Mahesh Babu: రిపీట్‌ ఆడియన్స్‌ ఉంటారు.. రాసి పెట్టుకోండి

8 May, 2022 05:56 IST|Sakshi
నవీన్, సముద్ర ఖని, పరశురాం, మహేశ్‌బాబు, కీర్తీ సురేష్, రవిశంకర్, తమన్, అనంత శ్రీరామ్‌

– మహేశ్‌బాబు

‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్‌ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్‌.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రీ రిలీజ్‌ వేడు కలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్‌.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్‌ అవుదామని హైదరాబాద్‌ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్‌ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్‌. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్‌ ది ఫేవరెట్‌ డైరెక్టర్స్‌.

ఈ సినిమాలో చాలా హైలెట్స్‌ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్‌ ట్రాక్‌ ఒకటి. ఈ ట్రాక్‌ కోసమే రిపీట్‌ ఆడియన్స్‌ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్‌ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ బెస్ట్‌ వర్క్‌ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్‌ మార్తాండ్‌ కె. వెంకటేశ్‌గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్‌ మదిగారికి థ్యాంక్స్‌.

‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్‌బ్లస్టర్స్‌ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్‌.. మన కాంబినేషన్‌లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సర్కారువారి పాట’ పాటలు విడుదల కాగానే మూవీకి గుడ్‌ ఫీల్‌ వచ్చింది. ఏ సినిమా అయినా సక్సెస్‌ కావాలంటే ఫస్ట్‌ ఫీల్‌ బాగుండాలి. రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్‌ హిట్‌ అని ముద్ర వేసుకుంటున్న సినిమా ఇది’’ అన్నారు. 

నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్‌లో మహేశ్‌గారు ‘శ్రీమంతుడు’ చేశారు. అప్పుటికి మాకు అనుభవం లేకపోయినా మమ్మల్ని నమ్మి, సినిమా చేసి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి మాకు ఇండస్ట్రీలోకి పాజిటివ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమా మాతో చేసిన పరశురాంకి థ్యాంక్స్‌. మే 12న మా సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కొట్టబోతోంది’’ అన్నారు.
మనం సూపర్‌స్టార్‌ని (మహేశ్‌బాబు) ఎలా చూద్దామనుకుంటున్నామో పరశురాంగారు ఆ పాత్రని అలాగే డిజైన్‌ చేశారు. మే 12న మాకు డబుల్‌ బ్లాక్‌ బస్టర్‌’’ అన్నారు గోపీ ఆచంట.

‘‘నాకొక బ్లాక్‌ బస్టర్‌ ఇవ్వాలన్నారు మహేశ్‌గారు. ఈ సినిమాతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు పరశురాం.
సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘మ మ మహేశ..’ పాట చూశా. ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోతుందని మాట ఇస్తున్నా. పరశురాం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు.. తన డైలాగ్స్‌ అంటే బాగా ఇష్టం.

ఇప్పుడున్న బెస్ట్‌ మాటల రచయితల్లో తను ఒక్కడు. ‘గీత గోవిందం’ చూస్తే అంత సెన్సిటివ్‌గా చెప్పే ఆర్ట్‌ ఉంది. అలాంటి డైరెక్టర్‌ ఒక మాస్‌ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘సర్కారువారి పాట’లో చూస్తారు. ‘1 నేనొక్కడినే’ అప్పుడు మహేశ్‌గారు ఎంత సపోర్ట్‌ ఇచ్చారో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్‌ సెట్‌లో కింగ్‌లా ఉంటాడు. డైరెక్టర్స్‌కి అంత నమ్మకాన్ని ఇస్తారు’’ అన్నారు.

సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారికి బెస్ట్‌ మెలోడీ పాటలు ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించాను. ఫస్ట్‌ టైమ్‌ క్లాసికల్‌గా ‘కళావతి..’ పాట వినిపించినప్పుడు నాకు వందకు రెండొందల మార్కులు వేశారు’’ అన్నారు.
 మైత్రీ మూవీస్‌ సీఈఓ చెర్రీ, డైరెక్టర్స్‌ వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేశ్, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ రెండేళ్లల్లో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు (చెమర్చిన కళ్లతో).. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్‌) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి. ఈ 12న మీ అందరికీ నచ్చే సినిమా (సర్కారువారి పాట) రాబోతోంది.. మళ్లీ మనందరికీ పండగే.
– మహేశ్‌బాబు

మరిన్ని వార్తలు