Sakshi News home page

Lok Sabha polls 2024: సోషల్‌ మీడియా... నయా యుద్ధరంగం

Published Tue, Mar 19 2024 5:12 AM

Lok Sabha polls 2024: Social media, influencers become campaign tools - Sakshi

ఎన్నికల ప్రచారంలో కొన్నేళ్లుగా కీలక పాత్ర

సోషల్‌ సైట్లలో ప్రచారమే ఇప్పటి ట్రెండు

అదే బాట పడుతున్న పార్టీలు, నేతలు

సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లకు పెరుగుతున్న డిమాండ్‌

ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు. ఇప్పుడా రోజులు పోయాయి. అక్కడక్కడా ఫెక్సీలున్నా అవన్నీ బడా నేతల దృష్టిలో పడేందుకు చోటా, మోటా లీడర్ల ప్రయత్నాల్లో భాగమే. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియాది కీలక పాత్ర.

వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌... రీల్స్, షార్ట్స్, మీమ్స్‌.. మాధ్య మమేదైనా సరే.. ఓటరు మానసిక స్థితిని ప్రభావితం చేసే మార్గాలే! అందుకే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. పార్టీలు తమ విధానాలను బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సోషల్‌ బాట పడుతున్నాయి...

కరోనా తర్వాతి ప్రపంచంలో సమాచార సాధనంగా సోషల్‌ మీడియా పట్ల దృక్పథమే పూర్తిగా మారిపోయింది. డేటా–సేకరణ, విజువలైజేషన్‌ ప్లాట్‌ఫాం స్టాటిస్టికా ప్రకారం ఫేస్‌బుక్‌కు భారత్‌లో 36.7 కోట్ల యూజర్లున్నారు. వాట్సాప్‌కు 50 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లున్నారు. వారి అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో వీటితో పాటు ఎక్స్, ఇన్‌స్టా, వాట్సప్‌ చానళ్లదీ కీలక పాత్రే. అందుకే పార్టీలు ప్రచారానికి సోషల్‌ ప్లాట్‌ఫాంలను ఎంచుకుంటున్నాయి.

ఫేస్‌బుక్‌లో ప్రతి పార్టీకీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి దాకా ఓ పేజ్‌ ఉంది. ప్రతి రాజకీయ నాయకుడికీ ఓ సైన్యమే ఉంది. ఇక వాట్సాప్‌ గ్రూప్‌లకైతే కొదవే లేదు. ఇవి కూడా జాతీయ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కులాలు, మతాలవారీగా ఎప్పుడో ఏర్పాటయ్యాయి. ఈ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలనే ఆయుధంగా చేసుకుని బీజేపీ 2014లో అధికారంలోకి వచి్చంది. ఎక్స్‌లో ప్రధాని మోదీకి ఏకంగా 9.7 కోట్ల ఫాలోయర్లున్నారు. రాహుల్‌కు 2.5 కోట్ల మంది ఉన్నారు.

పర్సనల్‌ అప్రోచ్‌..  
ఎన్నికలంటే ఇంటింటికీ వెళ్లి ఓట్లగడం పాత పద్ధతి. ఇప్పుడంతా పర్సనల్‌ అప్రోచ్‌. బీజేపీ ఇటీవల వాట్సాప్‌ ఉన్న వాళ్లందరికీ ‘ప్రధాని నుంచి లేఖ’ పంపింది. కేంద్రం ఇప్పటిదాకా ఏం చేసింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని పౌరులను కోరింది. ‘మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ మోదీ’ అనే వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది. మోదీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నదీ చెబుతూ వీడియో చేసి పెట్టడానికి వీలు కల్పించింది.

సాధారణ పౌరుడిని ప్రధానే నేరుగా అభిప్రాయం కోరడం, ఓటేయడానికి కారణాన్ని అడిగి తెలుసుకోవడం కచి్చతంగా వారి అభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మారుస్తుందన్నది బీజేపీ అంచనా. రాహుల్‌ గాంధీ వాట్సాప్‌ చానల్‌ను కాంగ్రెసే నిర్వహిస్తోంది. అందులో రాహుల్‌ ప్రజలతో సంభాíÙస్తారు. వారి ప్రశ్నలకు బదులిస్తారు. ఈ వాట్సాప్‌ సమాచారం సర్క్యులేషన్‌ను జిల్లా స్థాయిలో పర్యవేక్షిస్తారు. ఎక్కువ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా మరింత ఎక్కువ మంది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా అనుసంధానం కావచ్చన్నది కాంగ్రెస్‌ భావన.
 
