పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. పచ్చిగుడ్డుతో వెరైటీ టీ | Sakshi
Sakshi News home page

చెత్త కాంబినేషన్‌, పచ్చిగుడ్డు, పండ్లతో చాయ్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా?

Published Thu, Oct 12 2023 4:45 PM

Have You Ever Tries Raw Egg Tea With Fruits Viral Video - Sakshi

మనలో చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. ఎన్ని పనులున్నా మొదట టీ తాగిన తర్వాతే ప్రారంభించే వాళ్లు బోలెడు మంది ఉన్నారు.  నీరసంగా, అలసటగా ఉన్నప్పుడు ఒక్క టీ అయినా పడాల్సిందే అనేలా ఫీల్‌ అవుతుంటారు. అంతగా మనోళ్లు ఛాయ్‌కి ప్రాధాన్యత ఇస్తారు. గ్రీన్‌ టీ, జింజర్‌ టీ, బ్లాక్‌ టీ, మసాలా టీ లాంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈమధ్య సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఎగ్‌ టీ గురించి మీకు తెలుసా? ఈ వెరైటీ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా టీ తయారు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. కానీ ఓ యూట్యూబర్‌ తయారు చేసిన వింత టీ గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఈ టీ టేస్ట్‌ సంగతి అటు ఉంచితే, దీన్ని తయారు చేయడం చూస్తేనే కడుపులో తిప్పేస్తుంది. ఎందుకంటే ఈ టీని పచ్చిగుడ్డుతో, పండ్లతో తయారు చేస్తారు. సాధారణంగా ఎగ్‌ టీ అనేది వెస్ట్రన్‌ దేశాల్లో బాగా ఫేమస్‌. వియత్నాం, స్వీడన్‌ వంటి దేశాల్లో గుడ్డును తరచూ టీ, కాఫీల్లో కలుపుకొని తాగేస్తారు. ఇంకెందుకు ఆలస్యమని ఇప్పుడు అదే ట్రెండ్‌ను మనవాళ్లూ ట్రై చేస్తున్నారు.

తాజాగా ఓ యూట్యూబర్‌ షేర్‌ చేసిన ఎగ్‌ టీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఏం చేసిందంటే.. ముందుగా టీ గిన్నె పెట్టుకుని అందులో షుగర్, టీ పొడి వేసి వేయించింది. ఇప్పుడు యాపిల్ ని ముక్కలుగా కోసి వేసి వేయించింది. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసి కాసేపు మరగ బెట్టింది. కాసేపు అయ్యాక పచ్చి గుడ్డును పగుల కొట్టి ఆ టీలో కలిపేసింది. ఆ తర్వాత ఫైనల్‌ టచ్‌ కోసం యాలకులు, దాల్చిన చెక్క వేసి మళ్లీ మరిగించి ఓ కప్పులో సర్వ్‌ చేసింది. ప్రస్తుతం ఈ వెరైటీ ఎగ్‌ టీకి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇది చూసిన నెటిజన్లు.. ఈ టీని తాగిన వాళ్లు బతికే ఉన్నారా? ఇలాంటి పిచ్చి ఐడియాలు ఎక్కడ్నుంచి వస్తాయో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరోవైపు టీ తాగే ముందు, లేదా తర్వాత వెంటనే  పండ్లను, గుడ్డును తినకూడదంటూ డైటీషియన్లు చెబుతున్న వీడియోలను కొందరు నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. ఎంత వెస్ట్రన్‌ కల్చర్‌ను ఫాలో అవుతున్నా, కొన్ని మన ఆరోగ్యానికి కూడా నప్పేలా ఉండాలి, ప్రతీది ఇలా కాపీ కొట్టందంటూ హితవు పలుకుతున్నారు. 

Advertisement
Advertisement