SPY Telugu Movie Review: 'స్పై' మూవీ రివ్యూ

29 Jun, 2023 11:55 IST|Sakshi
Rating:  

టైటిల్: స్పై 
నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, అభినవ్ గోమఠం, జిషుసేన్ గుప్తా తదితరులు
నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ-నిర్మాత: రాజశేఖర్ రెడ్డి
దర్శకత్వం: గ్యారీ బీహెచ్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
విడుదల తేదీ: 29 జూన్ 2023
నిడివి: 2h 15m

SPY Movie Review In Telugu

టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా పేరు తెగ కలవరిస్తున్నారు. హీరో నిఖిల్ కూడా ఇందులో ఉన్నాడు. తెలుగులో చిన్నహీరోగా పలు హిట్స్ కొట‍్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. అది దైవభక్తి నేపథ‍్యం. ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ తో తీసిన 'స్పై' సినిమాలో నటించాడు. విడుదలకు ముందే మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!

Nikhil Siddharth SPY Movie Rating And Cast

కథేంటి?
జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్ లో ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. శ్రీలంకలో ఓ మిషన్‌ని పూర్తిచేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఈ క్రమంలో 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. ఓ మిషన్ లో భాగంగా చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏం తెలుసుకున్నాడు? ఈ కథలో ఖాదిర్ ఖాన్, అబ్దుల్ రెహ్మాన్(జిషుసేన్ గుప్తా) ఎవరు? చివరకు మిషన్ సక్సెస్ అయిందా లేదా అనేదే 'స్పై' స్టోరీ.

SPY Movie Stills

ఎలా ఉందంటే?
సాధారణంగా స్పై సినిమాలు అనగానే కథ ఎలా ఉంటుందనేది మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ 'గూఢచారి 116' నుంచి అడివి శేష్ 'గూఢచారి' వరకు ఈ తరహా మూవీస్ చూస్తూనే ఉన్నాం. ఓ ఏజెంట్ ఉంటాడు... రా డిపార్ట్‌మెంట్.. దానికి ఓ చీఫ్.. ఆయన సదరు హీరో అనబడే ఏజెంట్‪‌కి ఓ మిషన్ అప్పగిస్తాడు. ఫైనల్ గా అది పూర్తి చేసి, విలన్ ని చంపాడా లేదా అనేదే స్టోరీ. సరిగా ఈ టెంప్లేట్‌ని ఉన్నది ఉన్నట్లు నిఖిల్ 'స్పై' సినిమా ఫాలో అయిపోయింది. పైపెచ్చు కొత్తదనం అస్సలు లేదు.

ఫస్టాప్ విషయానికొస్తే.. జోర్డాన్ లో ఆయుధాలని స్మగ్లింగ్ చేసే విలన్ ఖాదిర్ ఖాన్ ని మన రా ఏజెంట్ సుభాష్ కాల్చి చంపేస్తాడు. ఆ వెంటనే సుభాష్ ని ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే శ్రీలంకలో జై పాత్రలో నిఖిల్ ఎంట్రీ, ఓ మిషన్ పూర్తి చేసి.. స్వదేశానికి వచ్చేయడం. ఇక్కడొచ్చిన తర్వాత సుభాష్ ని ఎవరు చంపేశారో తెలుసుకోమని నిఖిల్ కు మిషన్ అప్పజెప్తారు. అలా నేపాల్ వెళ్తాడు. అక్కడ ఏజెంట్ వైష్ణవి(ఐశ్వర్య మేనన్) వీళ్ల టీమ్ తో కలుస్తుంది. ఈమెకి జై పాత్రతో గతంలో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. 

ఓ మంచి సీన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ లో ఖాదిర్ ఖాన్ కోసం వెళ్తే.. ఏజెంట్ జై టీమ్ కి బోలెడన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అలానే మన దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ అది ఎవరి చేతికి చిక్కింది? ఫైనల్ గా జై ఏం తెలుసుకున్నాడు? ఎవరిని చంపాడు లాంటివి తెలుసుకోవాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. 

టీజర్, ట్రైలర్ చూసి ఇదో మంచి ఇంటెన్స్ థ్రిల్లర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇందులో దేశభక్తి అనే కోటింగ్ తప్ప రొటీన్ రెగ్యులర్ స్పై తరహా సినిమానే. ఏ మాత్రం కొత్తదనం లేదు. అలానే చాలాచోట్ల సినిమాటిక్‌ లిబర్టీ విపరీతంగా తీసుకున్నారు. ఓ సీన్ లో ఓ అమ్మాయి చిన్నప‍్పటి ఫొటో దొరుకుతుంది. దాన్ని ఫోన్ లో ఫొటో తీసి 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో జై టీమ్ కనిపెట‍్టేస్తారు. అది కూడా కేవలం నిమిషాల్లో. ఈ సీన్ చూడగానే.. ఆడియెన్స్ మరీ అంతా పిచ్చోళ్లగా కనిపిస్తున్నారా అనే డౌట్ వస్తుంది. అలానే జై ఏజెంట్ కావడానికి, సుభాష్ చంద్రబోస్ ఫైల్ లో ఏముందనేది చూపించలేదు. పోనీ యాక్షన్ సీన్స్ అయినా కొత్తగా ఉన్నాయా అంటే అదీలేదు. బోరింగ్ కే బోరింగ్ అన‍్నట్లు తయారయ్యాయి.

Actor Nikhil In SPY Movie

ఎవరెలా చేశారు?
ఏజెంట్‌గా నిఖిల్ ఫెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. తను ఇప్పటివరకు చేయని జానర్ కావడం వల్లనో ఏమోగానీ మంచి ఈజ్ తో చేసుకుంటూ వెళ్లిపోయాడు. అభినవ్ గోమఠం.. ఏజెంట్ కమల్ పాత్రలో యాక్షన్ కంటే కామెడీనే ఎక్కువ చేశాడు. కొన్నిసార్లు ఆ కామెడీ ఓకే అనిపించినప్పటికీ.. మరికొన్నిసార్లు స్టోరీని సైడ్ ట్రాక్ పట్టించినట్లు అనిపించింది. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో ఓకే. ఏదో ఉందంటే ఉందంతే. నిఖిల్ పక్కన ఉండటం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. రానా.. కాసేపు అలా కనిపించి అలరించాడు. పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్ లాంటి మంచి నటులు ఉన్నప్పటికీ.. వాళ్లందరికీ ఒకటి రెండు సీన్లకే పరిమితం చేశారు. 

ఈ సినిమా టెక్నికల్ పరంగా అయినా బాగుందా అంటే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నప్పటికీ.. విశాల్ చంద్రశేఖర్ పాటలు థియేటర్ నుంచి బయటకొచ్చాక గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ పర్లేదు. గ్రాఫిక్స్ అయితే కొన్నిచోట్ల తేలిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. డైరెక్టర్ గ్యారీ బీహెచ్.. స్వతహాగా ఎడిటర్. కానీ ఈ సినిమాలోని ఫస్టాప్ లో కొన్ని సీన్లు అలానే ఉంచేశారు. వాటి వల్ల ల్యాగ్ అనిపించింది. వాటిని ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పుకుంటే 'స్పై'.. రెగ్యులర్ రొటీన్ బోరింగ్ డ్రామా. పెద్దగా థ్రిల్ పంచదు, అలా అని ఇంటెన్స్ స్టోరీ కూడా ఉండదు. స్పై సినిమాలను ఇష్టపడేవాళ్లకు అంతో ఇంతో ఈ చిత్రం నచ్చుతుంది.

-చందు, సాక్షి వెబ్ డెస్క్

Rating:  
(2/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు