Sakshi News home page

దటీజ్‌ డాక్టర్‌ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్‌బాడీస్‌కి పోస్ట్‌మార్టం

Published Tue, Aug 8 2023 12:37 AM

Karwar Institute of Medical Sciences Assistant Professor Dr Mahalakshmi success story - Sakshi

‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహాలక్ష్మి

మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్‌ సైంటిస్ట్‌గా డాక్టర్‌ రుక్మిణీ కృష్ణమూర్తి  వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్‌ అయ్యేంతవరకు వర్క్‌ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు.

అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్‌ మహాలక్ష్మి.

చదువుకునే రోజుల్లో...
‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్‌. వాళ్లని చూసే నేనూ డాక్టర్‌ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్‌ డాక్టర్‌ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్‌ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది.

 రిస్క్‌ ఎందుకు అన్నారు..
చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్‌ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్‌ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్‌మేట్‌ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్‌. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది.

పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్‌ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్‌ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్‌ డాక్టర్‌.                   

అనేక పరిశోధనలు..
మేల్‌ డామినేటెడ్‌ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నుండి ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్‌ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్‌ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ వచ్చింది.
– డాక్టర్‌ మహాలక్ష్మి

Advertisement

What’s your opinion

Advertisement