Sakshi News home page

మనుషులను చంపడం కంటే నేరం!

Published Wed, Dec 16 2020 2:58 PM

Karnataka New BIll Prevention of Slaughter And Prevention of Cattle - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గో సంరక్షణ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ స్లాటర్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్యాటిల్‌) బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్‌ 9న ఆమోదించింది. అలాంటి చట్టాలు కలిగిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లు మరీ కఠినంగా ఉంది. ఆవులే కాకుండా ఎద్దులు, లేగ దూడలను చంపడం నేరం. 13 ఏళ్ల లోపు బర్రెలను చంపడం కూడా నేరం. వాటిని స్మగ్లింగ్‌ చేయడం, ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడం కూడా నేరం. ఈ నేరాలకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంటే, నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి కారణమైతే విధించే శిక్షకన్నా ఇది పెద్ద శిక్ష. ఉద్దేశ పూర్వకంగా కాకుండా కేవలం నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి బాధ్యుడైన వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి జరిమానాతో కూడిన జైలు శిక్ష కూడా విధిస్తారు. 

ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు పౌష్టికాహారం కోసం చౌకగా దొరికే ఆవు, ఎద్దు, బర్రె మాంసాలపైనే ఆధారపడతారు. ఇలాంటి చట్టాల వల్ల వారి నోట్లో మట్టిపడుతుంది. ప్రభుత్వమే వారి పౌష్టికాహారం బాధ్యత తీసుకుందనుకుంటే తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. వారందరికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తుందనుకుంటే భారత్‌లో పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. దేశంలో పాడి పరిశ్రమ టర్నోవర్‌ 6.5 లక్షల కోట్ల రూపాయలు. దేశంలోని రైతులకు గోధుమలు, వరి కలిపి అమ్మితే వచ్చే లాభం కన్నా పాడి పరిశ్రమ వల్ల ఎక్కువ లాభం వస్తోంది.
(చదవండి: రణరంగమైన విధాన పరిషత్)

డెయిరీలకు పాలను సరఫరా చేసేది ఎక్కువగా పశు పోషకులు, రైతులే. పాలివ్వడం మానేసిన ఆవులను, బర్రెలను, వ్యవసాయానికి పనికి రాని ఎద్దులను కబేలాలకు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బే యాదవులు, రైతుల పాడి పరిశ్రమకు ప్రధాన పెట్టుబడి. అందుబాటులో ఉన్న 2014 సంవత్సరం లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పశువులను కబేలాలకు తరలించడం ద్వారా ఏటా వచ్చిన సొమ్ము అక్షరాల 1,180 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా పశు వధ నిషేధం వల్ల రైతులు సరాసరి సగటున నెలవారి ఆదాయం 6,427 రూపాయలను కోల్పోయారని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. 

1970లో దేశంలో క్షీర విప్లవాన్ని తీసుకొచ్చిన ‘అముల్‌’ వ్యవస్థాపకులు వర్గీస్‌ కురియన్‌ కూడా మొదటి నుంచి పశు వధ నిషేధ చట్టాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ‘పశు సంపదను, పాడి పరిశ్రమను పరిరక్షించుకోవాలంటే అనారోగ్య, నిరుపయోగ పశువులను కబేలాలకు తరలించడమే ఉత్తమమైన మార్గం’ అని కురియన్, ‘ఐ టూ హ్యాడ్‌ ఏ డ్రీమ్‌’ పేరిట రాసుకున్న తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. దేశంలో పనికిరాని పశువుల బాధ్యతలను స్వీకరించి అవి చనిపోయే వరకు మీరుగానీ, మరెవరైనగానీ స్వీకరిస్తారా? అంటూ పూరి శంకరాచార్యను కురియన్‌ ప్రశ్నించగా, ఆయన తన వద్ద సమాధానం లేదని చెప్పారు.
(చదవండి: కర్ణాటక పశు సంరక్షణ)

నిషేధం ఉన్న చోట తగ్గుతున్న పశువుల సంఖ్య
‘2019–లైవ్‌స్టాక్‌ సెన్సెక్స్‌’ ప్రకారం పశు వధ నిషేధం ఉన్న రాష్ట్రాల్లోనే పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2012 నుంచి 2019 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పశువుల సంఖ్య వరుసగా 10.07, 4.42 శాతం, 3.93 శాతం తగ్గుతూ వచ్చింది. ఎలాంటి నిషేధం లేని పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇదే కాలానికి పశువుల సంఖ్య 15.18 శాతం పెరిగింది. ఇదే కాలానికి ఎవరూ పోషించక పోవడంతో రోడ్డున పడ్డ ఊర పశువుల సంఖ్య ఉత్తర ప్రదేశ్‌లో 17.34 శాతం, మధ్యప్రదేశ్‌లో 95 శాతం, గుజరాత్‌లో 17.59 శాతం పెరగ్గా, అదే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో పశువుల సంఖ్య 73.59 శాతం తగ్గింది. 

పంటల నష్టం...ప్రాణ నష్టం
రోడ్డున పడ్డ పశువుల వల్ల రైతులకు ఓ పక్క పంటల నష్టం వాటిల్లుతుండగా, మరోపక్క పశువుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరగుతోంది. హర్యానాలో గత రెండేళ్లలో అనాథ పశువులు అడ్డంగా రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 241 మంది మరణించారు. 

Advertisement

What’s your opinion

Advertisement