తాలిబన్‌ రాజ్యం: భయాందోళనలో అఫ్గన్‌ మహిళలు

16 Aug, 2021 14:42 IST|Sakshi

అఫ్గనిస్తాన్‌ వశమైందని తాలిబన్లు సంబురాల్లో మునిగిపోతుంటే.. అంతర్జాతీయ సమాజంతో పాటు అఫ్గన్‌లోని పౌరులు సైతం ఆందోళనకు చెందుతున్నారు. ముఖ్యంగా అఫ్గన్‌ ఆడవాళ్లు తమ బతుకులు మళ్లీ చీకటి పాలవుతాయని భయపడుతున్నారు. #AfganWomen హ్యాష్‌ట్యాగ్‌ ద్వారా తమ ఆందోళనను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు.
 

దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందన్న వార్త బయటకు రాగానే.. 33 ఏళ్ల ఖటేరా సోషల్‌ మీడియా సాక్షిగా తమను కాపాడడంటూ కన్నీళ్లతో వేడుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఘజ్ని ప్రావిన్స్‌కు చెందిన ఖటేరా.. అక్కడ పోలీసాధికారి. కిందటి ఏడాది తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా కాల్చేశారు. ఆపై ఆమె కనుగుడ్లను పెకిలించి.. నరకం చూపించారు. అదృష్టవశాత్తూ ఆమె బతికింది. భారత్‌లోనే ఆమెకు ట్రీట్‌మెంట్‌ ఇప్పించగా.. కిందటి ఏడాది నవంబర్‌ నుంచి ఆమె ఢిల్లీలోనే నివసిస్తోంది. దారుణం ఏంటంటే.. ఆమెపై దాడి చేసిన తాలిబన్‌ ముఠాకు ఆమె తండ్రే నాయకుడు కావడం. 

ఇది చదవండి: ఆఫ్ఘనిస్తాన్.. ఓ అందమైన నరకం

తాలిబన్ల హింస ఎంత ఘోరంగా ఉంటుందో నేను ఉదాహరణ. అదృష్టవశాత్తూ నా ఆర్థిక స్థితి వల్ల బతికాను. అందరి పరిస్థితులు అలా లేవక్కడ. తాలిబన్ల క్రూరత్వం వర్ణించలేనంతగా ఉంటుంది. అత్యాచారాలు చేస్తారు. బుల్లెట్లను ఒంట్లోకి దింపుతారు.  చంపేసి కుక్కలకు ఆ మాంసం వేస్తారు. అలాంటిది ఇప్పుడు ఆక్కడ ఆడవాళ్ల పరిస్థితిని తల్చుకుంటే భయం వేస్తోంది. పిల్లలను కూడా వదలరు వాళ్లు అంటూ చెప్పుకొచ్చింది ఖటేరా. 


చదవండి: కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు

అఫ్గన్‌లో పరిస్థితులపై అగ్రదేశాల నుంచి నిస్పహాయత వ్యక్తం అవుతున్న తరుణంలో.. ఆడవాళ్ల భద్రత గురించే ఎక్కువ చర్చ మొదలైంది. ఆడవాళ్లను చూస్తే తాలిబన్లకు బుర్ర పని చేయదు. వాళ్ల దృష్టిలో ఆడవాళ్లంటే సెక్స్‌ బానిసలు. ద్వేషం వెల్లగక్కుతుంటారు. కేవలం పిల్లలను కనే యంత్రాలుగా చూస్తారు. ఆచారాల పేరుతో చదువుకోనివ్వరు. నచ్చిన బట్టలు వేసుకోనివ్వరు. పని చేయనివ్వరు. రాళ్లతో, కొరడాలతో కొట్టి చంపేస్తారు. చికిత్స కోసం మగ డాక్టర్ల దగ్గరకు సైతం వెళ్లనివ్వరు. చెప్పింది వినకుంటే.. ప్రాణాలు తీయడమే వాళ్లకు తెలుసు. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎన్నో కలలు నిర్మించుకున్నారు వాళ్లు. చదువుకున్నారు. చక్కటి కెరీర్‌ను మల్చుకున్నారు.  తాలిబన్ల రాకతో అవన్నీ ఇప్పుడు కూలిపోవాల్సిందే అని శోకంలో మునిగిపోతున్నారు అక్కడి వాళ్లు.
 

జులై మొదటి వారంలో బాడాక్షన్‌, తక్‌హర్‌ ప్రావిన్స్‌లో ఆడవాళ్ల జాబితాను తయారు చేయించి.. తమ బృందంలోని వాళ్లను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మళ్లీ పాతతంతు మొదలుపెట్టారనే విమర్శ మొదలైంది. అయితే మహిళల విషయంలో ఇంతకు ముందులా హింసకు పాల్పడబోమని, కానీ, కఠిన ఆంక్షల్లో చాలామట్టుకు కొనసాగిస్తామని ప్రకటించుకుంది.

>
మరిన్ని వార్తలు