Sakshi News home page

వేప తెగులు స్వల్పకాలికమే

Published Sat, Oct 21 2023 1:36 AM

A preliminary study of neem pest by ICAR - Sakshi

సాక్షి, సాగుబడి డెస్క్‌  :వాతావరణంలో, వర్షపాతంలో చోటు­చేసుకుంటున్న పెను మార్పులే వేప చెట్లకు శాపంగా మారినా, దీని వల్ల వేప కాయల ఉత్పత్తికి విఘాతం కలగటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ప్రాథమిక అధ్యయనంలో నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేప చెట్ల చిగుర్లు మాడిపోతుండటం, మరికొన్ని చోట్ల చెట్లు నిలువునా ఎండిపోతుండటం గత కొన్నేళ్లుగా రివాజుగా మారిన విషయం తెలిసిందే.  

టీ మస్కిటో పురుగు (టిఎంబి) సోకటం వల్ల కొన్ని నెలల పాటు (మే–సెప్టెంబర్‌) వేప చెట్ల కొమ్మలు ఎండిపోతూ.. తిరిగి వాటికవే తిప్పుకుంటున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన తర్వాత తగ్గిపోయే సమస్యేనని, దీని వల్ల వేప కాయల దిగుబడికి పెద్దగా నష్టం లేదని ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని ఐసీఏఆర్‌– కేంద్రీయ ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ (సిఎఎఫ్‌ఆర్‌ఐ–­కాఫ్రి) సంచాలకులు డా. ఎ. అరుణాచలం వెల్లడించారు. అయితే,  క్రిమిసంహారక స్వభావం కలిగిన వేపను టిఎంబి గతమెన్నడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆశిస్తోందన్న అంశంపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.

గాలిలో అధిక తేమ వల్లనే పురుగు ఉధృతి
ఆగ్రోఫారెస్ట్రీపై జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి సాగుబడి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మే నుంచి అకాల వర్షాలు, వర్షపాతంలో అసాధారణ మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండటం మూలంగా  ట్రీ మస్కిటో పురుగు ఉధృతి పెరుగుతోందన్నారు.

తెలంగాణలో కూడా కనిపించడం విచిత్రమే
సముద్ర తీర రాష్ట్రాల్లో ఇది ప్రధాన సమస్యగా ఎదురవుతున్నదని, కానీ తెలంగాణలో కూడా ఇది తీవ్రంగా కనిపిస్తుండటం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. 96 దేశాల్లో వేప చెట్లు పెరుగుతున్నాయని, అయితే, టీ మస్కిటో పురుగు సోకుతున్నట్లు చైనా తప్ప మరే దేశమూ వెల్లడించలేదన్నారు. గాలి ద్వారానే టిఎంబి విస్తరిస్తోందని, ఒక ప్రదేశంలో దగ్గర దగ్గరగా ఉన్న చెట్లకు ఎక్కువగా సోకుతోందని, ఇది మనుషులకు హానికరం కాదని డా. అరుణాచలం అన్నారు.

ఇలా అరికట్టవచ్చు
పొటాషియం లోపించిన నేలల్లో పెరుగు­తున్న వేప చెట్లకు టీఎంబీ ఎక్కువగా సోకు­తు­న్నట్లు కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. పొటా­షియం పుష్కలంగాఉన్న నేలల్లో చెట్లకు పెద్దగా సోకలేదు. పశువుల ఎరువులో ట్రైకోడెర్మా విరిడి కలిపి వేపచెట్లకు వేస్తే కొమ్మెండు సమస్యను సమర్థవంతంగా అరి­కట్టవచ్చని డా. అరుణాచలం వివరించారు. 

Advertisement

What’s your opinion

Advertisement