Sakshi News home page

Corona Caller Tune: కరోనా కాలర్‌ ట్యూన్‌కు ఇక సెలవు..!

Published Mon, Mar 28 2022 8:58 AM

Corona Caller Tune Will Be Closed - Sakshi

కరోనా సమయంలో ఎంతో మందికి వినిపించిన కోవిడ్‌ కాలర్‌ ట్యూన్‌ ఇకపై మూగబోనుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్‌తో పాటుగా మరిన్ని కాలర్ ట్యూన్స్‌ వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపై ఆ కాలర్‌ ట్యూన్‌ మళ్లీ వినిపించకపోవచ్చు. కాగా, దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే కొవిడ్‌ నిబంధనలను ఎత్తివేయాలని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మార్చి 31వ తేదీ నుంచి కేవలం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలు మాత్రమే కొనసాగనున్నాయి.

అయితే, కరోనా సమయంలో ప్రజలను కోవిడ్‌ వైరస్‌పై, కోవిడ్‌ టీకాపై అవగాహన కల్పించేందుకు కేంద్రం.. టెలికాం ఆపరేటర్లతో కలిసి ఫ్రీ కాల్‌- ఆడియో ప్రకటనలు, కాలర్‌ ట్యూన్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో కరోనా తీవ్రత తగ్గడంతో ఫ్రీ కాల్‌ సందేశాలను నిలిపి వేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం ఆదివారం ఓ లేఖ రాసింది. భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం, మొబైల్‌ వినియోగదారుల నుంచి కాలర్‌ ట్యూన్‌ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చినట్లు ఆ లేఖలో పేర్కొంది. దీంతో కొవిడ్‌ కాలర్‌ ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందంటూ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది.
మరోవైపు.. గత 21 నెలలుగా ఈ కాలర్‌ ట్యూన్స్‌ వినియోగదారులకు కోవిడ్‌పై సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. అయితే కాలర్‌ ట్యూన్స్‌ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్‌ మాట్లాడటం ఆలస్యమవుతోందంటూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల అందుతున్నాయని.. అందుకే దీన్ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement