Sakshi News home page

గోదావరికి కరకట్ట నిర్మిస్తాం..

Published Fri, Nov 24 2023 11:50 PM

సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌, పక్కన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దివాకర్‌రావు
 - Sakshi

● కాంగ్రెస్‌ గెలిస్తే వాడకో పేకాట క్లబ్‌ ● ముఖ్యమంత్రి కేసీఆర్‌ ● సింగరేణి సమస్యలపై ప్రస్తావన ● సభ విజయవంతంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌

శ్రీరాంపూర్‌/నస్పూర్‌: మంచిర్యాల పట్టణానికి వరదలు రాకుండా చుట్టూ కరకట్ట నిర్మిస్తామని, అవసరమైతే వచ్చే వేసవిలోనే ఈ పనులు చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌ కలెక్టరేట్‌ సమీపంలోని మైదానంలో శుక్రవారం మంచిర్యాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే వాడకో పేకాట క్లబ్‌ మొదలవుతుందని, ఇక జనాలు ఇళ్లు అమ్ముకుని పేకాట ఆడుతారని విమర్శించారు. సింగరేణి 134ఏళ్ల క్రితమే నిజాం చేతిలో ఉండేదని, తర్వాత వంద శాతం ఇది రాష్ట్ర సంస్థగా ఉంటే కేంద్రం వద్ద తెచ్చిన అప్పులు తీర్చక కాంగ్రెస్‌ పార్టీ 49శాతం వాటాను అప్పగించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇంటెక్‌, ఐటెక్‌ సంఘాలు ఉన్న వారసత్వ ఉద్యోగాలు పోగొడితే తిరిగి తాను ఇప్పించానని తెలిపారు. నేడు 15వేల మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించామని, ఉద్యోగం వద్దనుకుంటే రూ.25లక్షల మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నామని అన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మాఫీ చేయాలని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తాము తీర్మానం చేసి మోదీకి పంపించామని, ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. చివరికి ఆదానీ కోసం ఆస్ట్రేలియా బొగ్గు కొనాలని ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. లాభాల వాటాను 32శాతానికి పెంచామని, దీంతో ఇటీవల దసరా, లాభాల బోనస్‌ అన్ని కలిపి సుమారు రూ.2లక్షలకు పైగా వచ్చాయని గుర్తు చేశారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పోరాట పటిమను కూడా కేసీఆర్‌ ప్రస్తావించారు.

దివాకర్‌రావు వ్యక్తిత్వాన్ని కొనియాడిన కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో దివాకర్‌రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. దివాకర్‌రావు చాలా మంచివాడని, నిజాయతీ పరుడని, ఎప్పుడు తనకు వద్దకు సొంత పనుల కోసం రాలేదని, నియోజకవర్గానికి అది కావాలి, ఇది కావాలి అంటూ అభివృద్ధి పనుల కోసమే వచ్చేవారని తెలి పారు. 24 గంటల కరెంటు కావాలంటే దివాకర్‌రావును గెలిపించాలన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా అని కేసీఆర్‌ చెప్పడంతో సభికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి, బోడ జనార్దన్‌ పేర్లు ప్రస్తావించి వారి వర్గీయుల్లో ఉత్తేజాన్ని నింపారు.

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్‌ పర్యటన మంచిర్యాల నియోజకవర్గం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావడంతో ప్రజాఆశీర్వాద సభ గులాబీ ప్రభంజనాన్ని సృష్టించింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 11గంటలకే సభ జరగాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. వాతావరణం మబ్బుగా ఉండి చిరుజల్లులు పడడంతో సభ రద్దవుతుందేమోనని నాయకులు ఆందోళన చెందారు. చివరికి ఆలస్యమైనా సరే కేసీఆర్‌ సభకు వస్తారని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. సభకు పెద్దఎత్తు న జనాలు తరలిరావడంతో సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సమయం కావడంతో మండల స్థాయి నుంచి మొదలుకొని పెద్ద సంఖ్యలో నేతలను వేదికపై కూర్చొబెట్టారు. కాగా, జిల్లాలో ఇప్పటికే బెల్లంపల్లి, చెన్నూర్‌ నియోజవకర్గాల పరిధిలో ప్రజా ఆశీ ర్వాద సభలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గడ్డం అరవిందరెడ్డి, బోడ జనార్దన్‌, మధుసూదనచారి, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగన్న, బీఆర్‌ఎస్‌ నేత విజిత్‌రావు, నస్పూర్‌, మంచిర్యాల, లక్సెట్టిపేట మున్సిపల్‌ చైర్మన్‌లు ఈసంపల్లి ప్రభాకర్‌, పెంట రాజయ్య, నల్మాస్‌ కాంతయ్య, పార్టీ మండల అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, మంచిర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూమేశ్‌, నాయకులు వంగ తిరుపతి, సంతోషచారి, సుదమల్ల హరికృష్ణ, డి.అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, గోగుల రవీందర్‌రెడ్డి, పల్లపు తిరుపతి, హైమద్‌, సరోజ, రజిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలి

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దివాకర్‌రావు

మంచిర్యాల నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులివ్వాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు కేసీఆర్‌ను కోరారు. మంచిర్యాల, నస్పూర్‌ పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో గోదావరి వరదలు వచ్చాయని, అధికారంలోకి వచ్చాక శాశ్వత పరి ష్కారానికి కరకట్ట నిర్మించాలని కోరారు. మంచిర్యాల ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మరింత వెడల్పు చేయాలని, ఐటీ హబ్‌, ఇంజినీరింగ్‌ కాలేజీ, ఎల్లంపల్లి వద్ద టూరిజం పార్క్‌, ఆటోనగర్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. రూ.164 కోట్ల తో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మాణం, మెడికల్‌ కాలేజీ, గూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌, సింగరేణి స్థలాల్లో 3500 మందికి ఇళ్ల పట్టాలు, సింగరేణి కార్మికులకు కారుణ్య ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. మిగతా వారికి కూడా సింగరేణి పట్టాలు ఇ ప్పించాలని కోరారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఆ డబ్బులతో ఓట్లు కొనాలని చూస్తున్న వారికి ప్రజలు గు ణపాఠం చెప్పాలని ప్రేంసాగర్‌రావును ఉద్దేశించి విమర్శించారు. అభ్యర్థి గుణగణాలను చూసి ఓటెయ్యాలని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉండాలంటే మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement