జనం కొరకు – జనం కన్న – జననేత జగన్‌! | Sakshi
Sakshi News home page

జనం కొరకు – జనం కన్న – జననేత జగన్‌!

Published Thu, Mar 14 2024 12:20 AM

Sakshi Guest Column On AP CM YS Jagan

లాభాలే లక్ష్యంగా గల వ్యాపారుల్లో టాటాల వంటి సామాజిక శ్రేయోభిలాషులు కొందరున్నట్లే; అధికారమే పరమావధిగా గల పాలక వర్గాల్లోనూ సేవా దృక్పథం గల మానవీయ నేతలు కొందరున్నారు. చనిపోయి గూడ బతికున్న ‘రామన్న’ – ‘రాజన్న’ల వంటి నేతలే అందుకు నిదర్శనం!

‘ఉన్నది అమ్ముకో! లేనిది కొనుక్కో’ మంటున్న గ్లోబల్‌ వ్యాపార వ్యవస్థలో, అట్టి మానవీయ నేతల్ని పది కాలాలపాటు కాపాడుకోవాలి. ముఖ్యంగా రెక్కల కష్టం తప్ప, అమ్ముకోవటానికి ఏమీ లేని పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల వారికిది అవశ్య కర్తవ్యం. అడ్డగోలుగా పెరిగిపోతున్న ఈ ఆర్థిక అసమానతల సమాజంలో మానవీయ నేతను ఎన్నుకోవటమే, కులమతాతీతంగా పేదలందరికీ శ్రీరామరక్ష!

‘డబ్బుతో అధికారం – అధికారంతో డబ్బు’గ మారిన నేటి రాజకీయ వ్యవస్థలో మానవీయ నేతల ప్రకాశాన్ని, కార్పొరేట్ల మీడియా, సోషల్‌ మీడియాలు అభాండాలు, ఆరోపణల కారుమబ్బులతో కప్పేస్తున్నాయి. అవెంతటి బలీయమైనవంటే... కేవలం నిరక్షరాస్యులనే కాదు, సగటు విద్యావంతుల్ని సైతం అపమార్గం పట్టిస్తున్నాయి. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పార్టీల నేతలందరిలోనూ మానవతా దృక్పథం కలిగిన ఏకైక నేత జగన్‌ మోహన్‌ రెడ్డే.

ఆయన హృదయం నుండి పొంగి పొరలిన ‘అమ్మ ఒడి – గోరుముద్ద – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ – పేద లందరికీ ఆంగ్ల మాధ్యమంలో విద్య – ఆరోగ్యశ్రీ – జల యజ్ఞం – రైతు భరోసా – పింఛన్ల పెంపు – పేదలకు ఇళ్ళు – వైఎస్సార్‌ ఆసరా – వైఎస్సార్‌ చేయూత వంటి సంక్షేమ పథకాలే అందుకు నిలువెత్తు నిదర్శనాలు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయాన అన్ని మతాల పెద్దల చేత ప్రార్థనలు చేయించి తనలోని ‘సర్వమత సామ రస్యత’ను చాటుకున్నారు జగన్‌. నాడు మత పెద్దలందరికీ వినమ్రంగా నమస్కరించి, అందరితో చేయి కలపటం ద్వారా ‘హిందూ–ముస్లిం– క్రిస్టియన్‌ భాయీ భాయీ – మన రాష్ట్ర ప్రగతికై కలిపి నడుద్దాం చేయీ – చేయీ’ అన్న ప్రబోధా న్నందించారు. భారతీయులకు, జాతీయ సమైక్యతా మార్గాన్ని చూపా రాయన.

ప్రమాణ స్వీకారానంతరం ‘ఇది మా మేనిఫెస్టోకు లభించిన విజయం. అందుకే నాకూ, మా పార్టీ నేత లందరికీ పవిత్ర గ్రంథం’ అని ప్రకటించ టమే గాదు, దాన్ని ఆచరించే పరీక్షలో 99 శాతం మార్కులు సాధించి, దేశంలోనే అగ్రనేతగా నిలిచారు.

సామాజిక సమతుల్యత కోసం మంత్రి పద వుల్లో సగానికి పైగా ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనారిటీ లకు కేటాయించారు. నామినేటెడ్‌ పదవుల్లోనే కాక పనుల్లోకూడా 50 శాతం వారికి కేటాయించారు. మహిళలకు కూడా ఇదే విధమైన కేటాయింపులు చేశారు. ఆలయాల ట్రస్టుల్లో బీసీ–ఎస్సీ–ఎస్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఇవన్నీ జగన్‌ మానవీయతకు దర్పణాలు. పేదలకు అందని చందమామగా ఉన్న ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందించి పేద పిల్లలకు ఆత్మబంధువ య్యారు.

అందుకే పేద విద్యార్థులు ‘మా జగన్‌ మామ’ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థల ద్వారా ఇంటింటికీ పాలనను తెచ్చి; వృద్ధులు, పేదలందరి చేత ‘మా పెద్ద బిడ్డ జగన్‌ బాబు’ అంటూ ఆత్మీయునిగా చెప్పుకోబ డుతున్న ఏకైక నేత జగన్‌! ‘సత్య నిష్ఠ’ మినహా పాలకులకు ప్రజా విశ్వాసాన్ని – మరేదీ సంపాదించలేద’న్నాడు మహాభారతంలో భీష్ముడు. మరి సత్యనిష్ఠ కలిగి ఉన్నందునే జగనన్నకంతటి జన బలం! ‘సత్య నిష్ఠ’ను పాటించక పోవటమే ‘బాబు టీడీపీ’, ‘పవన్‌ జనసేన’ల బలహీనత!

‘పేదల, అన్నదాతల జీవితాలను ఇప్పుడున్న దానికన్నా ఇంకా మెరుగు పరచటమే నా లక్ష్యం!... మీ ఈ బిడ్డ వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తిరిగి నన్ను ఆశీర్వదించ’ మంటున్నారు జగన్‌. అందుకే ‘రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో జగన్‌ను గెలిపిస్తే అది జన విజయం. మీరు గెలిచేందుకు సిద్ధమా?’ అంటూ జనాన్నే ప్రశ్నిస్తున్నారు జగన్‌. మేం సిద్ధమే అంటున్నారు జనం.  

– ఆదివిష్ణు
రాజకీయ విశ్లేషకులు ‘ 96662 65693 

Advertisement
Advertisement