Sakshi News home page

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సజావుగా చేపట్టాలి

Published Wed, Nov 29 2023 1:50 AM

-

గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి

గుంటూరు వెస్ట్‌: ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టి కృషితో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి సూచించారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో జేసీ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో 55,454 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారని పేర్కొన్నారు. సుమారు మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం 75 కేజీల ఏ గ్రేడ్‌ బస్తాకు రూ.1,652.25, సాధారణ రకానికి రూ.1,637.27 మద్దతు ధర ప్రకటించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. డిసెంబరు మొదటివారం నుంచే ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. 163 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 65 క్లస్టర్లుగా విభజించి మ్యాపింగ్‌ చేశామన్నారు. ధాన్యం కల్లంలోనే కొనుగోలు చేసి ఆర్‌బీకే కేంద్రం వద్దకు రైతుకు ఎఫ్‌డీఓ అందించి మిల్లుకు తరలిస్తామన్నారు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించుకోవద్దని పేర్కొన్నారు. ఈ–క్రాప్‌లో నమోదైన వివరాల ప్రకారం కొనుగోలు జరుగుతుందని చెప్పారు. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గన్ని బ్యాగులు, లేబర్‌, ట్రాన్స్‌పోర్టు వివరాలు యాప్‌లో నమోదు చేసి పొలంలోని కల్లం వద్దనే ధాన్యం ప్యాకింగ్‌ చేసి జీపీఎస్‌ వాహనాల్లో లోడింగ్‌ చేయాలన్నారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని పేర్కొన్నారు. దళారులు రైతులను మోసగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్తు, డీఎస్‌ఓ కోమలి పద్మ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement