ఒకేసారి 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభించిన మోదీ.. తెలుగు రాష్ట్రాలకు..

24 Sep, 2023 12:53 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో తొమ్మిది వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌ విధానంలో వందే భారత్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. దీంతో, తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 

ఇక, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ రైలును ప్రారంభించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాకే రైల్వేశాఖ నూతన శకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అభివృద్ధి చేపడుతున్నారు. ఒకేసారి 9 వందే భారత్‌ రైళ్లను నేడు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో వందే భారత్‌ రైలు కాచిగూడ, బెంగళూరు ప్రారంభమైంది. మూడు రాష్ట్రాలు, 12 జిల్లాలకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఈ రైలు ఉంటుంది. 

వచ్చే నెల 1న మహబూబ్ నగర్, వచ్చే నెల 3న నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తెలంగాణలో కొత్త రైల్వే ప్రోజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణకు రూ.4418 కోట్ల బడ్జెట్ రైల్వే అభివృద్ది కోసం కేంద్రం కేటాయించింది. రూ.31,200 కోట్ల రైల్వే ప్రోజెక్టులు పనులు సాగుతున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ది కూడా చేపట్టబోతున్నాం అని కామెంట్స్‌ చేశారు. 

కాచిగూడ-బెంగళూరు
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్‌లోని కాచిగూడ-బెంగళూరులోని యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధరంవరం స్టేషన్లలో  స్థానికంగా ఆగుతుంది. ఈ రైలులో 530 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏడు ఛైర్‌ కార్ కోచ్‌లు ఉంటాయి.

విజయవాడ-చెన్నై వందే భారత్‌
చెన్నైలో ప్రధాని మోదీ ప్రారంభించిన రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇది. ఈ రైలు తిరుపతి పుణ్యక్షేత్రానికి రేణిగుంట మార్గంలో వెళ్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా విజయవాడ, చెన్నై మధ్య నడుస్తుంది. 6:40 గంటల్లోనే విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణం పూర్తి కానుంది. 
టిక్కెట్ ధర ఛైర్ కార్ : రూ.1,420, 
ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర : రూ.2,630.

 

మరిన్ని వార్తలు