విధ్వంసకర పరిణామాల దిశగా... | Sakshi
Sakshi News home page

విధ్వంసకర పరిణామాల దిశగా...

Published Thu, Mar 3 2022 1:33 AM

Journalist Rehana Article On Ukraine Russia War - Sakshi

‘రష్యా లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు.’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ‘ద వరల్డ్‌ ఆర్డర్‌ 2018’  పేరుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఇది. ఉక్రెయిన్‌ గడ్డను రణరంగంగా మార్చేసిన సమ యంలో... అనేక దేశాలు రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి, యూరోపి యన్‌ యూనియన్, నాటో దేశాల ఆంక్షల నడుమ... ప్రస్తుతం రష్యా అనుసరిస్తున్న వైఖరికీ, నాటి పుతిన్‌ వ్యాఖ్యలకూ మధ్య ఒక లింక్‌ కనిపిస్తోంది. రష్యా అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉందనే ప్రశ్నకు ఓ సంకేత సమాధానం వినిపించి ఆందోళనకు గురి చేస్తోంది.

రష్యా దాడిలో ఉక్రెయిన్‌ అతలాకుతలం అవు తోంది. లక్షలాది మంది ఉక్రేనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటు తున్నారు. ఆ సాహసమూ చేసే అవకాశం లేని వాళ్ళు బంకర్లలోనో, అండర్‌ గ్రౌండ్‌ స్టేషన్ల లోనో, నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ప్రపంచ ప్రజానీకం అంతా యుద్ధోన్మాదాన్ని ఆపాలని రష్యాను కోరుతున్నారు. అయినా పుతిన్‌ పట్టించు కోవడం లేదు. రష్యా లేని ప్రపంచమే అవసరం లేదన్న పుతిన్‌ వ్యాఖ్యలు మళ్లీ మళ్ళీ వినిపి స్తున్నాయి.

ప్రపంచ దేశాల ఆంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో అణ్వాయుధ దాడికి సిద్ధం అవుతున్న సంకేతాలు పుతిన్‌ ఇచ్చేశారు. మొదటి రోజే ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ను రష్యా సేన స్వాధీనం చేసుకుందని వార్తలొచ్చాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా అణు యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని తమ అణ్వాయుధ దళా లను పుతిన్‌ ఆదేశించటం ముంచుకు రానున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ పట్టణాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని ఆ నగర వాసులకు రష్యా తాజాగా జారీ చేసిన హెచ్చరిక తీవ్ర ఆందోళనకరమైంది. అంటే 48 గంటల తర్వాత కీవ్‌ నగరంపై రష్యా విరుచుకుపడే ప్రమాదం ఉందన్న మాట. 

అణు ఆయుధాల ప్రయోగం దిశగా రష్యా వేసిన మరో ఎత్తుగడను  ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. చాలా కాలంగా రష్యాతో స్నేహం చేస్తున్న బెలారుస్‌ దేశం తాజాగా ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఉన్న అణ్వాయుధ రహిత హోదాను విడిచిపెడుతూ ఇది నిర్ణయం తీసుకుంది. అంటే రష్యా తన అణ్వాయు ధాలను బెలారుస్‌ గడ్డపై మోహరించి అటు నుంచి దాడి చేయటానికి లేదా దాడిని ప్రతిఘటించ టానికి మార్గం సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవు తోంది. 

రష్యా బ్యారెంట్స్‌ సముద్రంలో అణు జలాంతర్గాములతోనూ, సైబీరియా ప్రాంతంలో మొబైల్‌ మిస్సైల్‌ లాంచర్లతోనూ విన్యాసాలు చేయడం ద్వారా మరో అడుగు ముందుకేసింది.  రష్యా, ఉక్రెయిన్‌ల విషయాన్ని ప్రస్తావించే క్రమంలో ‘బయటి నుంచి జోక్యం చేసుకోవాలని ఎవరైనా భావిస్తే... జోక్యం చేసుకున్నట్లయితే, మీలో ప్రతి ఒక్కరూ చరిత్రలో ఎదుర్కొన్న వాటి కన్నా అతి తీవ్రమైన పర్యవసానాలను ఎదు ర్కొంటారు’ అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఈ సంకేతాలన్నీ ఒకచోట పోగేస్తే అణ్వాయుధ ప్రమాదం ఉక్రెయిన్‌ ముంగిట ఉందని స్పష్టం అవుతోంది. అదే జరిగితే ఆ విధ్వంసకర ఘటన పరిణామాలను ప్రపంచం కూడా చవిచూడక తప్పదు. ఈ వినాశకర పరిణామాలకు అడ్డుకట్ట పడాలనీ, చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలనీ కోరుకుందాం.

వ్యాసకర్త: రెహానా 
జర్నలిస్ట్‌

Advertisement
Advertisement