Sakshi News home page

కొత్తలైఫ్‌కు దారి చూపే లైఫ్‌ కోచ్‌

Published Sun, Jan 9 2022 12:45 AM

The Real Super Heroes and Women were awarded Prabika Pradhan - Sakshi

1950–లండన్‌: ‘ది ఫాదర్‌ ఆఫ్‌ ఆర్ట్‌ థెరపీ–బ్రిటన్‌’గా ప్రసిద్ధి చెందిన ఎడ్వార్డ్‌ ఆడమ్‌సన్‌ లండన్‌లోని ఒక ఎడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో పనిచేసేవాడు. ఆ తరువాత ఈ ఉద్యోగం మానేసి తీరిగ్గా డ్రాయింగ్స్, పెయింటింగ్స్‌ వేయడం మొదలుపెట్డాడు. ఈ క్రమంలోనే అతడికి ‘ఆర్ట్‌ థెరపీ’ మీద ఆసక్తి పెరిగింది. దీన్ని పరిశోధించడానికి కాలికి కుంచె కట్టుకొని ఎన్నో ప్రాంతాలు తిరిగాడు.

ఒక హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జాన్సన్‌ తన పరిసరాల్లోనే పెయింటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. ఈ పని అతను చురుగ్గా ఉండడానికి కారణం అయింది. దీంతో ఆ ఆస్పత్రిలో ఉన్న చాలామంది ఇతడిని అనుసరించేవారు. నిజానికి వారికి ‘ఆర్ట్‌’లో ఓనమాలు కూడా తెలియవు. తమకు తోచిన రీతిలో సాధన చేసి అద్భుతమైన ఫలితాన్ని పొందేవారు.

ఇలాంటివి ప్రత్యక్షంగా చూసిన తరువాత...లండన్‌లో ఓపెన్‌ ఆర్ట్‌ స్టూడియో మొదలుపెట్టి ‘ఆర్ట్‌ థెరపీ’ ఊపు అందుకోవడానికి కారణం అయ్యాడు ఆడమ్‌సన్‌. ‘ఆర్ట్‌ యాజ్‌ హీలింగ్‌’ ‘ఆర్ట్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌’‘ఆర్ట్‌ అండ్‌ మెంటల్‌హెల్త్‌’ ‘డార్క్‌నెస్‌ ఇన్‌టు లైట్‌’... మొదలైన పుస్తకాలు రాశాడు.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్‌
ఎడ్వార్డ్‌ ఆడమ్‌సన్‌ రచనలు ఎన్నో చదివి ‘ఆర్ట్‌ థెరపీ’పై ఆసక్తి పెంచుకుంది. వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో ఈ కళను ఒక బలమైన ఆయుధంగా చేసుకొని ‘లైఫ్‌ కోచ్‌’గా రాణిస్తుంది ప్రబిక ప్రదాన్‌. ఎంబీఏ చేసిన ప్రబికకు సమాజధోరణులను, వ్యక్తులను సూక్ష్మంగా పరిశీలించడం అంటే ఇష్టం.

తనకు ఒక సంఘటన ఎప్పటికీ గుర్తుంటుంది...
పెద్ద ఉద్యోగం చేసే ఒకాయన, ఏదో ఫంక్షన్‌ కోసం అత్తారింటికి వెళ్లాడట. అక్కడ సరైన మర్యాద లభించలేదట. అంతే, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు!
అసలు ఒకప్పుడు ఎంతెంత ధైర్యంతో ఉండేవాళ్లు..? కొండంత సమస్య ఎదురొచ్చినా భయపడేవారు కాదు. ఇప్పుడు ఆ ధైర్యం ఎటు పోయింది? చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోయే ధోరణి అంతకంతకూ పెరిగిపోతుంది. ఇలాంటి క్లిష్టసమయంలోనే ‘లైఫ్‌ కోచ్‌’గా తన బాధ్యతలను దేశ విదేశాల్లో నిర్వహిస్తుంది ప్రబిక.
‘అమ్మో... ఈ చదువు నేను చదవలేను. చనిపోవాలనిపిస్తుంది’ అనుకునే విద్యార్థిని చదువుపై ఆసక్తి పెరిగేలా చేసి దూసుకుపోయేలా చేసింది.

‘వ్యాపారంలో ఘోరమైన నష్టాలు వచ్చాయి. నుయ్యే గొయ్యే అన్నట్లుగా ఉంది నా పరిస్థితి’ అని ఆవేదన చెందిన వ్యాపారికి ధైర్యం అనే టానిక్‌ ఇచ్చి కొత్త కొత్త వ్యాపారాల్లో రాణించేలా చేసింది ప్రబిక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
‘నాకేం, అంతా సవ్యంగా ఉంది అనుకుంటాం మనం. కాని మన మనసు మూలాల్లో ఎక్కడో ఒకచోట పరాజయం, అవమానం, సంక్షోభం... మొదలైన అవశేషాలు ఎన్నో ఇరుక్కుపోయి ఉంటాయి. మనం ఎంత తేలిగ్గా ఉంటే యుద్ధంలో అంతే తేలికగా విజయం సాధించగలం. మనసులో ఎంత భారం ఉంటే విజయం అంత కష్టం. ఇలాంటి సమయాల్లోనే ఆర్ట్‌ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. మనసులోని భారాన్ని తొలిగిస్తుంది’ అంటున్న ప్రబిక స్టార్‌ ఇండియా ‘ది రియల్‌ సూపర్‌ ఉమన్‌’ అవార్డ్‌ అందుకుంది. ఆమెకు అభినందనలు.
 

రంగుల మంత్రం: ప్రబిక్‌

Advertisement

What’s your opinion

Advertisement