Sakshi News home page

Lok Sabha Elections 2024: ఈసీ ‘మెనూ కార్డు’

Published Sat, Mar 30 2024 5:05 AM

Lok Sabha Elections 2024: Election Commission of India Keeps Close Watch on Election Spending Limits - Sakshi

ఒకే ఐటం.. ప్రాంతానికో రేటు

అభ్యర్థులకు రేట్లు నిర్ధారించిన ఈసీ

ఒక్క సమోసా...రూ.7 నుంచి 15

కిలో మటన్‌ కేవలం రూ.500 

కిలో చికెన్‌ మాత్రం రూ.250

చాయ్‌కి పంజాబ్‌లోని జలంధర్‌లో రూ.15. అదే మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో అయితే రూ.7. సమోసా కూడా పంజాబ్‌లో రూ.15 అయితే మధ్యప్రదేశ్‌లో రూ.7.5. ఏమిటీ ధరలంటారా? లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులకు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరలివి. వీటిని జిల్లా ఎన్నికల విభాగాలు స్థానికంగా నిర్ధారిస్తుంటాయి. దాంతో అవి ఒక్కో ప్రాంతానికి ఒక్కోలా ఉంటాయి.

అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితి ఉందన్నది తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యరి్థకి ఈసీ నిర్ధారించిన పరిమితి రూ.95 లక్షలు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రం రూ.75 లక్షలు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.75–95 లక్షల మధ్య ఉంది. నామినేషనల్‌ దాఖలు చేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ డేగ కళ్లతో గమనిస్తూ ఉంటుంది.

ఇందుకోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభా వేదికలు మొదలుకుని కార్యకర్తలు, అభిమానులకు ఆహారం దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్‌ చేస్తుంది. అయితే వాటికీ, వాస్తవ ధరలకూ చాలాసార్లు పొంతనే ఉండదు. దాంతో ఈసీ ‘మెనూ కార్డు’పై మీడియాలో, సోషల్‌ మీడియాలో జోకులు పేలుతుండటం పరిపాటి. మరోవైపు, ఎన్నికల వ్యయంపై అభ్యర్థులకు పరిమితి ఉన్నా పార్టీలు చేసే ఖర్చుకు మాత్రం అలాంటిదేమీ లేకపోవడం విశేషం!

చాయ్‌ రూ.5 నుంచి 15 దాకా...
చాయ్‌ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి రూ.5 నుంచి రూ.15 దాకా ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కప్పు చాయ్‌ రూ.5, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్‌ వడా, పోహా–జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు రూ.30. మణిపూర్‌లో జాతుల హింసకు కేంద్రాల్లో ఒకటైన తౌబల్‌ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ రూ.10. రాష్ట్రంలోని తెంగ్‌నౌపాల్‌ జిల్లాలో బ్లాక్‌ టీ రూ.5, సాదా టీ రూ.10. మణిపూర్‌లో బాతు మాంసం రూ.300. పంది మాంసం రూ.400. ఇక్కడి ఈసీ మెనూలో చికెన్‌తో పాటు చేపలు కూడా ఉన్నాయి. జలంధర్‌లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్‌కు రూ.250, మటన్‌కు రూ.500. మిఠాయిల్లో ధోడా రూ.450, ఘీ పిన్నీ రూ.300. గ్లాసు లస్సీ రూ.20, నిమ్మరసం రూ.15.

చెన్నైలో తగ్గిన చికెన్‌ బిర్యానీ రేటు  
చెన్నైలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్‌ ధరను రూ.10 నుంచి రూ.15కు ఈసీ పెంచింది. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్‌ బిర్యానీ ధరను మాత్రం రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం విశేషం! ఢిల్లీ శివార్లలో నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్‌లో వెజ్‌ భోజనం రూ.100. సమోసా, చాయ్‌ రూ.10. కచోరీ రూ.15, శాండ్‌విచ్‌ రూ.25, జిలేబీ కిలో రూ.90. ఉత్తర గోవాలో బటాటా (ఆలూ) వడ, సమోసా రూ.15. చాయ్‌ రూ.15, కాఫీ రూ.20. హరియాణాలోని జింద్‌లో దాల్‌ మఖానీ, మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ రూ.130. మటర్‌ పనీర్‌ రూ.160. ఇక్కడ ఈసీ మెనూలో బటర్‌ నాన్, మిస్సీ రోటీ, ప్లెయిన్‌ రోటీలతో పాటు కాజూ కట్లీ, గులాబ్‌జామ్‌ వంటివి కూడా ఉన్నాయి.              

వీటికీ రేట్లు ఫిక్స్‌...
► ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌజ్‌లతో పాటు పూలు, కూలర్లు, టవర్‌ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది.
► సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు మొదలుకుని టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్‌... ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది.
► దండల్లో కూడా గులాబీ, బంతి... ఇలా పూలను బట్టి రేట్లు నిర్ణయమయ్యాయి. పార్టీల జెండాలు, టోపీలకూ అంతే.
► సభలు, సమావేశాలకు వేదికలు, నేతలకు బస తదితరాలతో పాటు ప్రకటనలు, హోర్డింగులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రికి కూడా ఇంత అని ఈసీ ముందే రేట్లు ఫిక్స్‌ చేసి పెట్టింది.

కొసమెరుపు:
ఎన్నికల వేళ కార్యకర్తలకు పారీ్టలు, అభ్యర్థులు మద్యం   అందుబాటులో ఉంచడం బహిరంగ రహస్యమే. కానీ ఈసీ మెనూలో మద్యానికి మాత్రం చోటులేకపోవడం విశేషం.

  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

What’s your opinion

Advertisement