ప్రభావశీలతపై సందేహాలూ..  
సోషల్‌ మీడియా ప్రభావంపై అనుమానాల్లేకపోయినా ఓటర్లుగా ఫలానా పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేయడంలో వాటి శక్తిపై మాత్రం సందేహాలున్నాయి. వాటి ప్రచారం తటస్థ ఓటర్ల వైఖరిలో మార్పు తేవచ్చేమో గానీ సంప్రదాయ ఓటర్లు, పార్టీ మద్దతుదారుల అభిప్రాయాలను ప్రభావితం చేయబోదని విశ్లేషకుల అంచనా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థి కులం, స్థానిక అనుబంధం, పార్టీకి విధేయత వంటివే సంప్రదాయ ఓటర్లను ప్రభావితం చేస్తాయంటున్నారు. అభ్యర్థి చరిష్మా, విశ్వసనీయత, పార్టీకి ప్రజాదరణ కూడా ఓటర్లను కదిలిస్తాయని విశ్లేషిస్తున్నారు.  

కీలకంగా ఇన్‌ఫ్లుయెన్సర్లు...
సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు. ఎక్కువమందిని ఆకర్షించగల, ప్రభావితం చేయగల వ్యక్తులు. రీల్స్, షార్ట్స్‌ ప్రాచుర్యంతో వీరి ప్రాబల్యం మరింతగా పెరిగింది. ఎన్నికల్లో కూడా కీలక ప్రచారకర్తలుగా మారారు. సామాజిక మాధ్యమాల్లో 10,000 మంది ఫాలోయర్స్‌ ఉన్నవారిని ‘నానో’ ఇన్‌ఫ్లూయెన్సర్లని, లక్ష దాకా ఉంటే మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు, 10 లక్షలుంటే మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు, అంతకు మించితే మెగా ఇన్‌ఫ్లుయెన్సర్లని అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఇన్‌ఫ్లూయెన్సర్లు కీలకంగా మారారు.

ముందున్న బీజేపీ..  
2024 సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డిమాండ్‌ పెరిగింది. పార్టీలు వారికి ప్రధాన ఖాతాదారులుగా మారుతున్నాయి. ఈ విషయంలో బీజేపీ ముందుంది...
► ప్రభుత్వ పథకాలపై కంటెంట్‌ కోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో కలిసి పని చేయడానికి నాలుగు ప్రైవేట్‌ ఏజెన్సీలను ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పార్లమెంటుకు తెలిపారు. ఇదంతా బీజేపీకి లబ్ధి చేసేదే.
► వివిధ ప్రాంతాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లతో బీజేపీ 50కి పైగా సమావేశాలను ఏర్పాటు చేసింది. మోదీ నేతృత్వంలో మంత్రులు కూడా ప్రధాన చానళ్లకు బదులు పాడ్‌కాస్ట్‌ షోలు, యూట్యూబ్‌ చానళ్లలో కనిపిస్తున్నారు.
► ఎస్‌.జైశంకర్, స్మృతీ ఇరానీ, పీయూష్‌ గోయల్, రాజీవ్‌ చంద్రశేఖర్‌ వంటి కేంద్ర మంత్రులు యూట్యూబ్‌లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లున్న పాడ్‌కాస్టర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియాకు ఇంటర్వ్యూలిచ్చారు.


కాంగ్రెస్‌దీ అదే బాట...
ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలను వాడుకునే విషయంలో కాంగ్రెస్‌ కూడా ఏమీ వెనకబడి లేదు. భారత్‌ జోడో యాత్రలోనూ, తాజాగా ముగిసిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలోనూ వారిని బాగానే ఉపయోగించుకుంది...
► రెండు జోడో యాత్రల్లోనూ ప్రధాన మీడియా కంటే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకే రాహుల్‌ ప్రాధాన్యమిచ్చారు.
► ‘అన్‌ ఫిల్టర్డ్‌ విత్‌ సమ్‌దీశ్‌’ యూ ట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  
► ట్రావెల్‌ అండ్‌ ఫుడ్‌ వీడియో పాడ్‌కాస్ట్‌ కర్లీ టేల్స్‌ వ్యవస్థాపకుడు కామియా జానీతో తన భోజనం తదితరాల గురించి పిచ్చాపాటీ మాట్లాడారు.
► రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తన హయాంలో ‘జన్‌ సమ్మాన్‌’ వీడియో పోటీలు నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై సోషల్‌ ప్లాట్‌ఫాంల్లో 30 నుంచి 120 సెకన్ల వీడియోలు షేర్‌ చేసిన వారిలో విజేతలకు నగదు బహుమతులిచ్చారు.

దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వ్యాప్తి సగటున 40 శాతం ఉందని అంచనా. ఆ లెక్కన 2 లక్షల ఓటర్లుండే అసెంబ్లీ స్థానంలో సోషల్‌ మీడియా ద్వారా కనీసం 70 నుంచి 80 వేల మందిని ప్రభావితం చేసే వీలుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. చాలాసార్లు విజేతను తేల్చడంలో ఐదారు వేల ఓట్లు కూడా నిర్ణాయకంగా మారుతున్న నేపథ్యంలో ఇది చాలా పెద్ద సంఖ్యేనని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే సోషల్‌ మీడియాను ఇప్పుడు ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకోవడం లేదు.                        
– అంకిత్‌ లాల్, అడ్వైజర్, పొలిటికో

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

What’s your opinion

Advertisement