మార్కెట్‌లో, ఇంటి దగ్గర కూరగాయలు అమ్ముతున్నారు.

గోరుచిక్కుడు ద్వారా 30 వేలు
ఇప్పటివరకు గోరుచిక్కుడు (చోలా కాయల) ద్వారా రూ.30 వేలు, ముల్లంగి ద్వారా రూ.50 వేలు, కొత్తిమీరలో రూ.20 వేలు, మెంతాకు, గోంగూరలలో మరో రూ.20 వేలు ఆదాయం వచ్చింది. ముల్లంగి, ఆకుకూరలు తీసేవి తీస్తూ ఉంటే మళ్లీ విత్తుతున్నారు.

మొక్కజొన్న, అలసంద, క్యారెట్, బీట్‌రూట్‌ పంటలు మరో ఒకటిన్నర నెలల్లో చేతికొస్తాయి. క్యారెట్, బీట్‌రూట్‌ మంచి ధర పలుకుతాయని, మొత్తంగా 40 సెంట్లకు రూ.3 లక్షలకు పైగానే ఆదాయం వస్తుందని, ఇదంతా నికరాదాయమేనని నారాయణ ధీమాగా చెబుతున్నారు.

రూ. 1,500లతో విత్తనాలు కొనటం తప్ప వేరే ఏ ఖర్చూ లేదన్నారు. రసాయనాలు వేయకుండా పంటలను పసిబిడ్డల్ని చూసుకున్నట్లు చూసుకుంటున్నామని నారాయణ చెప్పారు. అంతర పంటల ద్వారా నిరంతరం ఆదాయం వస్తోందని చెబుతూ.. ఇదే ఏటీఎం మోడల్‌ పంటల వల్ల లాభం అన్నారు. తనను చూసి తన పక్క పొలం రైతు కూడా 20 సెంట్లలో ఈ నమూనాలో పంటలు వేశాడన్నారు. క్లస్టర్‌లో మరో 25 మంది రైతులు వేశారన్నారు. 

మామిడిలోనూ మంచి ఆదాయం  
మామిడి పంటను కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నారాయణ దంపతులు సాగు చేస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతాన్ని వినియోగిస్తూ మంచి దిగుబడి, ఆదాయం పొందుతున్నారు. గత ఏడాది మామిడి 8 టన్నుల దిగుబడి రాగా రూ.2 లక్షల ఆదాయం వచ్చింది.

ఈ ఏడాది ఇప్పటికే 6 టన్నులు పంట కోత కోశారు. మరో 3 టన్నులు పంట చేతికొస్తుంది. మామిడి ద్వారా రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని నారాయణ చెబుతున్నారు.

ప్రకృతి వ్యవసాయంలో పండించిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయని, రుచిగా ఉంటున్నాయని వినియోగదారులు సంతోషంగా మంచి ధరకు తీసుకుంటున్నారని నారాయణ, పార్వతి ఆనందంగా చెబుతున్నారు. వీరి పొలాన్ని ఇటీవల పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ బి.రాజశేఖర్, ఏపీ రైతు సాధికార సంçస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయ్‌కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్‌ గౌతమి తదితరులు సందర్శించి అభినందించారు.   

ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు
నేను అయిష్టంగానే ప్రకృతి వ్యవసాయాన్ని ఏడేళ్ల క్రితం మొదలు పెట్టాను. డీపీఎం లక్ష్మానాయక్, మాస్టర్‌ ట్రైనర్‌ శివశంకర్‌ అన్ని విషయాలూ అర్థమయ్యేలా చెప్పి సహకరించారు. ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. పంటలకు ఎలాంటి తెగుళ్లు, వైరఃస్‌లు రాలేదు.

పండ్ల తోటల్లో కూడా ఐదారు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఒకదాని తర్వాత ఒకటి మనకు పంట చేతికొస్తుంది. మంచి నికరాదాయం వస్తుంది. ఇది రైతులకు ఎంతో మేలైన పద్ధతి. భూమి కూడా గుల్లబారి బాగుంటుంది.

వాన నీరు బాగా ఇంకుతుంది. సహజ సిద్ధమైన ఎరువులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు తింటే మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది. నన్ను చూసి కొందరు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.  
– హెచ్‌.నారాయణ (95504 84675), ప్రకృతి వ్యవసాయదారుడు, మల్లాపురం గ్రా., కళ్యాణదుర్గం మం., అనంతపురం జిల్లా  

స్వయంగా చూస్తే గానీ నమ్మలేరు..
పది రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ అనంతపురం జిల్లాలో రైతులు సుమారు 400 మంది అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో అధికాదాయం పొందుతున్నారు. స్వయంగా వచ్చి చూస్తే గానీ ఇంత ఆదాయం వస్తున్నదని నమ్మకం కలగదు.

నారాయణ, పార్వతి రైతు దంపతులు తమ మామిడి తోటలో 40 సెంట్లలో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటికి రూ. 1,20,000 ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల్లో ఈ ఆదాయం రూ. 3 లక్షలకు పెరుగుతుందని రైతు ధీమాగా ఉన్నారు.

జిల్లా కలెక్టర్‌ గౌతమి, ఏపీ రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌చైర్మన్‌ టి. విజయకుమార్, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ బి.రాజశేఖర్‌ కూడా ఇటీవల నారాయణ తోటను సందర్శించారు.

అంత ఆదాయాన్ని పొందే అవకాశాలు ప్రకృతి వ్యవసాయంలో ఉన్నాయన్నది ఈ తోటలను స్వయంగా చూసిన వారికి అర్థం అవుతుంది. వారానికి రెండు, మూడు సార్లు కూరగాయలను విక్రయిస్తూ నిరంతరం ఆదాయం పొందుతున్నారు. అందువల్లనే ఈ నమూనాను ‘ఏటీఎం మోడల్‌’ అని పిలుస్తున్నాం.  
– లక్ష్మానాయక్‌ (83310 57583), ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్, అనంతపురం జిల్లా 
- ఈదుల శ్రీనివాసులు, సాక్షి, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా

Advertisement

What’s your opinion

Advertisement