Sakshi News home page

Megastar Chiranjeevi: ఆ అంజనాదేవి కుమారుడే ఆహ్వానం పంపినట్లు ఉంది: చిరంజీవి

Published Sun, Jan 21 2024 7:50 PM

Megastar Chiranjeevi Tweet On Ayodhtya Rama Mandir Invitation - Sakshi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపులు అయోధ్య వైపే ఉ‍న్నాయి. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అయోధ్యకు చేరుకున్నారు. జనవరి 22న జరగనున్న మహా ఘట్టం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సైతం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్‌ చేశారు.  అయోధ్యలో రామ్‌లల్లాకు పట్టాభిషేకానికి ఆహ్వనం రావడం దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'చరిత్ర సృష్టిస్తోంది. చరిత్రను ఉర్రూతలూగిస్తోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి.  అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకం చూసే ఆహ్వానం రావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. ఐదు వందల సంవత్సరాలకుపైగా తరతరాలుగా వేచి చూస్తోన్న భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన 'చిరంజీవి' అయిన హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే.. స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు అనిపిస్తోంది.' అంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు. 

అంతే కాకుండా..' ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ యోగి జీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా. జై శ్రీరామ్ ' అని తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement