Sakshi News home page

డేరా బాబా: జెడ్‌ ఫ్లస్‌ కేటగిరీ భద్రతా? యస్‌.. ఆయన్ని హార్డ్‌కోర్‌ క్రిమినల్‌గా చూడకూడదట!!

Published Tue, Feb 22 2022 5:04 PM

Z Plus Security Row: Dera chief Gurmeet Ram Rahim Not Hardcore Criminal - Sakshi

డేరా సచ్ఛ సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జడ్‌ ఫ్లస్‌ లెవల్‌ సెక్యూరిటీ అందించడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఖలిస్థాన్‌ ప్రేరేపిత సంస్థల నుంచి డేరా బాబాకు ప్రాణహాని ఉందన్న కారణం చెబుతూ..  జెడ్‌ఫ్లస్‌ లెవల్‌ ప్రొటెక్షన్‌ కల్పించింది హర్యానా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. అభ్యంతరాలపై హర్యానా సర్కార్‌ వివరణ ఇచ్చుకుంది.

ఫర్లాగ్‌(తాత్కాలిక సెలవు) మీద ప్రస్తుతం బయట ఉన్న డేరాబాబాకు జెడ్‌ఫ్లస్‌ సెక్యూరిటీ అందించడం తప్పేం కాదని సమర్థించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ‘డేరా సచ్ఛ సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ హార్డ్‌ కోర్‌ క్రిమినల్‌ ఏంకాదు. శిక్షలు అనుభవిస్తున్న కేసుల్లోనూ స్వయంగా ఆయనే హత్యలు చేయలేదు. నేరపూరిత కుట్ర, సహ నిందితుడిగా మాత్రమే ఉన్నారు. హర్యానా ప్రిజనర్స్‌ యాక్ట్‌ కూడా ఆయన్ని హార్డ్‌ కోర్‌ క్రిమినల్‌గా పరిగణించకూడదని చెబుతోంది’ అని జైళ్ల శాఖ రూపొందించిన ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం.


 
2017లో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్‌ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్‌తక్‌ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో హర్యానా జైళ్ల శాఖ 21 రోజుల ఫర్లాగ్‌ జారీచేయగా.. ఫిబ్రవరి 7వ తేదీన బయటకు వచ్చిన గుర్మీత్‌ తన గురుగ్రామ్‌ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే పంజాబ్‌ ఎన్నికలను ప్రభావం చేసేందుకే డేరా బాబా బయటకు వచ్చాడని, పైగా ఒక క్రిమినల్‌కు జెడ్‌ ఫ్లస్‌ సెక్యూరిటీ అందించడం ఏంటని? అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోర్టు.

వివరణ.. 
సునారియా జైళ్ల సూపరిడెంట్‌ సునీల్‌ సంగ్వాన్‌ ఈ మేరకు హర్యానా ‍ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. హర్యానా అడ్వొకేట్‌ జనరల్‌ నుంచి న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నాకే గుర్మీత్‌కు ఫర్లాంగ్‌ జారీ చేసినట్లు వెల్లడించారు. డేరా చీఫ్‌ను హర్యానా గుడ్‌ కండక్ట్‌ ప్రిజనర్స్‌(టెంపరరీ రిలీజ్‌)యాక్ట్‌ కింద హార్డ్‌కోర్‌ క్రిమినల్‌గా పరిగణించరాదని ఏజీ జనవరి 25నే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 

భారతదేశంలో భద్రతా కేటగిరీ
X, Y, Y-Plus, Z మరియు Z-Plus. చివరిది జెడ్‌ ఫ్లస్‌ వర్గం ప్రముఖులకు మాత్రమే కేటాయించబడుతుంది. ఈ కేటగిరీలు కాకుండా.. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కవర్ కేవలం ప్రధాని, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్‌, ప్రియాంకలకు కూడా ఎస్‌పిజి భద్రత కల్పించారు. కానీ ఇది తరువాత Z-ప్లస్ కేటగిరీకి మార్చేశారు. Z-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ సెక్యూరిటీకిగానూ 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం ఇద్దరిని (ప్లస్ ఎనిమిది మంది) అందిస్తారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు.

Advertisement

What’s your opinion

Advertisement